వడ్డీ రేట్ల పెంపు జాబితాలోకి మరో రెండు బ్యాంకులు

17 Feb, 2023 07:37 IST|Sakshi

ముంబై: వడ్డీ రేటు పెంపు జాబితాలో తాజాగా ప్రభుత్వ రంగంలోని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీఓబీ), ఇండియన్‌ ఓవర్‌సిస్‌ బ్యాంక్‌ (ఐఓబీ) చేరాయి. ఈ నెల మొదట్లో ఆర్‌బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను పావుశాతం పెంచడం (6.5 శాతానికి) దీనికి నేపథ్యం. ఎస్‌బీఐ బుధవారం రేట్ల పెంపు నేపథ్యంలో తాజాగా ఈ జాబితాలో బీఓబీ, ఐఓబీలు చేరడం గమనార్హం. 

బీఓబీ: నిధుల సమీకరణ వ్యయ ఆధారిత రుణ రేటు– ఎంసీఎల్‌ఆర్‌ను అన్ని కాల వ్యవధులపై 5 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) పెంచింది. ఫిబ్రవరి 12 నుంచీ తాజా రేటు అమల్లోకి వస్తుందని పేర్కొంది. తాజా పెంపు నేపథ్యంలో ఏడాది రేటు 8.55 శాతానికి, ఓవర్‌నైట్, నెల, మూడు నెలా రేట్లు వరుసగా 7.9 శాతం, 8.2 శాతం, 8.3 శాతానికి చేరాయి. 

ఐఓబీ: అన్ని కాలపరిమితులపై ఎంసీఎల్‌ఆర్‌ 15 బేసిస్‌ పాయింట్ల వరకూ పెరిగింది. ఏడాది ఎంసీఎల్‌ఆర్‌ 0.15 శాతం పెరిగి 8.45కు చేరింది. నెల, మూడు, ఆరు నెలల రేట్లుసైతం ఇదే స్థాయిలో పెరిగి వరుసగా 7.9 శాతం, 8.2 శాతం, 8.35 శాతాలకు చేరాయి. ఓవర్‌నైట్, రెండేళ్లు, మూడేళ్ల రేట్లు 10 బేసిస్‌ పాయింట్లు పెరిగాయి. 

ఎస్‌బీఐ డిపాజిటర్లకు తీపికబురు 
రుణ రేటును బుధవారం 10 బేసిస్‌ పాయింట్లు పెంచిన  బ్యాంకింగ్‌ దిగ్గజం– స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) డిపాజిట్‌ రేట్లను కూడా గురువారం 5 నుంచి 25 బేసిస్‌ పాయింట్ల శ్రేణిలో పెంచింది. తాజా పెంపు నేపథ్యంలో ఐదేళ్ల డిపాజిట్లపై సీనియర్‌ సిటిజన్లు 8.5 శాతం వడ్డీరేటు పొందుతారు. ఏడాది నుంచి రెండేళ్లలోపు డిపాజిట్లపై 6.8 శాతం వడ్డీ లభిస్తుంది. రెండేళ్ల నుంచి మూడేళ్ల మధ్య రేటు పావుశాతం పెరిగి 7 శాతానికి చేరింది. మూడేళ్ల పైబడిన డిపాజిట్లపై రేటు కూడా పావుశాతం పెరిగి 6.5 శాతానికి చేరింది.

(ఇదీ చదవండి: ఎఫ్‌డీ కస్టమర్లకు ఎస్‌బీఐ గుడ్‌ న్యూస్‌! వడ్డీ రేట్లు పెంపు..)

మరిన్ని వార్తలు