ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌.. ప్రిన్స్‌ మహేశ్‌.. అదిరింది సార్‌!

1 Nov, 2021 11:50 IST|Sakshi

పోలీస్‌ ఆఫీసర్‌గా తనదైన ముద్ర చూపించిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, అడిషనల్‌ డీజీపీ సజ్జనార్‌ ఇప్పుడు టీఎస్‌ఆర్టీసీ ఎండీగా తన మార్క్‌ చూపిస్తున్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందివ్వడంతో పాటు ఆర్టీసీ బ్రాండ్‌ ఇమేజ్‌ పెంచడం,  ఆదాయం సమకూర్చే పనిలో ఉన్నారు. ఇందుకోసం సమకాలీన అంశాలను సమర్థంగా ఉపయోగించుకుంటున్నారు.  

ఫ్యూయల్‌ ఛార్జెస్‌
గత కొంత కాలంగా డీజిల్‌, పెట్రోలు ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. సామాన్యులతో పాటు ఆర్టీసీకి ఈ పెరిగిన ధరలు గుదిబండలా మారాయి. అయితే ఇలా పెరుగుతున్న ధరలను సైతం ఆర్టీసీకి ఆదాయంగా ఎలా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌. దీని కోసం ట్విట్టర్‌ వేదికగా ప్రత్యేక ప్రచారం ప్రారంభించారు. సూపర్‌స్టార్‌ మహేశ్‌ను అందులో పరోక్ష భాగస్వామిగా మార్చారు. ఆర్టీసీ వైపు ప్రయాణికులను ఆకర్షించేలా ప్రిన్స్‌ మహేశ్‌ చిత్రాల్లోని ఫోటోలకు అదిరిపోయే క్యాప్షన్‌ జోడించి మీమ్‌ రూపొందించారు. దాన్ని తన అధికారిక ట్విట్టర్‌ పేజ్‌లో పోస్ట్‌ చేశారు.  

ఆకట్టుకునేలా 
సూపర్‌ స్టార్‌ మహేశ్‌ ఫోటోలతో రూపొందిన మీమ్‌లో బైకులో లీటరు పెట్రోలు కొట్టిస్తే సిటీ మొత్తం తిరగలేకపోవచ్చు కానీ లీటరు పెట్రోలు కంటే తక్కువ ధరలో లభిస్తున్న టీ24 టిక్కెట్టుతో సిటీ మొత్తం ప్రయాణించవచ్చని చెబుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. గతంలో ఫ్యూయల్‌ ఛార్జీలు పెరిగితే ప్రయాణికులపై భారం మోపేందుకు ఆసక్తి చూపించేవారని. కానీ సజ్జనార్‌ అందుకు భిన్నంగా అవరోధాలను అవకాశాలుగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. 

బ్రాండ్‌ ఇమేజ్‌
పదవీ బాధ్యతలు స్వీకరించింది మొదలు నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఒడ్డున పడేసేందుకు సజ్జనార్‌ తీవ్రంగా శ్రమిస్తున్నారు. పండగ సమయాల్లో స్పెషల్‌ పేరుతో ఆర్టీసీ చేసే అదనపు ఛార్జీల వడ్డన కార్యక్రమానికి స్వస్థి పలికారు. ఈ నిర్ణయంతో ఆర్టీసీ బ్రాండ్‌ ఇమేజ్‌ పెరగడమే కాకుండా ఆర్టీసీ, ప్రైవేటు వాహనాల ధరల దోపిడి నుంచి ప్రయాణికులక ఊరట లభించింది. అంతేకాదు టీఎస్‌ ఆర్టీసీ బస్‌ స్టేషన్లలో మిల్క్‌ ఫీడింగ్‌ కియోస్క్‌లను ఏర్పాటు చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా ప్రశంసలు వస్తున్నాయి. ప్రయాణికులకు ఆర్టీసీ మాది అనే భావన కలిగిస్తున్నాయి. ఇప్పటికీ మిల్క్‌ ఫీడింగ్‌ కియోస్క్‌ ఎంజీబీఎస్‌లో మొదలవగా మిగిలిన స్టేషన్లకు త్వరలో విస్తరించనున్నారు. 

స్వయంగా 
స్వయంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ట్విట్టర్‌ వేదికగా ప్రయాణికులు అడుగుతున్న పశ్నలకు సమాధానం చెబుతూనే వారు లేవనెత్తుతున్న సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతకు ముందు ఆర్టీసీ బస్సులో మహిళలు, వృద్ధులకు సీటు ఇవ్వాలని చెబుతూ స్కూల్‌ పిల్లలతో రూపొందించిన వీడియో సైతం టీఎస్‌ ఆర్టీసీ విలువని మరింతగా పెంచింది.

చదవండి: పెట్రో, డీజిల్‌ ధరల పెరుగుదల: సీఎన్జీపై బాదుడు

మరిన్ని వార్తలు