SUV: గేర్‌ మార్చిన మారుతి.. వేగం పెంచిన టాటా

5 Jan, 2022 13:50 IST|Sakshi

గేర్‌ మారుస్తున్న మారుతీ సుజుకీ కొత్త మోడల్స్‌పై కసరత్తు 

దూకుడు పెంచుతున్న టాటా మోటర్స్‌ 

ముంబై: దేశీయంగా స్పోర్ట్‌ యుటిలిటీ వాహనాలకు (ఎస్‌యూవీ) డిమాండ్‌ పెరుగుతున్న నేపథ్యంలో కార్ల తయారీ దిగ్గజాలు ఈ విభాగంపై ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి. ప్రస్తుతం కొరియన్‌ దిగ్గజం హ్యుందాయ్‌ ఆధిపత్యం ఉన్న ఈ సెగ్మెంట్‌లో తమ మార్కెట్‌ వాటాను మరింత పెంచుకునేందుకు మారుతీ సుజుకీ, టాటా మోటార్స్‌ వంటి సంస్థలు వ్యూహాలు రచిస్తున్నాయి. మారుతీ సుజుకీ (ఎంఎస్‌ఐఎల్‌) కొత్తగా పలు ఎస్‌యూవీలను ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేసుకుంటోంది. ఇందులో భాగంగా కొత్త హంగులతో సరికొత్త బ్రెజాను ఆవిష్కరించే ప్రయత్నాల్లో కంపెనీ ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత మరో మూడు కార్లను ఆవిష్కరించవచ్చని పేర్కొన్నాయి. వీటిలో ఒకటి బ్రెజాకు ప్రత్యామ్నాయ ప్రీమియం కాంపాక్ట్‌ ఎస్‌యూవీ ఉండవచ్చని వివరించాయి. టాటా మోటర్స్‌ కూడా ఈ సెగ్మెంట్‌లో దూకుడు పెంచుతోంది. 2020లో కంపెనీ ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోలో ఎస్‌యూవీల వాటా 37 శాతంగా ఉండగా 2021లో ఇది 52 శాతానికి పెరిగింది. ఇక అక్టోబర్‌లో నెక్సాన్, పంచ్‌ మోడల్స్‌ భారీగా అమ్ముడవడంతో (రెండూ కలిపి 18,549 వాహనాలు) ఎస్‌యూవీ మార్కెట్లో అగ్ర స్థానం కూడా దక్కించుకుంది. పుష్కలంగా నిధులు ఉండటం, కొత్త ఆవిష్కరణలపై మరింతగా దృష్టి పెడుతుండటం ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో టాటా మోటార్స్‌కు సానుకూలాంశాలని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. 


వాహన విక్రయాల్లో 38 శాతం వాటా.. 
వాహన విక్రయాల్లో ఎస్‌యూవీల వాటా గత కొన్నాళ్లుగా గణనీయంగా పెరిగింది. 2016లో మొత్తం వాహన విక్రయాల్లో ప్యాసింజర్‌ వాహనాల వాటా 51 శాతంగాను, ఎస్‌యూవీల వాటా 16 శాతంగాను నమోదైంది. అదే 2021కి వచ్చేసరికి ఎస్‌యూవీల వాటా 38 శాతానికి ఎగిసింది. హ్యాచ్‌బ్యాక్‌ సెగ్మెంట్‌కు (40 శాతం వాటా) ఇది దాదాపు సరిసమానం కావడం గమనార్హం. 2020లో ఎస్‌యూవీల మార్కెట్‌ వాటా 29 శాతంగా ఉంది. ఇంత వేగంగా వృద్ధి చెందుతున్నందునే ఈ విభాగంపై కంపెనీలు ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నాయి. గత మూడేళ్లలో 50 పైగా కొత్త మోడల్స్‌ను లాంచ్‌ చేశాయి. వీటిల్లో హ్యుందాయ్‌కి చెందిన క్రెటా అత్యధికంగా 1,25,437 యూనిట్లు అమ్ముడై బెస్ట్‌ సెల్లర్‌గా నిల్చింది.   


వ్యూహరచనలో మారుతీ .. 
ఎస్‌యూవీ విభాగంలో పోటీ తీవ్రతరమవుతుండటంతో మారుతీ సుజుకీ వృద్ధి అవకాశాలపైనా ప్రభావం పడుతోంది. లాభదాయకత అధికంగా ఉండే ఈ విభాగంలో కంపెనీకి పెద్ద స్థాయిలో మోడల్స్‌ లేకపోవడం ప్రతికూలంగా ఉంటోంది. విటారా బ్రెజా, ఎస్‌–క్రాస్‌ మినహా స్పోర్ట్‌ యుటిలిటీ విభాగంలో.. ముఖ్యంగా మిడ్‌–ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో కంపెనీకి మరే ఇతర మోడల్స్‌ లేవని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఎంట్రీ స్థాయి ఎస్‌యూవీ మోడల్స్‌లో బ్రెజా దాదాపు అగ్రస్థానంలో కొనసాగుతున్నప్పటికీ, బోలెడన్ని కొత్త మోడల్స్‌తో తీవ్ర పోటీ ఉన్న మధ్య స్థాయి ఎస్‌యూవీ విభాగంపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉందని మారుతీ వర్గాలు తెలిపాయి. కాంపాక్ట్‌ ఎస్‌యూవీల వైపు కస్టమర్లు మొగ్గు చూపుతుండటంతో ప్యాసింజర్‌ వాహనాల విభాగంలో మారుతీ దాదాపు 540 బేసిస్‌ పాయింట్ల మేర మార్కెట్‌ వాటా కోల్పోయిందని విశ్లేషకులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే మారుతీ తన వ్యూహాలకు మరింతగా పదును పెడుతోందని వివరించారు. పెద్ద పరిమాణంలో ఉత్పత్తి చేయగలగడం, కొత్త ఉత్పత్తులను తయారు చేసేందుకు కావాల్సిన స్థాయిలో నిధులు, సాంకేతికత మొదలైనవన్నీ చేతిలో ఉండటం మారుతీకి సానుకూలాంశాలని పేర్కొన్నారు.


హ్యుందాయ్‌ ఆధిపత్యం.. 
స్పోర్ట్‌ యుటిలిటీ వాహనాల విభాగంలో హ్యుందాయ్‌ అగ్రస్థానంలో కొనసాగుతోంది. కంపెనీ వాహన విక్రయాల్లో సగభాగం దీన్నుంచే ఉంటోంది. ఇప్పటికే వెన్యూ, క్రెటా, అల్కజర్, టక్సన్, కోనా ఈవీ అనే అయిదు వాహనాలతో హ్యుందాయ్‌ ఆధిపత్యం చెలాయిస్తోంది. వీటికి తోడుగా టక్సన్‌లో ప్రీమియం వెర్షన్‌ను, మరో ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీని ప్రవేశపెట్టేందుకు కంపెనీ కసరత్తు చేస్తోంది. ఫ్రంట్‌ రూఫ్, కనెక్టెడ్‌ కార్లు, వాహనంలో మరింత స్థలం, సౌకర్యాలు కల్పించడంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నట్లు హ్యుందయ్‌ ఇండియా వర్గాలు తెలిపాయి. గత కొన్నాళ్లుగా పలు ఎస్‌యూవీలు వచ్చినప్పటికీ క్రెటా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోందని వివరించాయి. హ్యుందాయ్‌ గ్రూప్‌లో భాగమైన కియా కూడా ఇటీవలే టాప్‌ 5 ఆటోమొబైల్‌ సంస్థల లిస్టులోకి చేరింది. సెల్టోస్, సోనెట్‌ మోడల్స్‌ ఇందుకు తోడ్పడ్డాయి. కియా  ఎస్‌యూవీ సెగ్మెంట్‌పైనే దృష్టి పెడుతోంది. సెడాన్, హ్యాచ్‌బ్యాక్‌ విభాగంలోకి ప్రవేశించే యోచన లేదనేది కంపెనీ వర్గాల మాట. 

చదవండి: ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో దుమ్ములేపుతున్న టాటా మోటార్స్..!

మరిన్ని వార్తలు