ఈలాన్‌ మస్క్‌ నీ బెదిరింపులకు మేం భయపడం

3 May, 2022 16:27 IST|Sakshi

ట్విటర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీగా మారడం పట్ల ఆ సం‍స్థ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఎంతో ఒత్తిడిలో ఎదుర్కొంటున్నప్పటికీ.. ఇప్పటి వరకు కొనసాగిస్తూ వచ్చిన విధానాలను కొత్త యజమాని ఈలాన్‌ మస్క్‌ కోసం మార్చుకోవడానికి సిద్ధంగా లేమంటున్నారు. ఈ మేరకు కఠిన నిర్ణయం తీసుకుని ఈలాన్‌ మస్క్‌కి కౌంటర్‌ ఇచ్చారు.

ట్విటర్‌ వ్యవహారం రోజురోజుకు కొత్త మలుపులు తీసుకుంటుంది. ఫ్రీ స్పీచ్‌కు అవకాశం లేదంటూ ప్రచారం మొదలెట్టిన ఎలన్‌ మస్క్‌ కేవలం నెల రోజుల వ్యవధిలోనే భారీ ఆఫర్‌ ఇచ్చి ట్విటన్‌ను పబ్లిక్‌ నుంచి ప్రైవేటు కంపెనీగా మార్చేశాడు. ఆ తర్వాత ట్విటర​ బోర్డు సభ్యులపై వరుసగా విమర్శలు ఎక్కుపెడుతూనే ఉన్నారు. మరోవైపు ఈలాన్‌ మస్క్‌ చేతిలోకి కంపెనీ వెళ్లిపోవడంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఐనప్పటికీ వారి మనో ధైర్యం చెక్కు చెదరడం లేదు.

అప్పుడు బ్యాన్‌
అమెరికాకు చెందిన మై పిల్లోస్‌ సంస్థ సీఈవో మైక్‌ లిండెల్‌ ఖాతాను 2021 జనవరిలో ట్విటర్‌ బ్యాన్‌ చేసింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా విద్వేషాలు రెచ్చగొట్టేలా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనేక కామెంట్లు ట్వీట్‌ చేశారు. అతనికి మద్దతుగా మైక్‌ లిండెల్‌ కూడా ట్వీటర్‌ను యూజ్‌ చేశారు. దీంతో వీరిద్దరి ఖాతాలను ట్వీటర్‌ బ్యాన్‌ చేసింది.

మళ్లీ ట్విటర్‌ ఖాతా
అయితే ఇటీవల ట్విటర్‌ యజమాన్య మార్పులు జరగడం. కొత్త బాస్‌ ఈలాన్‌ మస్క్‌ ఫ్రీ స్పీచ్‌కే ప్రాధాన్యం అంటూ చెబుతూ వస్తున్నారు. ఇదే సమయంలో 2022 మే 1న మైక్‌ లిండెల్‌ ట్విటర్‌ ఖాతాను ప్రారంభించారు. నా ట్విటర్‌ ఖాతా ఇదే నంటూ పోస్ట్‌ చేశారు. ఈ విషయాన్ని అందరికి తెలపాలంటూ కోరారు. ట్విటర్‌లో నా ఖాతా లేకపోవడంతో నకిలీవి వస్తున్నాయంటూ వాపోయాడు. నిషేధిత జాబితాలో ఉన్న లిండెల్‌ ఖాతా మళ్లీ ఖాతా తెరవడంతో ట్విటర్‌ యూజర్లు అదంతా ఈలాన్‌ మస్క్‌ పవర్‌ అనుకున్నారు. ట్విటర్‌ బోర్డు డమ్మీగా మారిందనే సందేహాలు వ్యక్తమయ్యాయి.

మూడున్నర గంటల్లో
ఫ్రీ స్పీచ్‌ విషయంలో ఈలాన్‌ మస్క్‌ విధానం ఎలా ఉన్నా విద్వేష పూరిత వ్యక్తుల పట్ల మా తీరు మారదంటూ వెంటనే రంగంలోకి దిగింది ట్విటర్‌ బోర్డు. మైక్‌ లిండెల్‌ రెండో సారి ఖాతా తెరిచిన మూడున్నర గంటల్లోనే చర్యలు తీసుకుంది. మరోసారి అతని ఖాతాను స్థంభింప చేసింది. మా విధానాలకే కట్టుబడి ఉన్నామంటూ గట్టిగా బదులిచ్చింది.

మనవాళ్ల ధైర్యం
ప్రస్తుతం ట్విటర్‌కు పరాగ్‌ అగ్రావాల్‌ సీఈవోగా ఉండగా లీగల్‌ అడ్వెజర్‌గా గద్దె విజయ ఉన్నారు. ఈలాన్‌ మస్క​ త్వరలోనే వీరిని బయటకు సాగనంపుతారనే ప్రచారం జరుగుతోంది. ఐనప్పటికీ తాము నమ్మిన సిద్ధాంతాలు, తాము రూపొందించిన విధానాలు అమలు చేయడానికి వీరిద్దరు మొగ్గు చూపారంటున్నారు నెటిజన్లు. మరీ తాజా నిషేధంపై ఎలన్‌ మస్క్‌ ఎలా స్పందిస్తాడో చూడాలి.

చదవండి: Vijaya Gadde: ఎలన్‌మస్క్‌తో కష్టమే.. పరాగ్‌ తర్వాత మరో ఇండియన్‌ లేడికి ఎసరు?

మరిన్ని వార్తలు