ట్విటర్‌ బంపర్‌ ఆఫర్‌..! బగ్‌ గుర్తిస్తే భారీ పారితోషికం..!

3 Aug, 2021 16:50 IST|Sakshi

ట్విటర్‌ తన యూజర్లకోసం ఆసక్తికర పోటీను ఏర్పాటు చేసింది, ట్విట్టర్‌లో యూజర్ల డేటాకు సంబంధించి తాను అందిస్తున్న సెక్యూరిటీపై తనకు తానే ఛాలెంజ్‌ విసురుకుంది. ట్విటర్‌లోని లోపాలను గుర్తిస్తే ఏకంగా రెండున్నర లక్షల రూపాయల బహుమతి అందిస్తామని ప్రకటించింది.

హ్యాకర్లకు సవాల్‌
తమ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ అల్గారిథంలో బగ్‌ను గుర్తిస్తే నగదు బహుమతిని అందిస్తామని ట్విటర్‌ ప్రకటించింది.  బగ్‌ బౌంటీ ప్రోగ్రాంను ప్రవేశపెట్టడం ట్విటర్‌కి ఇదే తొలిసారి. ఈ ఏడాది హ్యాకర్ కన్వెన్షన్ ఈవెంట్‌ను డెఫ్‌ కాన్‌ ఏఐ (DEF CON AI) విలేజ్‌లో ఈ పోటీ జరగనుంది. ఈ విషయాన్ని తన బ్లాగ్ పోస్ట్‌లో ట్విటర్‌ ప్రకటించింది.  మెషిన్ లెర్నింగ్ అల్గారిథం మోడళ్లలోని లోపాలను కనుగొనడం చాలా కష్టమని, హ్యాకర్లకు ఇదో సవాల్‌ అని పేర్కొంది. దాన్ని స్వీకరించి లోపాలను పట్టిస్తే భారీ బహుమతి ముట్టచెబుతామంది.  

యూజర్ల మేలు కోసమే
కంపెనీకి చెందిన ముఖ్యమైన అల్గారిథం, ఇమేజ్ క్రాపింగ్ అల్గారిథంలోని లోపాన్ని గుర్తించడానికి ట్విట్టర్ ఈ పోటీని మేలోనే ప్రకటించింది. అంతేకాకుంగా అందుకు సంబంధించిన కోడ్‌ను యూజర్లకు అందుబాటులో ఉంచింది. యూజర్లను ప్రోత్సహించడం ద్వారా అల్గారిథంలో ఉన్న లోపాలను గుర్తిస్తేనే పరిష్కరించడం సులువు అవుతుందని ట్విటర్‌ పేర్కొంది. అందుకే  యూజర్లను హ్యాకింగ్‌ నుంచి రక్షించడానికే ఈ పోటీ పెడుతున్నామంది. 

గోల్డెన్‌ ఛాన్స్‌
ఏథికల్‌ హ్యాకర్లు, రిసెర్చ్‌ కమ్యూనిటీ డెవలపర్లకు ఈ పోటీ సువర్ణావకాశమని ట్విటర్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ పోటీలతో విస్తృత స్థాయిలోని సమస్యలను గుర్తించడంలో సహాయపడుతుందని ట్విటర్‌ తెలిపింది. 

భారీ బహుమతి
ట్విటర్‌ బిగ్‌ బౌంటీ ప్రోగ్రాంలో భాగంగా లోపాలను గుర్తించిన మొదటి, రెండో, మూడో స్థానాల్లో నిలిచిన వ్యక్తులకు వరుసగా $ 3,500 (సుమారు రూ. 2,60,242), $ 1,000 (సుమారు రూ. 74,369), $ 500 (సుమారు రూ. 37,184) నగదు బహుమతులను ట్విటర్‌ అందించనుంది. ట్విటర్‌ ఆగస్టు 8న డేఫ్‌ కాన్‌ ఏఐ విలేజ్‌లో  హోస్ట్‌ చేస్తోన్న వర్క్‌ షాప్‌లో విజేతలను ప్రకటించనుంది.  ఈ పోటీలో పాల్గొనే ఔత్సాహికులకు 2021 ఆగస్టు 6 వరకు ఎంట్రీలు చేయవచ్చును.  


 

మరిన్ని వార్తలు