ఖాళీగా ఉంచుతామంటే కుదరదు... టీఎస్‌ఐఐసీ షాకింగ్‌ నిర్ణయం!

1 Sep, 2021 08:13 IST|Sakshi

 కార్యకలాపాలు ప్రారంభించని పరిశ్రమల భూములు స్వాధీనం 

 ఇప్పటివరకు 65 సంస్థల నుంచి 1,960 ఎకరాలు వెనక్కి 

 వీటి విలువ కోట్లలో ఉంటుందంటున్న పరిశ్రమల శాఖ 

 పెట్టుబడులతో వచ్చే వారికి తిరిగి కేటాయించనున్న టీఎస్‌ఐఐసీ  

సాక్షి, హైదరాబాద్‌: పరిశ్రమల ఏర్పాటు కోసం కేటాయించిన భూముల్లో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టకుండా ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న వాటిని తిరిగి స్వాధీనం చేసుకునే ప్రక్రియను టీఎస్‌ఐఐసీ (తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక, మౌలిక సదుపాయాల కల్పన సంస్థ) ముమ్మరం చేసింది. పారిశ్రామిక వాడల్లో నిరుపయోగంగా ఉన్న ప్లాట్లను గుర్తించి స్వాధీనం చేసుకోవాలని గత ఏడాది ఆగస్టులో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశించారు.

కోట్ల రూపాయల విలువ
మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో ఇప్పటివరకు 65 సంస్థల నుంచి సుమారు 1,960 ఎకరాల భూమిని  టీఎస్‌ఐఐసీ స్వాధీనం చేసుకుంది. వీటి విలువ రూ.కోట్లలో ఉంటుందని అధికారులు అంటున్నారు. నిరుపయోగంగా ఉన్న భూముల్లో ఎక్కువ శాతం హైదరాబాద్‌ మెట్రో డెవలప్‌మెంట్‌ అథారిటీ పరిధిలోనే ఉన్నాయి. ఆదిభట్ల సెజ్, మడికొండ ఐటీ పార్క్, ఫ్యాబ్‌సిటీ, హార్డ్‌వేర్‌ పార్క్, ఐడీఏ నాచారం, పాశమైలారం, పటాన్‌చెరు, కరకపట్ల బయోటెక్‌ పార్క్‌తోపాటు పలు చోట్ల ఖాళీ ప్లాట్లు ఉన్నట్లు తేలింది. కార్యకలాపాలు ప్రారంభించని కొందరు పారిశ్రామికవేత్తలు మరికొంత సమయం కావాలని టీఎస్‌ఐఐసీని కోరుతుండగా, మరికొందరు కోర్టును ఆశ్రయించారు. స్వాధీనం చేసుకున్న భూములను పెట్టుబడులతో వచ్చే వారిలో అర్హులైన వారికి తిరిగి కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. 

ఐదు దశాబ్దాలుగా వేల ఎకరాలు కేటాయింపు 
పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించానే లక్ష్యంతో ప్రభుత్వాలు పరిశ్రమల ఏర్పాటు కోసం దశాబ్దాల తరబడి భూములు కేటాయిస్తున్నాయి. ఐదు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఏపీలో పారిశ్రామిక మౌలిక సదుపాయల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) ఏర్పడింది మొదలు 2014లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు సుమారు 27వేల ఎకరాలు పారిశ్రామిక అవసరాల కోసం కేటాయించింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత టీఎస్‌ఐఐసీగా రూపాంతరం చెందిన తర్వాత నూతన పారిశ్రామిక చట్టం (టీఎస్‌ఐపాస్‌)లో భాగంగా సుమారు ఐదు వేల ఎకరాలకుపైగా పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించినట్లు అంచనా. రాష్ట్రంలోకి పెట్టుబడులు వేగంగా వస్తుండటంతో 35 వేల ఎకరాలను పరిశ్రమల ఏర్పాటుకు అనువుగా టీఎస్‌ఐఐసీ మౌలిక సదుపాయల కల్పన పనులు చేపట్టింది. టీఎస్‌ఐపాస్‌ ద్వారా 2015 నుంచి ఇప్పటి వరకు 15,852 పరిశ్రమలు రూ.2.14 లక్షల కోట్ల పెట్టుబడులతో రాష్ట్రానికి రాగా, 15.60 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. వీటిలో రూ.98 వేల కోట్ల పెట్టుబడులతో కార్యకలాపాలు ప్రారంభించిన 12 వేలకు పైగా యూనిట్లు 7.71 లక్షల మందికి ఉపాధి ఇస్తున్నాయి.  

1,343 ఎకరాల మేర ఖాళీ 
ఓ వైపు పారిశ్రామిక వాడల్లో భూములు పొందినా కార్యకలాపాలు ప్రారంభించక పోవడంతో నిరుపయోగంగా మారగా, మరోవైపు వివిధ పారిశ్రామిక జోన్లలో 1,343 ఎకరాల విస్తీర్ణం మేర 1,205 ప్లాట్లు విక్రయానికి నోచుకోలేదు. పెరుగుతున్న మార్కెట్‌ ధరలకు అనుగుణంగా ఈ ఖాళీ ప్లాట్ల ధరలను కూడా ప్రభుత్వం సవరిస్తూ పెట్టుబడులతో వచ్చే వారికి కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటనలు ఇస్తోంది. కేటాయింపులు జరగని ప్లాట్లతోపాటు తిరిగి స్వాధీనం చేసుకునే ప్లాట్లను కూడా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు కేటాయించేందుకు టీఎస్‌ఐఐసీ సన్నాహాలు చేస్తోంది. 

పారిశ్రామిక జోన్ల వారీగా ఖాళీగా ఉన్న ప్లాట్లు 
పారిశ్రామిక జోన్‌        ఖాళీ ప్లాట్లు 
సైబరాబాద్‌                 128 
కరీంనగర్‌                      7 
ఖమ్మం                       31 
మేడ్చల్‌–సిద్దిపేట     133 
నిజామాబాద్‌               3 
పటాన్‌చెరు                130 
శంషాబాద్‌                 347 
వరంగల్‌                   418 
యాదాద్రి                  8  
...............................................
మొత్తం                  1,205    

చదవండి : రికార్డు స్థాయిలో పెరిగిన దేశ జీడీపీ

మరిన్ని వార్తలు