Twitter: మస్క్‌ ఎఫెక్ట్‌? ఇద్దరు టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లకి గుడ్‌బై!

13 May, 2022 10:53 IST|Sakshi

మైక్రో బ్లాగింగ్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్విటర్‌ పేరు నెల రోజులుగా అందరి నోళ్లలో నానుతోంది. ఈ కంపెనీ గురించి రోజుకో వార్త ప్రచారంలోకి వస్తోంది. త్వరలోనే ఈలాన్‌ మస్క్‌ చేతిలోకి ఈ సంస్థ వెళ్లనుండగా టాప్‌ మేనేజ్‌మెంట్‌లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ కంపెనీకి చెందిన టాప్‌ ఎగ్జిక్యూటీవ్‌లను బయటకు సాగనంపారు.

దయచేసి వెళ్లిపోండి
ఈలాన్‌ మస్క్‌ భారీ డీల్‌తో ట్విటర్‌ను సొంతం చేసుకుంది మొదలు వరుసగా ఏదో ఘటన ఆ సంస్థలో జరుగుతూనే ఉంది. ట్విటర్‌ సీఈవో పరాగ్‌ అగ్రావాల్‌ను బయటకు పంపుతారని, పాలసీ హెడ్‌ గద్దె విజయకు ఎగ్జిట్‌ తప్పదంటూ వా‍ర్తలు వినవస్తూనే ఉన్నాయి. అయితే అనూహ్యంగా ట్విటర్‌ హెడ్‌ ఆఫ్‌ ప్రొడక్ట్‌గా పని చేస్తున్న టాప్‌ ఎగ్జిక్యూటీవ్‌ బెక్‌పూర్‌ని సంస్థను వీడ వెళ్లాల్సిందిగా సీఈవో పరాగ్‌ అగర్వాల్‌ కోరాడు. అదే విధంగా రెవెన్యూ హెడ్‌ బ్రూస్‌ ఫలాక్‌ను పక్కన పెట్టారు.

ఊహించలేదు
ట్విటర్‌ సీఈవో అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నాడంటూ బెక్‌పూర్‌ వాపోయాడు. ఇంత కాలంలో ట్విటర్‌లో పని చేసినందుకు, సాధించిన లక్ష్యాల పట్ల తాను గర్వంగా ఉన్నానంటూ బెక్‌పూర్‌ ట్వీట్‌ చేశాడు. ట్విటర్‌ను వెళ్లి వీడాల్సిన రోజు వస్తుందని తాను ఊహించలేదంటూ చెప్పుకొచ్చాడు బెక్‌పూర్‌.

బ్రూస్‌ ఫలాక్‌ కూడా
మరోవైపు ట్విటర్‌ రెవెన్యూ హెడ్‌గా బ్రూస్‌ ఫలాక్‌ను కూడా ఆ స్థానం నుంచి తప్పిస్తున్నట్టు తొలుత ట్విటర్‌లో ప్రకటించారు. అయితే ఆ ట్వీట్‌ను తర్వాత తొలగించినా ఫలాక్‌ను మాత్రం కీలక బాధ్యతల నుంచి పక్కన పెట్టారు. కీలకమైన ఈ రెండు బాధ్యతలను జే సల్లివాన్‌కి అప్పగించారు. ఇకపై ప్రొడక్ట్‌ హెడ్‌గా జే సల్లివాన్‌ బాధ్యతలు నిర్వర్తిసారు. రెవెన్యూ హెడ్‌గా మరొకరు వచ్చే వరకు ఆ బాధ్యతలకు ఇంఛార్జీగా ఉంటారు.

సమర్థుడు
ఇద్దరు టాప్‌ ఎగ్జిక్యూటివ్‌ల తొలగింపుపై సీఈవో పరాగ్‌ అగర్వాల్‌ స్పందిస్తూ.. సరైన సమయంలో సరైన లీడర్లు వస్తారని చెప్పారు. ప్రొడక్ట్‌ హెడ్‌గా బాధ్యతలు స్వీకరించిన సల్లివాన్‌ వేగంగా నిర్ణయాలు తీసుకోవడంతో అత్యంత సమర్థుడంటూ పరాగ్‌ కొనియాడారు. 

చదవండి: Elon Musk: నాకు ధమ్కీ ఇచ్చారు.. నా ప్రాణాలకు ఏమైనా అయితే ? మస్క్‌ ట్వీట్‌కి కారణం ఇదే!

మరిన్ని వార్తలు