టీవీల రేట్లకు రెక్కలు

28 Dec, 2020 01:22 IST|Sakshi

జనవరి నుంచి 10 శాతం దాకా పెంపు

ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మెషీన్లపై కూడా

ముడివస్తువుల ధరలు పెరగడమే కారణం

న్యూఢిల్లీ: ఎల్‌ఈడీ టీవీలతో పాటు ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మెషీన్ల వంటి ఉపకరణాల రేట్లకు రెక్కలు రానున్నాయి. వచ్చే ఏడాది జనవరి నుంచి 10 శాతం దాకా పెరగనున్నాయి. రాగి, అల్యూమినియం, ఉక్కు వంటి ముడిపదార్థాల ధరలతో పాటు రవాణా చార్జీలు పెరగడమే ఇందుకు కారణమని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ విక్రేతల నుంచి సరఫరా తగ్గిపోవడం వల్ల టీవీ ప్యానెళ్ల రేట్లు రెట్టింపయ్యాయని, అలాగే ముడి చమురు రేట్లు పెరగడంతో ప్లాస్టిక్‌ ధర సైతం పెరిగిందని తయారీ సంస్థలు వెల్లడించాయి.

ధరల పెంపు అనివార్యమంటూ ఎల్‌జీ, ప్యానసోనిక్, థామ్సన్‌ వంటి సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి. ‘కమోడిటీల రేట్లు పెరగడం వల్ల సమీప భవిష్యత్‌లో మా ఉత్పత్తుల ధరలపైనా ప్రభావం పడనుంది. జనవరిలో 6–7 శాతంతో మొదలుకుని ఆ తర్వాత 10–11 శాతం దాకా పెరగవచ్చు‘ అని ప్యానసోనిక్‌ ఇండియా ప్రెసిడెంట్‌ మనీష్‌ శర్మ తెలిపారు. ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా కూడా జనవరి 1 నుంచి ఉపకరణాల రేట్లను కనీసం 7–8 శాతం మేర పెంచనుంది. కంపెనీ వైస్‌ ప్రెసిడెంట్‌ (హోమ్‌ అప్లయెన్సెస్‌ విభాగం) విజయ్‌ బాబు చెప్పారు.

ఆలోచనలో సోనీ..
మిగతా సంస్థలకు భిన్నంగా సోనీ ఇండియా మాత్రం ఇంకా పరిస్థితిని సమీక్షిస్తున్నామని, రేట్ల పెంపుపై నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపింది. ‘రోజురోజుకు మారిపోతున్న సరఫరా వ్యవస్థను నిశితంగా పరిశీలిస్తున్నాం. దీనిపై ఇంకా స్పష్టత రాకపోవడంతో, పెంపు ఎంత మేర ఉండాలన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు‘ అని సంస్థ ఎండీ సునీల్‌ నయ్యర్‌ తెలిపారు. వర్క్‌ ఫ్రం హోమ్‌ విధానం నేథ్యంలో ఉత్పత్తులకు డిమాండ్‌ గణనీయంగా పెరిగిందని, అయితే ఫ్యాక్టరీలు ఇంకా పూర్తి సామర్థ్యంతో పని చేయకపోతుండటంతో సరఫరా పరిమితంగానే ఉంటోందని ఆయన పేర్కొన్నారు. దీని వల్ల రేట్లకు రెక్కలు వస్తున్నాయని వివరించారు. టీవీ ఓపెన్‌సెల్‌ కొరత తీవ్రంగా ఉందని, దీంతో వాటి ధర 200 శాతం పైగా ఎగిసిందని భారత్‌లో థామ్సన్, కొడక్‌ ఉత్పత్తులను విక్రయించే సూపర్‌ ప్లాస్ట్రానిక్స్‌ సీఈవో అవ్‌నీత్‌ సింగ్‌ మార్వా చెప్పారు. భారత్‌లో ప్రత్యామ్నాయంగా ప్యానెళ్ల తయారీ లేకపోవడంతో అంతా చైనాపై ఆధారపడాల్సి వస్తోందని ఆయన తెలిపారు. జనవరి నుంచి థామ్సన్, కోడక్‌ తమ ఆండ్రాయిడ్‌ టీవీల రేట్లను 20% మేర పెంచే అవకాశం ఉందని వివరించారు.

డిమాండ్‌కు దెబ్బ..
బ్రాండ్లు రేట్లను పెంచిన పక్షంలో వచ్చే త్రైమాసికంలో మొత్తం డిమాండ్‌పై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని కన్జూమర్‌ ఎలక్ట్రానిక్స్, అప్లయన్సెస్‌ తయారీ సంస్థల సమాఖ్య సీఈఏఎంఏ ప్రెసిడెంట్‌ కమల్‌ నంది ఆందోళన వ్యక్తం చేశారు. ‘కమోడిటీల ధరలు 20–25 శాతం పెరగడం, కంటెయినర్ల కొరతతో సముద్ర.. విమాన రవాణా చార్జీలు 5–6 రెట్లు పెరిగిపోవడంతో ఉపకరణాల ముడి వస్తువుల వ్యయాలపై భారీగా ప్రతికూల ప్రభావం పడుతోంది. దీనితో సమీప భవిష్యత్‌లో బ్రాండ్లు తమ ఉత్పత్తుల రేట్లను 8–10 శాతం దాకా పెంచే అవకాశం ఉంది. దీనివల్ల వచ్చే త్రైమాసికంలో మొత్తం డిమాండ్‌ దెబ్బతినే ముప్పు ఉంది‘ అని పేర్కొన్నారు. అయితే, పేరుకుపోయిన డిమాండ్‌కి తగ్గట్లుగా కొనుగోళ్లు జరిగే అవకాశం ఉందని, ఫలితంగా పెద్దగా ప్రతికూల ప్రభావం ఉండకపోవచ్చని పరిశ్రమ ఆశిస్తున్నట్లు ఆయన వివరించారు. సీఈఏఎంఏ, ఫ్రాస్ట్‌ అండ్‌ సలివాన్‌ సంయుక్త నివేదిక ప్రకారం 2018–19లో కన్జూమర్‌ డ్యూరబుల్స్‌ పరిశ్రమ పరిమాణం రూ. 76,400 కోట్లుగా నమోదైంది.  

మరిన్ని వార్తలు