Twitter Shareholders Vote: ఎలాన్‌మస్క్‌కి ట్విటర్‌ కౌంటర్‌ ఎటాక్‌ ?

9 Jun, 2022 09:03 IST|Sakshi

మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ల మధ్య నెలకొన్న వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. ట్విటర్ కొనుగోలు వ్యవహారం ఒక అడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టుగా మారింది. దీంతో ఇటు ఎలన్‌ మస్క్‌, అటూ ట్విటర్‌ ఈ డీల్‌లో పై చేయి సాధించేందుకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు.

ఫేక్‌ చుట్టూ డీల్‌
ట్విటర్‌ను ఏక మొత్తంగా కొనుగోలు చేస్తానంటూ 2022 ఏప్రిల్‌లో ఎలాన్‌ మస్క్‌ భారీ ఆఫర్‌ ప్రకటించారు. 44 బిలియన్‌ డాలర్లు చెల్లిస్తానంటూ ఓపెన్‌ ఆఫర్‌ ఇచ్చారు. ఈ ఆఫర్‌పై ట్విటర్‌ బోర్డులో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనా... మెజారిటీ షేర్‌ హోల్డర్లు ఆఫర్‌కు సుముఖంగా ఉండటంతో డీల్‌ ముందుకు వెళ్లింది. ఇక చెల్లింపు వ్యవహరం ఎలా? అనేది తేలాల్సిన సమయంలో ఎలాన్‌ మస్క్‌ కొత్త పేచీ పెట్టారు. ట్విటర్‌లో ఫేక్‌ ఖాతాలు 20 శాతం వరకు ఉన్నాయంటూ ఆరోపించారు. తన ఆరోపణలు తప్పని రుజువు చేసుకోవాలని కండీషన్‌ పెట్టారు.

థర్డ్‌ పార్టీకి నో
ఫేక్‌ ఖాతాలు 5 శాతానికి మించి ఉండవని ట్విటర్‌ అంటోంది. అధునాతన సాంకేతిక పద్దతుల్లో ఎప్పటికప్పుడు ఫేక్‌/స్పామ్‌ ఖాతాలకు చెక్‌ పెడుతున్నామని, ఐనా కొత్త పద్దతుల్లో అవి పుట్టుకొస్తూనే ఉన్నాయంటూ వివరణ ఇచ్చింది. మస్క్‌ ఆరోపణలకు తలొగ్గి ఫేక్‌ ఖాతాలపై థర్డ్‌ పార్టీ విచారణకు అంగీకరించేది లేదని కరాఖండీగా చెప్పింది. కోట్లాది మంది యూజర్ల డేటా ప్రైవసీ దృష్ట్యా బయటి వ్యక్తులను ఈ విషయంలో జోక్యం చేసుకోనివ్వబోమంటోంది ట్విటర్‌.

లెక్క తేలితేనే
ఫేక్‌ఖాతాల విషయంలో తనకు ఉన్న సందేహాలు నివృత్తి చేయకుంటే ట్విటర్‌ కొనుగోలు డీల్‌ ముందుకు కదలదంటూ ఎలాన్‌ మస్క్‌ తేల్చి చెప్పారు. ఫేక్‌ ఖాతాలు ఉన్న కంపెనీకి అంత సొమ్ము చెల్లించక్కర్లేదంటూ మెలిక పెట్టారు. దీంతో ట్విటర్‌ ఇరకాటంలో పడ్డటయ్యింది. థర్డ్‌ పార్టీ విచారణకు అంగీకరిస్తే ముందుగా చెప్పినట్టు ‘యూజర్‌ ప్రైవసీ’ అంశం అడ్డుపడుతుంది. కాదని వెనకడుగు వేస్తే నిజంగానే ఫేక్‌ ఖాతాలు ఎక్కువగా ఉన్నాయా అనే సందేహాలు నిజం చేసినట్టు అవుతుంది. దీంతో ట్విటర్‌ పరిస్థితి ముందునుయ్యి వెనుక గొయ్యిలా మారింది.

తెరపైకి ఓటింగ్‌
ఎలాన్‌ మస్క్‌ డీల్‌తో ఎదరైన చిక్కుల నుంచి సామరస్యంగా బయటపడే యోచనలో ఉంది ట్విటర్‌. ఇరు వర్గాలు ఎవరి వాదనకు వారు కట్టుపడటంతో ప్రతిష్టంభన నెలకొంది. దీనికి విరుగుడుగా ట్విటర్‌ బోర్డు కొత్త వ్యూహంతో ముందుకు వచ్చింది. డీల్‌ ఫైనల్‌ దశకు వెళ్లడానికి ముందు ట్విటర్‌ను అమ్మేయాలా ? వద్దా అనే అంశంపై షేర్‌ హోల్డర్లతో ఓటింగ్‌ ప్రక్రియ నిర్వహించాలని డిసైడ్‌ అయ్యింది. అంతకు ముందు ఓటింగ్‌ లేకుండానే అమ్మేయాలని డిసైడ్‌ అయ్యారు . కానీ ఇప్పుడు అది తప్పని తేలిపోయింది. ఎలాన్‌ మస్క్‌ లాంటి వ్యక్తితో వ్యహారం నడపాలంటే ఉత్తి మాటలతో సరిపోదని ట్విటర్‌ బోర్డుకి అర్థమైంది. అందుకే కొత్త వ్యూహాన్ని తెర మీదకు తెచ్చింది. దాదాపుగా ట్విటర్‌ కొనుగోలు డీల్‌ అంశం ఆగష్టులో తుదిదశకు చేరుకోవాల్సి ఉంది. అంతకంటే ముందే జులై లేదా ఆగస్టు ఆరంభంలో ఓటింగ్‌కు సన్నాహకాలు చేస్తోంది. ఓటింగ్‌ సరళి ఆధారంగా ఈ డీల్‌ విషయంలో ముందుకు సాగే యోచనలో ట్విటర్‌ ఉంది. 

చదవండి: ట్విటర్‌ డీల్‌: ఈలాన్‌  మస్క్‌ మరో బాంబు

మరిన్ని వార్తలు