ఎలన్‌మస్క్‌కి ట్విటర్‌ బోర్డ్‌ కౌంటర్‌.. తెరపైకి పాయిజన్‌ పిల్‌?

16 Apr, 2022 12:36 IST|Sakshi

ఫ్రీ స్పీచ్ ఫ్లాట్‌ఫామ్‌ కావాలంటూ ఏకంగా ట్విటర్‌ కొనేస్తానంటూ ప్రపంచ కుబేరుడు ఎలన్‌ మస్క్‌ చేసిన భారీ ఆఫర్‌కి గట్టి కౌంటర్‌ ఇచ్చే పనిలో పడింది ట్విటర్‌ బోర్డు. ఆలస్యం చేసే కొద్ది ఎలన్‌మస్క్‌ నుంచి ఒత్తిడి ఎక్కువ అవుతుండంతో ఈ కౌంటర్‌ స్ట్రాటజీని త్వరగా పట్టాలెక్కించే పనిలో పడింది.  

అరుదైన ఎత్తుగడ
ఎట్టి పరిస్థితుల్లో ఎలన్‌మస్క్‌ ఎత్తులు పారకుండా చూసేందుకు ట్విటర్‌ బోర్డు కొత్త ప్రతిపాదనను తెరమీదకు తెచ్చింది. కార్పొరేట్‌ కంపెనీలు చాలా అరుదుగా ఉపయోగించే పాయిజన్‌ పిల్‌ విధానం అమలు చేసేందుకు రెడీ అవుతున్నట్టు సమాచారం. దీనిపై ట్విటర్‌ నుంచి అధికారిక ప్రకటన ఏదీ రాకపోయినా.. అంతర్గతంగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి.

పాయిటజ్‌ పిల్‌
పాయిజన్‌ పిల్‌ విధానంలో కంపెనీలో ఉన్న షేర్‌ హోల్డర్లకు డిస్కౌంట్‌ ధరకే మరిన్ని షేర్లను కేటాయిస్తారు. దీని వల్ల కంపెనీలో షేర్ల సంఖ్య అమాంతం పెరిగిపోతుంది. షేర్ల సంఖ్య పెరిగిపోవడంతో కొనుగోలు విలువ కూడా పెరుగుతుంది. ఫలితంగా కంపెనినీ టేకోవర్‌ చేయాలని భావించే వ్యక్తి/సంస్థకు ఆసక్తి తగ్గిపోతుంది. చాలా అరుదుగా ఈ పాయిజన్‌ పిల్‌ను ఉపయోగిస్తారు.

ఆసక్తి పోయేలా
ట్విటర్‌కు సంబంధించినంత వరకు మేజర్‌ షేర్‌ హోల్డర్‌ గరిష్ట వాటా 15 శాతం మించడానికి వీలులేదు. ఒకవేళ ఎవరైనా వ్యక్తి / సంస్థ 15 శాతం వాటాను మించి ఇంకా షేర్లు కావాలని కోరితే ఆ వ్యక్తి/సంస్థను మినహాయించి, మిగిలిన షేర్‌ హోల్డర్లందరికీ పాయిజన్‌ పిల్‌ విధానంలో డిస్కౌంట్‌ ధరకే షేర్ల కేటాయింపు జరుగుతుంది. అంటే ప్రస్తుతం ఎలన్‌మస్క్‌ ఆఫర్‌ చేసిన 43.4 బిలియన్‌ డాలర్ల మొత్తం కూడా ట్విటర్‌ కొనుగోలు చేసేందుకు సరిపోదు. ఫలితంగా మరింత సొమ్ము వెచ్చించడమా లేక వెనక్కి తగ్గడమా అన్నది ఎలన్‌మస్క్‌ నిర్ణయించుకోవాల్సి ఉంటుంది.

వాళ్లకి ఇష్టం లేదు
టెస్లా కార్ల కంపెనీ యజమాని ఎలన్‌మస్క్‌ ఇటీవల ట్విటర్‌లో 9.2 శాతం షేర్లను కొనుగోలు చేసి మేజర్‌ షేర్‌హోల్డర్‌గా మారాడు. అయితే బోర్డు సభ్యుడిగా ఉండేందుకు నిరాకరించాడు. ఆ వెంటనే ట్విటర్‌ను కొనుగోలు కోసం 43.4 బిలియన్‌ డాలర్లు ఇస్తానంటూ భారీ ఆఫర్‌ చేశాడు. ఎలన్‌మస్క్‌ ఆఫర్‌పై రిటైల్‌ ఇన్వెస్టర్లు కొంత మేర ఆసక్తిగా ఉన్నా ట్విటర్‌ బోర్డు, ఎంప్లాయిస్‌ ఇంట్రస్ట్‌ చూపెట్టడం లేదు. దీంతో ఎలన్‌మస్క్‌ తనంతట తానుగా ట్విటర్‌పై ఆసక్తి క్ల్పపోయేలా చేసేందుకు చాలా ఆరుదుగా ఉపయోగించే మార్గాన్ని ఎంచుకోవాలని చూస్తోంది. 

చదవండి: ఎలన్‌ మస్క్‌ భారీ ఆఫర్‌కి ఉద్యోగుల స్పందన ఇలా..

మరిన్ని వార్తలు