ఎల్లుండి నిర్మాణ పనులు బంద్‌

2 Apr, 2022 00:21 IST|Sakshi

నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదలకు నిరసనగా

డెవలపర్ల సంఘాల నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: సిమెంట్, స్టీల్, అల్యూమి నియం, పీవీసీ పైపులు వంటి అన్ని రకాల నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదలను అన్ని డెవలపర్ల సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ధరల పెరుగుదలకు నిరసనగా ఈనెల 4న (సోమవారం) హైదరాబాద్‌ వ్యాప్తంగా ఒక్క రోజు నిర్మాణ పనులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. కన్‌స్ట్రక్షన్‌ మెటీరియల్స్‌ ధరలు పెరగడం వల్ల నగదు ప్రవాహానికి ఇబ్బందిగా మారడంతో పాటు డెవలపర్లకు వర్కింగ్‌ క్యాపిటల్‌ సమస్య కూడా వస్తుందని సంఘాలు ముక్తకంఠంతో తెలిపాయి.

నిర్మాణ వ్యయాలు గణనీయంగా పెరగడం వల్ల 600కు పైగా డెవలపర్లపై తీవ్ర ప్రభావం పడుతుందని, దీంతో గృహాల ధరలు 10–15 శాతం మేర పెరుగుతాయని తెలిపాయి. క్రెడాయ్, ట్రెడా , టీబీఎఫ్, టీడీఏ ప్రతినిధులు శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించాయి. ఈ సందర్భంగా కాన్ఫిడరేషన్‌ ఆఫ్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ ఆఫ్‌ ఇండియా (క్రెడాయ్‌) తెలంగాణ చైర్మన్‌ సీహెచ్‌ రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ.. అనిశ్చితి పరిస్థితులలో కొంతమంది బిల్డర్లు ప్రాజెక్ట్‌ల నిర్మాణాలను ఆపేశారని, ముడి పదార్థాల ధరలు తగ్గిన తర్వాత ప్రాజెక్ట్‌లను పునః ప్రారంభించడానికి యోచిస్తున్నారన్నారు.

దేశంలో రెండో అతిపెద్ద ఉపాధి రంగమైన స్థిరాస్తి రంగంలో నిర్మాణ పనులను నిలిపివేస్తే.. ఈ రంగంపై ఆధారపడిన వారి జీవనోపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. అలాగే ఆర్థిక వ్యవస్ధ వృద్ధిపై కూడా ప్రభావం చూపుతుందన్నారు. రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్‌లపై ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ తగ్గించడంతో పాటు జీఎస్‌టీని సరళీకృతం చేయాలని ఆయన సూచించారు. నిర్మాణ రంగ ముడి పదార్థాల ప్రస్తుత ధరలను హేతుబద్ధీకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్‌ తెలంగాణ ప్రెసిడెంట్‌ డీ మురళీ కృష్ణారెడ్డి, హైదరాబాద్‌ చాప్టర్‌ ప్రెసిడెంట్‌ పీ రామకృష్ణారావు, జనరల్‌ సెక్రటరీ వీ రాజశేఖర్‌ రెడ్డిలు కూడా పాల్గొన్నారు.

వీళ్లేమన్నారంటే..
► తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్స్‌ అసోసియేషన్‌ (ట్రెడా) అధ్యక్షులు సునీల్‌ చంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఇన్‌పుట్‌ వ్యయాలు పెరగడం, మార్జిన్లు తగ్గడంతో డెవలపర్లకు ఆర్థిక కష్టాలు పెరిగాయి. పెరిగిన నిర్మాణ సామగ్రి ధరల నేపథ్యంలో డెవలపర్లకు ప్రస్తుత ప్రాజెక్ట్‌లలో ధరలు పెంచడం మినహా వేరే అవకాశం లేదని ఆయన తెలిపారు.
► తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌ (టీబీఎఫ్‌) అధ్యక్షులు సీ ప్రభాకర్‌ రావు మాట్లాడుతూ.. మార్కెట్లో తిరిగి సానుకూల వాతావరణం నెలకొనాలంటే.. కేంద్ర జీఎస్‌టీ రేట్లను తగ్గించి ఇన్‌పుట్‌ క్రెడిట్‌ను అందించాలని, అలాగే రాష్ట్ర ప్రభు త్వం స్టాంప్‌ డ్యూటీ తగ్గించాలన్నారు.
► తెలంగాణ డెవలపర్స్‌ అసోసియేషన్‌ (టీడీఏ) ప్రెసిడెంట్‌ జీవీ రావు మాట్లాడుతూ.. ఇన్‌పుట్‌ వ్యయం పెరిగిన నేపథ్యంలో డెవలపర్లు ధరలను పెంచక తప్పదని అయితే ఈ పెంపు అన్ని రకాల గృహాలపై పడుతుందన్నారు. పర్సంటేజీ పరంగా చూస్తే అందుబాటు ధరల విభాగంలోని గృహాలపై ధరల పెరుగుదల ప్రభావం ఉంటుందన్నారు.
 

మరిన్ని వార్తలు