న్యూస్‌ ఏజెన్సీ ఏఎన్‌ఐ ఖాతాను లాక్‌ చేసిన ట్విటర్‌.. కారణం తెలిస్తే అవాక్కవుతారు..!

29 Apr, 2023 17:39 IST|Sakshi

మైక్రో-బ్లాగింగ్ ప్లాట్‌ఫామ్‌ ట్విటర్‌ ప్రముఖ న్యూస్‌ ఏజెన్సీ ఏషియన్ న్యూస్ ఇంటర్నేషనల్ - ఏఎన్‌ఐ (ANI) ఖాతాను లాక్‌ చేసింది. కనీస వయసు ప్రమాణాలను పాటించనందుకు తమ ఖాతాను ట్విటర్ లాక్ చేసిందని ఏఎన్‌ఐ ఎడిటర్ స్మితా ప్రకాష్ తాజాగా తెలిపారు. ఈ వార్తా సంస్థకు ట్విటర్ హ్యాండిల్‌ను క్లిక్‌ చేయడానికి ప్రయత్నించగా 'ఈ ఖాతా ఉనికిలో లేదు' అని చూపుతోంది.

ఇదీ చదవండి: ఏటీఎం చార్జీలు.. జీఎస్టీ కొత్తరూల్‌! మే 1 నుంచి అమలయ్యే కీలక మార్పులు ఇవే..

ఏఎన్‌ఐ ట్విటర్ ఖాతా లాక్‌ అయిన కొన్ని నిమిషాల తర్వాత స్మితా ప్రకాష్ ఏఎన్‌ఐ హ్యాండిల్ లాక్ చేసినట్లు తెలియజేస్తూ ట్విటర్ పంపిన ఈ-మెయిల్ స్క్రీన్‌షాట్‌ను తన వ్యక్తిగత ఖాతా ద్వారా ట్వీట్‌ చేశారు. మొదట మా ఖాతాకున్న గోల్డ్‌ టిక్‌ తీసేసి బ్లూటిక్‌ ఇచ్చారు. ఇప్పుడు లాక్‌ చేశారు అంటూ ఎలాన్‌ మస్క్‌ను ట్యాగ్‌ చేశారు. ‘ట్విటర్ ఖాతాను సృష్టించడానికి, మీకు కనీసం 13 సంవత్సరాలు ఉండాలి. మీరు ఈ వయసు నిబంధనకు అనుగుణంగా లేరని ట్విటర్‌ నిర్ధారించింది. కాబట్టి మీ ఖాతాను లాక్ చేశాం’ అని ఈ-మెయిల్‌లో ట్విటర్‌ పేర్కొంది.

ఇదీ చదవండి: Google Play Store: గూగుల్‌ సంచలనం! 3500 యాప్‌ల తొలగింపు..

ఏఎన్‌ఐ వెబ్‌సైట్‌ ప్రకారం.. దక్షిణాసియా ప్రముఖ మల్టీమీడియా వార్తా సంస్థ అయిన ఏఎన్‌ఐకి భారతదేశం, దక్షిణ ఆసియా సహా ప్రపంచవ్యాప్తంగా 100 కంటే ఎక్కువ బ్యూరో సెంటర్లు ఉన్నాయి. ఇక ఏఎన్‌ఐ ట్విటర్‌ ఖాతాకు 7.6 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.

ఎన్‌డీటీవీ ఖాతా కూడా..

మరోవైపు ఎన్‌డీటీవీ ఖాతాను కూడా ట్విటర్‌ లాక్‌ చేసింది.  ఎన్‌డీటీవీ ట్విటర్‌ హ్యాండిల్‌ను ఓపెన్‌ చేయగా అకౌంట్‌ ఉనికిలో లేనట్లు చూపిస్తోంది. అయితే ఎన్‌డీటీవీ ట్విటర్‌ అకౌంట్‌ ఎందుకు నిలిచిపోయిందన్నది తెలియరాలేదు.

మరిన్ని వార్తలు