మరీ ఇంత దారుణమా! అద్దె కూడా చెల్లించని ఎలాన్‌ మస్క్‌.. కోర్టులో దావా

24 Jan, 2023 19:34 IST|Sakshi

 ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫాం ట్విటర్‌ను బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ టేకోవర్‌ చేసినప్పటి నుంచి క్రమంగా కొత్త రూపు సంతరించుకుంటోంది. అయినా ఆర్థిక కష్టాల్లో సతమతమవుతోంది. ఎంతలా అంటే చివరికి తమ కార్యాలయాలకు అద్దె కూడా చెల్లించలేని స్థితికి చేరుకుంది. ట్విటర్‌ 1355 మార్కెట్ స్ట్రీట్‌లోని తన కార్యాలయాలకు డిసెంబర్ అద్దె 3.36 మిలియన్‌ డాలర్లు  జనవరి అద్దెకు 3.42 మిలియన్‌ డాలర్లు చెల్లించడంలో విఫలమైంది. దీంతో భవన యజమాని శ్రీ నైన్ మార్కెట్ స్క్వేర్ ఎల్‌ఎల్‌సీ, కోర్టును ఆశ్రయించింది. కాలిఫోర్నియా స్టేట్‌ కోర్టులో దావా వేసింది. 

కార్యాలయాన్ని అద్దెకు ఇస్తున్న సమయంలో ట్విటర్‌ నుంచి శ్రీ నైన్‌ మార్కెట్‌ 3.6 మిలియన్‌ డాలర్ల ‘లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌’ను పూచీకత్తుగా తీసుకుంది. ఇటీవల ట్విటర్‌ అద్దె చెల్లించకపోవడంతో లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ ద్వారా అద్దె బకాయిలో కొంత భాగాన్ని బ్యాంకు నుంచి తీసుకున్నట్లు తెలిపింది. మిగిలిన అద్దె చెల్లించేలా ట్విటర్‌కు ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేసింది. అలాగే లెటర్‌ ఆఫ్‌ క్రెడిట్‌ను సైతం 10 మిలియన్‌ డాలర్లకు పెంచేలా ఆదేశించాలని కోరింది.

ట్విటర్‌ను టేకోవర్ చేసినప్పటి నుంచి ఎలాన్‌ మస్క్‌ ఖర్చులు తగ్గించుకునే పనిలో ఉన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే సంస్థలోని సగం మంది సిబ్బందిని తొలగించాడు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంపెనీ ఇతర కార్యాలయాల్లో అద్దెను నిలపడంతో పాటు జెట్, చార్టర్ వంటి కొన్ని బకాయి బిల్లులను చెల్లించేందుకు కూడా నిరాకరించాడు. మొత్తానికి గత బకాయిలను చెల్లించడానికీ అంగీకరించడం లేదు.

చదవండి: ఫ్రీగా క్రెడిట్‌ కార్డు.. ఓటీటీ సబ్‌స్క్రిప్షన్, ఈఎంఐ ఆఫర్లంటూ బోలెడు బెనిఫిట్స్‌!

మరిన్ని వార్తలు