వారికి భారీ ఊరట: రెండేళ్లలో కోటి ఉద్యోగాలు

1 Dec, 2022 09:10 IST|Sakshi
కేంద్ర మంత్రి అశ్వని వైష్ణవ్‌ (ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ: డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలో భాగమైన ఎలక్ట్రానిక్స్, స్టార్టప్‌లు, ఐటీ-ఐటీ ఆధారిత సర్వీసుల రంగాల్లో వచ్చే రెండేళ్ల కాలంలో కోటి ఉద్యోగాల కల్పన మైలురాయిని సాధించాలన్న లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు టెలికం మంత్రి అశ్వని వైష్ణవ్‌ తెలిపారు. ఈఎస్‌సీ-ఎస్‌టీపీఐ కార్యక్రమం సందర్భంగా ఆయన మాట్లాడారు. డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థలో ఎలక్ట్రానిక్స్‌ తయారీ, ఐటీ-ఐటీఈఎస్, స్టార్టప్‌లు మూడు ముఖ్య స్తంభాలుగా అభివర్ణించారు. ఈ రంగాలు ఇప్పటికే 88-90 లక్షల మందికి కొత్తగా ఉపాధి కల్పించి నట్టు మంత్రి చెప్పారు. (జొమాటోకు అలీబాబా ఝలక్‌, భారీగా షేర్ల అమ్మకం)

వచ్చే రెండేళ్లలో ఇది సులభంగానే కోటి దాటుతుందన్నారు. ‘‘లోగడ స్టార్టప్‌లకు సంబంధించి కొన్ని పట్టణాల పేర్లే వినిపించేవి. కానీ, ఇప్పుడు గ్రామాల్లో పాఠశాలలను సందర్శించినప్పుడు అక్కడి పిల్లలు స్థానికంగానే స్టార్టప్‌లను ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్టు చెబుతున్నారు’’అని మంత్రి వెల్లడించారు. భారత్‌ టెక్నాలజీ వినియోగదారు నుంచి టెక్నాలజీ ఉత్పత్తిదారుగా మారినట్టు చెప్పారు. (జోరుగా ప్యాసింజర్‌ వాహన విక్రయాలు, టాప్‌లో ఆ రెండు)

స్టార్టప్‌లను ఏర్పాటు చేసుకునేందుకు సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీపీఐ) ప్లగ్‌ అండ్‌ ప్లే (వచ్చి వెంటనే పనిచేసుకునే ఏర్పాట్లు) సదుపాయాలను కల్పిస్తున్నట్టు మంత్రి వైష్ణవ్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా 64 పట్టణాల్లో స్టార్టప్‌ల కోసం ప్లగ్‌ అండ్‌ ప్లే సదుపాయాలను ఆఫర్‌ చేస్తున్నట్టు ఎస్‌టీపీఐ డైరెక్టర్‌ జనరల్‌ అరవింద్‌ కుమార్‌ ఇదే కార్యక్రమంలో తెలిపారు. ఇందులో 53 కేంద్రాలు టైర్‌ 2, 3 పట్టణాల్లో ఉన్నట్టు చెప్పారు. రూ.5-10 లక్షల సీడ్‌ ఫండింగ్‌ కూడా సమకూరుస్తున్నట్టు తెలిపారు.  ఇవీ చదవండి:  వినియోగదారులకు శుభవార్త:  దిగిరానున్న వంట గ్యాస్‌ ధర

శాంసంగ్‌ గుడ్‌ న్యూస్‌: భారీ ఉద్యోగాలు

మరిన్ని వార్తలు