టీవీఎస్‌ మోటార్‌ లాభం డౌన్‌

8 Feb, 2022 06:45 IST|Sakshi

క్యూ3లో రూ. 237 కోట్లకు పరిమితం

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో ద్విచక్ర వాహన దిగ్గజం టీవీఎస్‌ మోటార్‌ కంపెనీ నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో నికర లాభం 18 శాతం క్షీణించి రూ. 237 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 290 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం రూ. 6,095 కోట్ల నుంచి రూ. 6,597 కోట్లకు ఎగసింది. రాల్ఫ్‌ డైటర్‌ స్పేథ్‌ను చైర్మన్‌ పదవికి ఎంపిక చేసినట్లు కంపెనీ బోర్డు పేర్కొంది. 2022 ఏప్రిల్‌ 1 నుంచి నియామకం అమల్లోకిరానుండగా.. చైర్మన్‌ ఎమిరిటస్‌ హోదాలో వేణు శ్రీనివాసన్‌ కంపెనీ ఎండీ బాధ్యతలు కొనసాగించనున్నట్లు తెలియజేసింది. కాగా.. క్యూ3లో స్టాండెలోన్‌ నికర లాభం రూ. 266 కోట్ల నుంచి రూ. 288 కోట్లకు పుంజుకుంది.

వాహన విక్రయాలు ఇలా: తాజా సమీక్షా కాలంలో మొత్తం ద్విచక్ర వాహన విక్రయాలు 9.52 లక్షల యూనిట్ల నుంచి 8.35 లక్షలకు తగ్గినట్లు టీవీఎస్‌ మోటార్‌ వెల్లడించింది. వీటిలో ఎగుమతులు 12 శాతం వృద్ధిని సాధించగా.. మోటార్‌ సైకిళ్ల అమ్మకాలు 4.26 లక్షల యూనిట్ల నుంచి 4.46 లక్షల యూనిట్లకు పుంజుకున్నాయి.
ఫలితాల నేపథ్యంలో టీవీఎస్‌ మోటార్‌ షేరు
2.5 శాతం నష్టంతో రూ. 637 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు