టాప్‌గేర్‌లో ద్విచక్ర వాహన విక్రయాలు

5 Apr, 2021 00:04 IST|Sakshi

మార్చిలో మొత్తం అమ్మకాలు 5.77 లక్షలు 

కలిసొచ్చినలో బేస్‌ అంశం 

ముంబై: గత ఆర్థిక సంవత్సరం(2020–21)చివరి నెల మార్చిలో మోటార్‌ సైకిల్, స్కూటర్‌ విక్రయాలు జోరుగా కొనసాగాయి. అంతకు ముందు ఆర్థిక సంవత్సరం(2019–20) ఇదే మార్చిలో కరోనా ప్రేరేపిత లాక్‌డౌన్‌తో విక్రయాలు గణనీయంగా పడిపోవడం(లో బేస్‌) 2021 మార్చిలో అమ్మకాల వృద్ధికి కలిసొచ్చింది. సమీక్షించిన మార్చి నెలలో హీరోమోటోకార్ప్, హోండా మోటార్‌ సైకిల్, బజాజ్‌ ఆటో, టీవీఎస్‌ మోటార్స్, రాయల్స్‌ ఎన్‌ఫీల్డ్‌ కంపెనీలు మొత్తం 14, 21,600 వాహనాలు విక్రయించాయి. 2019–20 ఆర్థిక సంవత్సరం మార్చిలో విక్రయించిన మొత్తం 8,08,692 యూనిట్లతో పోలిస్తే ఇది 75% శాతం అధికం.

టూ–వీలర్స్‌ మార్కెట్‌ దిగ్గజం హీరో మోటోకార్ప్‌ మార్చిలో మొత్తం 5.77 లక్షల వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే నెలలో అమ్మిన 3.35 లక్షల యూనిట్లతో పోలిస్తే ఇది 72 శాతం అధికం. హోండా మోటార్‌ సైకిల్‌ ఇండియా అమ్మకాలు 60.76 శాతం వృద్ధిని కనబరిచి 3.95 లక్షల వాహనాలను అమ్మింది. ‘‘వ్యక్తిగత రవాణాకు ప్రాధాన్యత పెరగడంతో ద్వి చక్ర వాహనాలకు డిమాండ్‌ పెరిగింది. అయితే విద్యా సంస్థల మూసివేత, ఇంటి వద్ద నుంచే పని తదితర అంశాలు విక్రయాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి’’ అని ఆటో పరిశ్రమకు చెందిన ఒక నిపుణుడు తెలిపారు.

మరిన్ని వార్తలు