టీఎస్ఆర్‌టీసీలోకి ఎలక్ట్రిక్ బస్సులు.. దక్షిణ భారత్‌లో ఇదే అతి పెద్ద ఆర్డర్: ఒలెక్ట్రా

6 Mar, 2023 19:43 IST|Sakshi

భారతదేశం అభివృద్ధివైపు అడుగులు వేస్తోంది, ఈ క్రమంలో దేశంలో వినియోగించే వాహనాలు కూడా మారుతున్నాయి. పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్, సిఎన్‌జి వాహనాలు పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయడానికి ముందడుగు వేసింది.

ఇటీవల ఒలెక్ట్రా గ్రీన్‍టెక్ లిమిటెడ్ సంస్థకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏకంగా 550 ఎలక్ట్రిక్ బస్సులకు ఆర్డర్ ఇచ్చింది. ఇందులో 50 ఇంటర్‌సిటీ, 500 ఇంట్రాసిటీ బస్సులు ఉన్నాయి. ఇది దక్షిణ భారతదేశంలోనే అతి పెద్ద ఆర్డర్ అని కంపెనీ మేనేజింగ్ డైరక్టర్ కె.వి.ప్రదీప్ తెలిపారు.


 
మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్​ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ అనుబంధ సంస్థ ఒలెక్ట్రా గ్రీన్‍నెట్ లిమిటెడ్ అందించే ఇంటర్‌సిటీ బస్సులు హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు, ఇంట్రాసిటీ బస్సులు నగరంలో తిరగనున్నాయి. ఇంటర్‌సిటీ బస్సులు ఒక ఛార్జ్‌తో 325 కిలోమీటర్లు, ఇంట్రాసిటీ బస్సులు 225 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణిస్తాయని కంపెనీ తెలిపింది.

(ఇదీ చదవండి: చైనా ఉత్పత్తులకు బ్రేక్! హోలీ వేళ భారతీయులంతా..)

2025 మార్చి నాటికి హైదరాబాద్ నగరంలో ఎలక్ట్రిక్ బస్సులు విరివిగా అందుబాటులోకి వస్తాయని TSRTC ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు.  అంతే కాకుండా రానున్న రోజుల్లో మూడు వేలకంటే ఎక్కువ ఎలక్ట్రిక్ బస్సులు వినియోగంలోకి రానున్నట్లు టీఎస్ఆర్‌టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. భాగ్యనగరంలో ఒలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణ, కార్యకలాపాల కోసం టీఎస్ఆర్‌టీసీ జంటనగరాల్లో ఐదు డిపోలను కేటాయించినట్లు ప్రస్తావించారు.

మరిన్ని వార్తలు