ట్రెండ్‌ మారింది గురూ..ఉద్యోగం వద్దు మహాప్రభో..కారణం అదేనా!

30 Oct, 2022 14:13 IST|Sakshi

నెలంతా పనిచేసి ఒక రోజు జీతం తీసుకోవడం పాత తరం మాట.  రోజూ పనిచేయడం, వ్యాపారాల్లో రాణించడం నేటి మాట. డిగ్రీలు చేతపట్టుకొని ఉద్యోగాల కోసం వేల రూపాయలు ఖర్చు చేసి కోచింగ్‌లు తీసుకోవడం, చివరకు ఉద్యోగాలకు ఎంపిక కాక నిరాశ పడడం వంటి రోజులకు కాలం చెల్లింది. చదువు పూర్తి చేసుకున్న నేటి యువత తమ కాళ్ల మీద నిలబడే మనస్త్వత్వం పెరిగింది.

ట్రెండ్‌ మారిందండోయ్‌
నేటి యువత.. ఒకరి మీద ఆధార పడటం, ఒకరి కింద పనిచేయడం కాకుండా సొంతంగా వ్యాపారం చేసుకోవడంపై దృష్టి సారిస్తున్నారు. ఎంతో మంది యువత వ్యాపారంలో విజయవంతంగా రాణిస్తున్నారు. పిల్లల ఆశయాలకు అనుగుణంగా ప్రస్తుత సమాజంలో తల్లిదండ్రులు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. వ్యాపారాల్లో రాణించాలనుకుంటున్న యువతకు ప్రభుత్వం పరిశ్రమల శాఖ నుంచి ప్రోత్సహం అందిస్తోంది. మరోవైపు బ్యాంకుల ఆర్థిక సహాయం వల్ల వ్యక్తిగతంగా జీవితంలో రాణిస్తున్నారు. 

35 ఏళ్లకే స్థిరపడేందుకు ప్రణాళిక  
ఏళ్ల తరబడి ఉద్యోగాల్లో పనిచేసే రోజులు పోయాయి.సాధారణ డిగ్రీ, ప్రొఫెషనల్‌ కోర్సులు  21 సంవత్సరాలకు పూర్తి చేసుకుంటున్న యువత ఆ వెంటనే స్థిర పడేందుకు ప్రణాళిక రూపొందించుకుంటోంది. ఏళ్ల తరబడి పోటీ పరీక్షల పేరుతో సమయాన్ని వృథా చేయకుండా మార్కెట్‌ ట్రెండ్‌లను గుర్తించి వ్యాపారంలో రాణిస్తున్నారు. ప్రస్తుతం ఇదే ఒరవడి కనిపిస్తోంది.

వ్యాపారంలోకి  25 ఏళ్లకే  వచ్చి, 35 ఏళ్లకే ఆర్థికంగా స్థిరపడాలన్న ఆలోచనతో ముందుకు సాగుతున్నారు. ఆర్థికంగా ఎదిగిన యువ వ్యాపారులు బిట్‌ కాయిన్, స్టాక్‌ మార్కెట్, షేర్స్, మ్యూచివల్‌ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. యువతలో వస్తున్న ఈ మార్పునకు తల్లిదండ్రులు, బంధువులు సైతం వెన్ను దన్నుగా నిలుస్తున్నారు. వారి ఆలోచనలను గౌరవిస్తున్నారు. చేదోడు వాదోడుగా ఉంటున్నారు.

చదవండి: ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. వాళ్లకి ప్రభుత్వం నుంచి ప్రతి నెలా పెన్షన్‌! 

మరిన్ని వార్తలు