మునుగుతున్న ట్విటర్‌ 2.0? ఉద్యోగుల సంఖ్య తెలిస్తే షాకవుతారు!

18 Nov, 2022 12:51 IST|Sakshi

న్యూఢిల్లీ: ట్విటర్‌ టేకోవర్‌ చేసిన బిలియనీర్‌, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ నిర్ణయాలు ట్విటర్‌ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఇప్పటి వరకూ ట్విటర్‌లో విశేష సేవలందించిన ముఖ్యమైన ఎగ్జిక్యూటివ్‌లు,  కీలక ఇంజనీర్లు  ఈ విషయాన్ని బహిరంగంగానే వ్యక్తం చేశారు. ట్విటర్‌.1లో తమ పని ముగిసిందని, ఇక ట్విటర్‌2లో తాము ఉండదలుచు కోలేదంటూ చాలామంది ట్వీట్‌ చేశారు. 

దారుణంగా పడిపోయిన ఉద్యోగుల సంఖ్య
అంతేకాదు హార్డ్‌కోర్‌ అల్టిమేటం డెడ్‌లైన్‌ తరువాత బరువైన హృదయంతో వందలాదిమంది ట్విటర్‌నుంచి వైదొలిగే నిర్ణయాన్ని  ఎంచుకున్నారు. ఫలితంగా మస్క్‌ బాధ్యతలు చేపట్టకముందు 7500గా ఉన్న ట్విటర్‌ ఉద్యోగుల సంఖ్య డెడ్‌లైన్‌కి ముందు దాదాపు 2,900 మందికి చేరింది.  ప్రస్తుతం వందలాదిమంది ఉద్యోగుల రాజీనామా ఈ సంఖ్య మరింత క్షీణించింది.  (ఉద్యోగుల ఝలక్‌, ఆఫీసుల మూత: మస్క్‌ షాకింగ్‌ రియాక్షన్‌)

కోలుకోవడం కష్టమే: ఉద్యోగుల ఆందోళన
అటు ఉద్యోగుల తీసివేతతోపాటు, కొంతమంది రాజీనామాలు కూడా ఊపందుకున్నాయి. ఈ వారం రాజీనామాల స్థాయిని బట్టి చూస్తే ట్విటర్‌ నాశనమవుతోందని  ట్విటర్‌ను వీడుతున్న ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. లెజెండరీ ఇంజనీర్లు మాత్రమే కాదు చాలామంది ఇతరులు కూడా ఒక్కొక్కరుగా విడిచిపెట్టాలని చూస్తున్నారని చెబుతున్నారు. ట్విటర్‌ను ఇంత ఉన్నతంగా, అపురూపంగా మార్చిన వ్యక్తులందరూ వెళ్లిపోతున్నారు. కోర్ సిస్టమ్ లైబ్రరీ టీం, 24/7 టెక్నికల్‌  సమస్యలను పరిశీలించే కమాండ్ సెంటర్, డెవలపర్‌ ట్విటర్‌ ఏపీఐ టీంలు దాదాపు ఖాళీ అయిపోయాయి. ఈ నేపథ్యంలో ఎంత హార్డ్‌కోర్‌గా పనిచేసిన ఇక సంస్థ కోలుకోవడం కష్టమే అని అభిప్రాయ పడుతున్నారు. 

అత్యవసర మీట్‌,  మస్క్‌ బుజ్జగింపులు
అంతేకాదు తాజా పరిణామాల నేపథ్యంలో పలువురు కీలక ఉద్యోగులతో మస్క్‌ అత్యసర మీట్‌ ఏర్పాటు  చేసినట్టు పలు నివేదికల ద్వారా తెలుస్తోంది. డెడ్‌లైన్‌ముగిసిన తరువాత కొంతమంది ఉద్యోగులను శాన్ ఫ్రాన్సిస్కో కార్యాలయంలోని కాన్ఫరెన్స్ గదికి పిలిపించి, మరి కొందరిని వీడియో కాన్ఫరెన్స్ పెట్టి మరీ బుజ్జగించి కంపెనీని విడిచి పెట్టకుండా మస్క్‌ అతని సలహాదారులు ఆపినట్టు తెలుస్తోంది. అయితే మరికొంతమంది మాత్రం మస్క్‌ మాట్లాడుతుండగానే మీట్‌ నుంచి తప్పు కున్నారు. అలాగే ట్విటర్‌ 2.0 లో పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారా అంటూ, ట్విటర్ రిక్రూటర్‌లు తమ ప్రయత్నాలు మొదలు పెట్టారట.

కాగా అక్టోబరు నెల చివర్లో అతను  44 బిలియన్‌ డాలర్లకు  ట్విటర్‌ను కొనుగోలు డీల్‌  పూర్తి చేశారు బిలియనీర్‌, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్.  టేకోవర్‌ అలా పూర్తియిందో లేదో, ఇలా సమూల మార్పులకు  శ్రీకారం  చుట్టి విమర్శల పాలవుతున్నారు మస్క్‌. ముఖ్యంగా అప్పటి సీఈవో పరాగ్‌ అగర్వాల్‌ సహాల పలువురు కీలక ఎగ్జిక్యూటివ్‌లను, కంపెనీ సిబ్బందిలో సగం మందిని తొలగించడం, వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం రద్దు, ఎక్కువ పనిగంటలు లాంటివి ఉద్యోగుల్లో తీవ్ర గందరగోళానికి దారి తీశాయి.

అంతేకాదు ట్విటర్‌ డైరెక్టర్ల బోర్డును రద్దుచేసిన మస్క్‌ ఏకైక డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. తనను ప్రశ్నించిన కీలక ఇంజనీర్లపై పబ్లిగ్గానే వేటు వేశారు. వివాదాస్పద బ్లూటిక్‌ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్‌ యూజర్ వెరిఫికేషన్‌ మరింత వివాదాన్ని రేపింది. అయితే నకిలీ ఖాతాలు ఇబ్బడిముబ్బడిగా పుట్టుకు రావడంతో ఆనిర్ణయం అమలు వాయిదా వేసుకొన్నారు. అయితే నవంబరు 29 నుంచి ఫీజుల వసూలు ఖాయమని నిర్ధారించారు మస్క్‌. ఈ పరిణామాల నేపథ్యంలో ఆడి, వోక్స్‌వ్యాగన్‌ లాంటి అనేక టాప్‌ కంపెనీలు  తమ  ప్రకటనలను నిలిపివేశాయి.

మరిన్ని వార్తలు