Noida Twin Towers: ఉత్కంఠతకు తెర, ట్విన్‌ టవర్స్‌ కూల్చివేతపై..'కంగారు పడొద్దు'!

28 Aug, 2022 16:03 IST|Sakshi

నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలు జరిగిన నోయిడా ట్విన్‌ టవర్స్‌ కూల్చివేతపై ఉత్కంఠకు తెరపడింది. ముంబైకి చెందిన ఎడిఫైస్‌ ఇంజనీరింగ్‌ సంస్థ ఆదివారం మధ్యాహ్నం 2.30 గంటలకు కూల్చివేసింది. ఈ కూల్చివేతపై.. ట్విన్‌ టవర్స్‌ నిర్మాణ సంస్థ సూపర్‌ టెక్‌ స్పందించింది. నోయిడా డెవలప్‌మెంట్ అధికారులు ఆమోదించిన బిల్డింగ్‌ ప్లాన్‌ ప్రకారమే కూల్చేసిన జంట భవనాల్ని నిర్మించినట్లు ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. 

నిర్మాణంలో ఎలాంటి ఫిరాయింపులు జరగలేదని సూపర్‌ టెక్‌ అధినేత ఆర్కే అరోరా స్పష్టం చేశారు. టవర్స్‌ కూల్చివేయడంపై ఇప్పటికే సూపర్‌ టెక్‌ నుంచి ఇళ్ల కొనుగోళ్ల కోసం అడ్వాన్స్‌లు చెల్లించిన కస్టమర్ల ఆందోళనపై స్పందించారు. కంగారు పడొద్దు. "మేం 70వేల కంటే ఎక్కువ యూనిట్లను కొనుగోలు దారులకు డెలివరీ చేశాం. మిగిలిన వారికి షెడ్యూల్ టైమ్ ప్రకారం డెలివరీ అందించేందుకు కట్టుబడి ఉన్నాం. సుప్రీం కోర్ట్ ఉత్తర్వుతో ట్విన్‌ టవర్స్‌ను కూల్చేస్తున్నామని, ఆ ప్రభావం మా సంస్థ నుంచి కొనసాగుతున్న ఇతర ప్రాజెక్ట్‌లపై ప్రభావం చూపదని ఆర్కే అరోరా అన్నారు. 

సుప్రీం తీర్పు మాకు శిరోధార్యం
"నోయిడాలోని ట్విన్ టవర్స్ 'అపెక్స్', 'సెయానే'లు సెక్టార్ 93ఏ ఎమరాల్డ్ కోర్ట్ ప్రాజెక్ట్‌లో భాగంగా ఉన్నాయి. నోయిడా అథారిటీ కేటాయించిన భూమిలో నిర్మించబడింది. 2009లో రెండు టవర్లతో సహా ప్రాజెక్ట్ యొక్క నిర్మాణ ప్రణాళికలను నోయిడా అథారిటీ ఆమోదించింది. నాటి రాష్ట్ర ప్రభుత్వ బిల్డింగ్‌ బై చట్టాలకు అనుగుణంగా నిర్మించాం." అని ఆర్కే అరోరా పేర్కొన్నారు. "అయితే, మేం నిర్మించిన జంట భవనాల వల్ల సాంకేతిక కారణాల్ని ఎత్తి చూపిస్తూ రెండు టవర్లను కూల్చివేయాలని సుప్రీం ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల్ని గౌరవిస్తా. తీర్పు అమలుకు కట్టుబడి ఉన్నామని వెల్లడించారు.

చదవండి👉  ట్విన్‌ టవర్స్‌ కూల్చివేతలో మీకు తెలియని ఆసక్తికర విషయాలు!

మరిన్ని వార్తలు