పరాగ్‌, విజయపై అయిష్టత ఎందుకు? ట్విటర్‌ డీల్‌పై భారత్‌ స్పందన ఏంటి? 

29 Oct, 2022 10:28 IST|Sakshi

న్యూఢిల్లీ: మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ అమెరికన్‌ ఎలక్ట్రిక్‌ కార్ల దిగ్గజం టెస్లా చీఫ్‌ ఎలాన్‌  మస్క్‌ చేతికి ట్విటర్‌ వచ్చింది.  ఈ మొత్తం వ్యవహారంలో తనను బాగా ఇబ్బంది పెట్టారని భావిస్తున్న ట్విటర్‌ సీఈవో పరాగ్‌ అగ్రవాల్, లీగల్‌ ఎగ్జిక్యూటివ్‌ విజయ గద్దెతో పాటు సీఎఫ్‌వో నెడ్‌ సెగాల్, జనరల్‌ కౌన్సిల్‌ షాన్‌ ఎడ్జెట్‌లపై తక్షణం వేటు వేసిన సంగతివ తెలిసిందే.. వారిలో ఒకరిని అవమానకరమైన రీతిలో .. ట్విటర్‌ ఆఫీసు నుండి దాదాపు గెంటివేసినంత పని చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 

పరాగ్, విజయ అంటే అందుకే అయిష్టం
అయితే ఉద్వాసనకు గురైన పరాగ్‌ అగ్రవాల్‌ .. గతేడాది నవంబర్‌లోనే సంస్థ సహ-వ్యవస్థాపకుడు జాక్‌ డోర్సే స్థానంలో సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. బాంబే ఐఐటీలోనూ, స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్సిటీలోనూ విద్యాభ్యాసం చేసిన అగ్రవాల్‌ .. దాదాపు దశాబ్దం క్రితం ట్విటర్‌లో చేరారు. తర్వాత సీఈవోగా ఎదిగారు. ట్విటర్‌ టేకోవర్‌ వ్యవహారంలో మస్క్‌తో బహిరంగంగాను, ప్రైవేట్‌గాను అగ్రవాల్‌ పోరాటం సాగించారని, అందుకే ఆయనపై మస్క్‌ కత్తిగట్టారని న్యూయార్క్‌ టైమ్స్‌ పోస్ట్‌ పేర్కొంది.

అలాగే హైదరాబాదీ అయిన లీగల్‌ ఎగ్జిక్యూటివ్‌ విజయ గద్దె (48) విషయానికొస్తే .. అభ్యంతరకర ట్వీట్లు చేస్తున్నారంటూ ఏకంగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఖాతాను రద్దు చేయడం ద్వారా ఆమె వార్తల్లోకెక్కారు. ’కంటెంట్‌ను క్రమబద్ధీకరించడంలో ట్విటర్‌ నిర్ణయాలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నారు’ అంటూ విజయపై కూడా మస్క్‌ విమర్శలు గుప్పించారు. కంపెనీ తన చేతికి వచ్చీ రాగానే ఆమెను తప్పించారు. అయితే, ఉద్వాసనకు గురైన టాప్‌ ఎగ్జిక్యూటివ్‌లకు భారీగానే పరిహారం ముట్టనుంది. వారి వాటాలను కొనుగోలు చేసేందుకు, అర్ధాంతరంగా తొలగించినందుకు గాను పరిహారం కింద ఆయా ఉద్యోగులకు మస్క్‌ దాదాపు 200 మిలియన్‌ డాలర్లు చెల్లించుకోవాల్సి రానుంది. (Parag Agrawal పరాగ్‌ అగర్వాల్‌కు ఎన్ని వందల కోట్లు వస్తాయంటే?)

 కాగా దాదాపు ఆరేడు నెలలకు పైగా నడుస్తున్న మస్క్‌–ట్విటర్‌ ప్రహసనానికి ఎట్టకేలకు తెరపడింది. 44 బిలియన్‌ డాలర్ల డీల్‌ను మస్క్‌  పూర్తి చేశారు. డీల్‌ పూర్తయిన వెంటనే తన ప్రణాళికలను కూడా చకచకా అమలు చేయడం ప్రారంభించారు. అయితే కంపెనీని కొంటే 75 శాతం మందిని తీసేస్తానంటూ మస్క్‌ గతంలో చేసిన ప్రకటనతో ఉద్యోగుల్లో ఇంకా భయాందోళనలు నెలకొన్నాయి. అయితే, అలాంటిదేమీ ఉండబోదంటూ మస్క్‌ హామీ ఇచ్చే ప్రయత్నం చేశారు. మరోవైపు, మస్క్‌ చేతికి చేరిన నేపథ్యంలో శుక్రవారం నుండి ట్విటర్‌ షేర్లలో ట్రేడింగ్‌ నిల్చిపోయింది. 

నిబంధనలు పాటించాల్సిందే: భారత్‌
ట్విటర్‌ ఎవరి చేతిలో ఉన్నా భారత్‌లో కార్యకలాపాలు సాగించాలంటే నిబంధనల ప్రకారం పనిచేయాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. కంపెనీని మస్క్‌ టేకోవర్‌ చేసినంత మాత్రాన దేశంలో నిబంధనలు మారిపోవని ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్‌ పేర్కొన్నారు. సోషల్‌ మీడియా కంపెనీలకు భారత్‌ భారీ మార్కెట్‌గా 
ఉంటోంది. అయితే, ఇటీవలి కొత్త ఐటీ నిబంధనల విషయంలో ట్విటర్‌కి, ప్రభుత్వానికి మధ్య విభేదాలు తలెత్తాయి. టెస్లా కార్ల దిగుమతి  సుంకాలు, స్టార్‌లింక్‌ శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసుల విషయంలో  ప్రభుత్వంతో మస్క్‌కు కూడా విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో  నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించు కున్నాయి.   

మరిన్ని వార్తలు