హైదరాబాద్‌లో ట్రంప్‌ హౌసింగ్‌

14 Dec, 2022 02:25 IST|Sakshi

దేశవ్యాప్తంగా ఐదు ప్రాజెక్టులు

డొనాల్డ్‌ ట్రంప్‌ ఆర్గనైజేషన్‌ రెడీ

పుణే: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కంపెనీ దేశీయంగా మూడు నుంచి ఐదు హౌసింగ్‌ ప్రాజెక్టులు చేపట్టనుంది. ట్రంప్‌ రియల్టీ కంపెనీ ట్రంప్‌ ఆర్గనైజేషన్‌ 2023లో హైఎండ్‌ రెసిడెన్షియల్‌ ప్రాపర్టీల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. దీనిలో భాగంగా బెంగళూరు, హైదరాబాద్, చండీగఢ్, లూధియానాలలో మూడు నుంచి ఐదు ప్రాజెక్టుల నిర్మాణాలు చేపట్టనుంది.

ఇందుకు దశాబ్ద కాలంగా కల్పేష్‌ మెహతా ప్రమోట్‌ చేసిన ఢిల్లీ కంపెనీ ట్రైబెకా డెవలపర్స్‌తో కొనసాగుతున్న ప్రత్యేక లైసెన్సింగ్‌ ఒప్పందాన్ని వినియోగించుకోనుంది. ట్రంప్‌ బ్రాండ్‌ ప్రాపర్టీల ఏర్పాటుకు ట్రైబెకా రూ. 2,500 కోట్లవరకూ ఇన్వెస్ట్‌ చేయనున్నట్లు మెహతా ఇక్కడ జరిగిన ఒక సదస్సు సందర్భంగా వెల్లడించారు. సదస్సుకు ట్రంప్‌ ఆర్గనైజేషన్‌ వైస్‌ప్రెసిడెంట్‌ డొనాల్డ్‌ ట్రంప్‌ జూనియర్‌ హాజరయ్యారు. ఇద్ద రూ వార్టన్‌లో కలసి చదువుకోవడం గమనార్హం!

8 ప్రాజెక్టులకు ఓకే
రానున్న 12 నెలల కాలంలో రూ. 5,000 కోట్ల విలువైన 7–8 ప్రాజెక్టులు చేపట్టేందుకు సంతకాలు చేసినట్లు మెహతా వెల్లడించారు. వీటిలో సగం నిధులను మూడు ట్రంప్‌ బ్రాండ్‌ ప్రాజెక్టులకు వెచ్చించనున్నట్లు తెలియజేశారు. ఇందుకు అనుగుణంగా ముంబై, పుణే, ఢిల్లీ ఎన్‌సీఆర్‌తోపాటు బెంగళూరు, హైదరాబాద్‌ వంటి కొత్త నగరాలవైపు చూస్తున్నట్లు పేర్కొన్నారు. ట్రంప్‌ ప్రాజెక్టుల ఏర్పాటుకు చండీగఢ్, లూధియానాలలో డెవలపర్స్‌తో చర్చలు జరుపుతున్నట్లు ట్రైబెకా సీఈవో హర్షవర్ధన్‌ ప్రసాద్‌ తెలియజేశారు.  

ఇప్పటికే నాలుగు
దేశీయంగా ఇప్పటికే నాలుగు ట్రంప్‌ బ్రాండ్‌ ప్రాపర్టీలు ఏర్పాటయ్యాయి. తద్వారా యూఎస్‌ వెలుపల ట్రంప్‌ కంపెనీకి ఇండియా అతిపెద్ద మార్కెట్‌గా నిలుస్తోంది. నాలుగు ప్రాజెక్టులు విక్రయానికి వీలైన 2.6 మిలియన్‌ చదరపు అడుగుల(ఎస్‌క్యూఎఫ్‌టీ) ప్రాంతాన్ని కలిగి ఉన్నాయి. వీటిలో 0.27  మిలియన్‌ ఎస్‌క్యూఎఫ్‌టీ పంచ్‌శీల్‌ బిల్డర్స్‌(పుణే), 0.56 మిలియన్‌ ఎస్‌క్యూఎఫ్‌టీ మాక్రోటెక్‌ డెవలపర్స్‌(ముంబై) దాదాపు విక్రయంకాగా.. 1.36 మిలియన్‌ ఎస్‌క్యూఎఫ్‌టీ ఎం3ఎం గ్రూప్‌(గురుగ్రామ్‌) దాదాపు సిద్ధమైనట్లు మెహతా పేర్కొన్నారు. ఇక మరో 0.42 మిలియన్‌ ఎస్‌క్యూఎఫ్‌టీ యూనిమార్క్‌ గ్రూప్‌(కోల్‌కతా) నిర్మాణంలో ఉన్నట్లు తెలియజేశారు.

మరిన్ని వార్తలు