టైర్ల తయారీ కంపెనీల షేర్లు జూమ్

28 Sep, 2020 14:44 IST|Sakshi

8-3 శాతం మధ్య పలు కౌంటర్ల దూకుడు

జాబితాలో బాలకృష్ణ ఇండస్ట్రీస్‌, ఎంఆర్‌ఎఫ్‌

సియట్‌, జేకే టైర్స్‌, గుడ్‌ఇయర్‌, అపోలో టైర్స్‌

సరికొత్త గరిష్టాన్ని అందుకున్న బాలకృష్ణ ఇండస్ట్రీస్‌

వరుసగా రెండో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు బుల్‌ జోరులో సాగుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 560 పాయింట్లు జంప్‌చేసి 37,948 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 171 పాయింట్లు ఎగసి 11,221 వద్ద కదులుతోంది. ఈ నేపథ్యంలో టైర్ల తయారీ కంపెనీ కౌంటర్లకు ఉన్నట్టుండి డిమాండ్‌ పెరిగింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూ కట్టడంతో పలు కౌంటర్లు 8-3 శాతం మధ్య ఎగశాయి. ఆఫ్‌రోడ్‌ టైర్ల తయారీ దిగ్గజం బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ షేరు చరిత్రాత్మక గరిష్టాన్ని అందుకుంది. ఇతర వివరాలు ఇలా..

కారణాలున్నాయ్‌
ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ షేరు 7.6 శాతం జంప్‌చేసి రూ. 1,459 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో 9 శాతంపైగా దూసుకెళ్లి రూ. 1,484కు చేరువైంది. ఇది సరికొత్త గరిష్టంకాగా.. బాలకృష్ణ ఇండస్ట్రీస్‌ వ్యవసాయం, నిర్మాణ రంగం, మైనింగ్‌, అటవీ పరిరక్షణ తదితర రంగాలలో వినియోగించే వాహనాలకు టైర్లను తయారు చేసే విషయం విదితమే. వెరసి ఆర్థిక రికవరీ నేపథ్యంలో కంపెనీ టైర్లకు డిమాండ్‌ పెరగనున్నట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రానున్న పండుగల సీజన్‌ నుంచీ వాహనాలకు తిరిగి డిమాండ్‌ పుట్టవచ్చన్న ఆశలతో టైర్ల తయారీ కంపెనీల షేర్లపై ఇన్వెస్టర్లు తాజాగా దృష్టి సారించినట్లు నిపుణులు చెబుతున్నారు.

జోరు తీరిలా
ఎన్‌ఎస్‌ఈలో టైర్ల తయారీ కంపెనీల కౌంటర్లలో ప్రస్తుతం అపోలో టైర్స్‌ 6.3 శాతం పెరిగి రూ. 128 వద్ద ట్రేడవుతోంది. ఈ బాటలో సియట్‌ లిమిటెడ్‌ 4.2 శాతం లాభపడి రూ. 943 వద్ద కదులుతోంది. తొలుత రూ. 952 వరకూ ఎగసింది. ఇతర కౌంటర్లలో జేకే టైర్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ 4.2 శాతం బలపడి రూ. 60 వద్ద, ఎంఆర్‌ఎఫ్‌ 3 శాతం పుంజుకుని రూ. 59,096 వద్ద ట్రేడవుతున్నాయి. ఇంట్రాడేలో ఎంఆర్‌ఎఫ్‌ రూ. 59,250 వద్ద గరిష్టాన్ని తాకింది. ఇక బీఎస్‌ఈలో గుడ్‌ఇయర్‌ ఇండియా షేరు సైతం దాదాపు 4 శాతం పురోగమించి రూ. 875 వద్ద ట్రేడవుతోంది. తొలుత రూ. 880 వరకూ పెరిగింది. 

మరిన్ని వార్తలు