ట్విటర్‌కు కోఫౌండర్‌ గుడ్‌బై.. మాస్టోడోన్‌లో చేరిన బిజ్‌స్టోన్‌!

14 Jan, 2023 18:43 IST|Sakshi

ట్విటర్‌ సీఈవో ఎలాన్‌ మస్క్‌కు భారీ షాక్‌ తగిలింది. ట్విటర్‌ కో ఫౌండర్‌లలో ఒకరైన బిజ్‌ స్టోన్‌ ఆ సంస్థకు గుడ్‌బై చెప్పారు. మస్క్‌ కొనుగోలు అనంతరం జరుగుతున్న వరుస పరిణామాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన బిజ్‌ స్టోన్‌ ఆ సంస్థకు రిజైన్‌ చేసి ట్విటర్‌తో పోటీ పడుతున్న మాస్టోడన్‌లో చేరినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.  

2006 మార్చిలో జాక్‌ డోర్సే, నోహాగ్లాస్‌, బిజ్‌ స్టోన్‌, ఇవాన్‌ విలియమ్స్‌లు ట్విటర్‌ను స్థాపించారు. అయితే మస్క్‌ 44 బిలియన్‌ డాలర్లతో ట్విటర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఫౌండర్‌లు ఒక్కొక్కరిగా బయటకు వస్తున్నారు. ఇప్పటికే సహ వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సే గతేడాది మే నెలలో గుడ్ బై చెప్పగా..ఇవాన్‌ విలియమ్స్‌ మాస్టోడన్‌లో చేరారు. తాజాగా బిజ్‌  స్టోన్‌ సైతం వదిలి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం ట్విటర్‌ సంస్థలో అసంతృప్తిగా ఉన్నా. గతంలోలా ఉన్నట్లు పరిస్థితులు ఇప్పుడు లేవు. నేను చేసేది తప్పో ఒప్పో తెలియదు. కానీ ట్విటర్‌ చాలా అనుభవాల్ని నేర్పించింది. ఇకపై ట్వీట్‌ చేయను. ఏం జరుగుతుందో చూడాలి అంటూ సంస్థ వదిలేస్తున్నట్లు నివేదికలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో  ఈ వ్యాఖ్యలు చేశారు.

అంతేకాదు సంస్థ పట్ల మస్క్‌ సీరియస్‌గా లేరంటూ బ్లూమ్‌బెర్గ్‌కు తెలిపారు. మాస్టోడాన్‌లో చేరేందుకు ఆ సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కుండబద్దలు కొట్టారు. కాగా, బిజ్‌స్టోన్‌ ట్విటర్‌ ఫైల్స్‌ పేరుతో సంస్థలో జరుగుతున్న బాగోతాల్ని బయటపెట్టారు. మస్క్‌ అనుసరిస్తున్న మార్గాల్ని తీవ్రంగా విమర్శించారు. మస్క్‌ను ఉద్దేశిస్తూ..అతను ట్విటర్‌ను సీరియస్‌గా తీసుకోడు. సంస్థను అంటిపెట్టుకొని ఉన్న వారి జీవితాలతో ఆటలాడుతున్నారంటూ ట్వీట్‌ చేశారు. ఇక బిజ్‌ నిర్ణయాన్ని ట్విటర్‌ కోఫౌండర్‌లో ఒకరైన ఎవ్ విలియమ్స్  సమర్ధించారు. 

మరిన్ని వార్తలు