ఉద్యోగులకు ట్విటర్‌ బాస్‌ ఎలాన్‌ మస్క్‌ మరో షాక్‌!

8 Jan, 2023 10:38 IST|Sakshi

ట్విటర్‌ బాస్‌ ఎలాన్‌ మస్క్‌ ఆ సంస్థ ఉద్యోగులకు మరో షాక్‌ ఇచ్చారు. గ్లోబల్‌ కంటెంట్‌ మోడరేషన్‌ విభాగంలో ఉన్న ట్రస్ట్‌ అండ్‌ సేప్టీ ఉద్యోగుల్ని ఫైర్‌ చేస్తున్నట్లు బ్లూమ్‌బెర్గ్‌ నివేదిక తెలిపింది. 

ఐర్లాండ్‌, సింగపూర్‌కు చెందిన ట్విటర్‌ ఉద్యోగుల్ని శనివారం రాత్రి ఎలాన్‌ మస్క్‌  ఫైర్‌ చేసినట్లు మెయిల్స్‌ పంపినట్లు బ్లూమ్‌బెర్గ్‌ నివేదించింది. తొలగించిన వారిలో ఇటీవల ఆసియా-పసిఫిక్ ప్రాంతానికి సైట్ ఇంటిగ్రిటీ హెడ్‌గా నియమించబడిన నూర్ అజార్ బిన్ అయోబ్, ట్విటర్ రెవెన్యూ పాలసీ సీనియర్ డైరెక్టర్ అనలూయిసా డొమింగ్యూజ్ ఉన్నారు. వారితో పాటు ప్లాట్‌ఫారమ్‌లో తప్పుడు సమాచారం, గ్లోబల్ అప్పీల్స్,స్టేట్ మీడియాపై పాలసీని నిర్వహించే టీమ్‌లలోని ఉద్యోగులకు సైతం పింక్‌ స్లిప్‌లు జారీ చేసినట్లు నివేదిక పేర్కొంది. 

ఉద్యోగుల తొలగింపులపై ట్విటర్ ట్రస్ట్ అండ్ సేఫ్టీ వైస్ ప్రెసిడెంట్ ఎల్లా ఇర్విన్ మాట్లాడుతూ.. శుక్రవారం రాత్రి ట్రస్ట్ అండ్ సేఫ్టీ టీమ్‌లో ట్విటర్‌ కొంతమందిని ఫైర్‌ చేసిందని, అయితే వివరాలు వెల్లడించలేదని రాయిటర్స్‌కు ధృవీకరించారు. నవంబర్ ప్రారంభంలో ఖర్చు తగ్గించుకునేందుకు ట్విటర్‌కు చెందిన 3,700 మంది ఉద్యోగులను మస్క్‌ వేటు వేశారు. ఆ తర్వాత మస్క్‌ విధించిన నిబంధనల్ని వ్యతిరేకిస్తూ వందల మంది ఉద్యోగులు రాజీనామా చేశారు. తాజాగా లేఆఫ్స్‌ ప్రకటన ట్విటర్‌ ఉద్యోగుల్లో కలకలం రేపుతోంది. 

మరిన్ని వార్తలు