టీటీకే ప్రెస్టీజ్‌ చేతికి అల్ట్రాఫ్రెష్‌, ఇక ఆ సేవలు కూడా

28 Jun, 2022 06:26 IST|Sakshi

మెజారిటీ వాటా కొనుగోలుకి సై

ప్రస్తుతం 40 శాతం వాటాకు రెడీ

న్యూఢిల్లీ: అల్ట్రాఫ్రెష్‌ మాడ్యులర్‌ సొల్యూషన్స్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయనున్నట్లు కిచెన్‌ అప్లయెన్సెస్‌ దిగ్గజం టీటీకే ప్రెస్టీజ్‌ తాజాగా పేర్కొంది. ప్రస్తుతం 40 శాతం వాటాను సొంతం చేసుకునేందుకు వీలుగా రూ. 20 కోట్లు ఇన్వెస్ట్‌ చేసినట్లు వెల్లడించింది. తదుపరి మరో రూ. 10 కోట్లు వెచ్చించడం ద్వారా 51 శాతం వాటాను దక్కించుకోనున్నట్లు టీటీకే ప్రెస్టీజ్‌ ఎండీ చంద్రు కల్రో తెలియజేశారు. దీంతో వేగవంత వృద్ధిలో ఉన్న మాడ్యులర్‌ కిచెన్‌ సొల్యూషన్స్‌ విభాగంలో ప్రవేశించేందుకు కంపెనీకి వీలు చిక్కనుంది. మొత్తం కిచెన్‌ సొల్యూషన్స్‌ అందించే కంపెనీగా ఆవిర్భవించే లక్ష్యంలో భాగంగా తాజా కొనుగోలుని చేపట్టినట్లు కంపెనీ చైర్మన్‌ టీటీ జగన్నాథన్‌ పేర్కొన్నారు. ప్రస్తుతం మాడ్యులర్‌ కిచెన్‌ మార్కెట్‌ విలువ రూ. 9,500 కోట్లుగా ఉన్నట్లు తెలియజేశారు. దీనిలో 25 శాతమే బ్రాండెడ్‌ విభాగం ఆక్రమిస్తున్నట్లు వెల్లడించారు.

మాడ్యులర్‌ కిచెన్‌లోకి
అల్ట్రాఫ్రెష్‌ కొనుగోలు ద్వారా మాడ్యులర్‌ కిచెన్‌ సొల్యూషన్స్‌ విభాగంలో అడుగు పెట్టనున్నట్లు చంద్రు తెలియజేశారు. కంపెనీ బిజినెస్‌కు ఇది అదనపు ప్రయోజనాలను కల్పిస్తుందని చెప్పారు. 2025 ఆర్థిక సంవత్సరానికల్లా రూ. 5,000 కోట్ల టర్నోవర్‌ సాధించాలని లక్షిస్తున్నట్లు వెల్లడించారు. దీనిలో రూ. 1,000 కోట్లు ఇతర కంపెనీలను సొంతం చేసుకోవడం ద్వారా ఆశిస్తున్నట్లు తెలియజేశారు. తాజా కొనుగోలు దీనిలో భాగమేనని వివరించారు. ప్రస్తుత నాయకత్వంలోనే స్వతంత్ర కంపెనీగా అల్ట్రాఫ్రెష్‌ మాడ్యులర్‌ కొనసాగనున్నట్లు వెల్లడించారు. అవసరమైతే ప్రెస్టీజ్‌ బ్రాండును వినియోగించుకుంటుందని తెలియజేశారు. రానున్న ఐదేళ్లలో రూ. 23,000 కోట్ల టర్నోవర్‌ను సాధించగలమన్న ధీమాను వ్యక్తం చేశారు. ప్రస్తుతం అల్ట్రాఫ్రెష్‌ 120 స్టూడియోలతో దేశవ్యాప్తంగా 5,000 కిచెన్‌లను తయారు చేసినట్లు తెలియజేశారు.
 

మరిన్ని వార్తలు