ఎండాకాలం క్యాబుల్లో తిరిగేవారికి మండిపోయేలా..న్యూస్‌ చెప్పిన క్యాబ్‌ కంపెనీలు!

2 Apr, 2022 07:46 IST|Sakshi

ఎండాకాలం క్యాబుల్లో తిరిగేవారికి మండిపోయేలా షాకిస్తున్నాయి ఆయా క్యాబ్‌ కంపెనీలు. సమ్మర్‌ సీజన్‌లో క్యాబ్‌లో ప్రయాణిస్తే వేడిమి నుంచి కాస్త ఉపశమనం పొందేందుకు ఏసీని ఉపయోగిస్తుంటాం. కానీ ఇకపై క్యాబ్‌లో తిరిగే ప్రయాణికులు ఏసీ వినియోగించుకుంటే అదనపు ఛార్జీలు వసూలు చేసేందుకు క్యాబ్‌ డ్రైవర్లు సిద్ధమయ్యారంటూ పలు వార్త కథనాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుతం ఈ అంశం ప్రయాణికుల్ని ఆందోళన కలిగిస్తుండగా..తాజాగా యాప్‌ ఆధారిత ట్యాక్సీ సేవలు అందిస్తున్న ఉబర్‌ తాజాగా ట్రిప్‌ ఛార్జీలను 15 శాతం పెంచుతున్నట్లు ప్రకటించింది.

వరుసగా రెండో ఏడాది ఉబర్‌ క్యాబ్‌ ఛార్జీలను పెంచింది. గతేడాది ఉబర్‌ ఏప్రిల్‌ నెలలో 15శాతం ఛార్జీలను పెంచింది. ఈ ఏడాది తాజాగా దేశంలో రోజురోజుకీ పెరిగిపోతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరల కారణంగా ఉబర్‌ క్యాబ్‌ ఛార్జీలను పెంచుతున్నట్లు ఉబర్‌ ఇండియా సౌత్‌ ఏసియా సెంట్రల్‌ ఆపరేషన్‌ హెడ్‌ నితీష్‌ భూషణ్‌ తెలిపారు. ‘ఇంధన ధరలలో ప్రస్తుత పెరుగుదల డ్రైవర్లను ఆందోళన కలిగిస్తోంది. వారి నుంచి వచ్చిన విన్నపం మేరకు ట్రిప్‌ ఛార్జీలను 15% పెంచుతున్నాం. రాబోయే వారాల్లో ఇంధన ధరల కదలికలను పరిశీలిస్తామని చెప్పారు. కాగా ఉబర్‌ సంస్థ  హైదరాబాద్, ముంబై సహా పలు నగరాల్లో చార్జీలను సవరించింది.అవసరమైన విధంగా తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని ఉబర్‌ ఇండియా, సౌత్‌ ఆసియా సెంట్రల్‌ ఆపరేషన్స్‌ హెడ్‌ నితీశ్‌ భూషన్‌ తెలిపారు.

ఏసీ ఆన్‌ చేశారా? ఇక బాదుడే
జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఏప్రిల్‌ 1 నుంచి ఆయా క్యాబ్‌ సంస్థలకు చెందిన క్యాబుల్లో జర్నీ చేసే ప్రయాణికులు ఏసీ ఉపయోగిస్తే అదనంగా చెల్లించాల్సి ఉంటున్నట్లు తెలుస్తోంది.

అందుకు ఊతం ఇచ్చేలా పలు క్యాబుల్లో ఏసీ ఆన్‌ చేస్తే ఎంత చెల్లించాలో తెలుపుతూ పలు బోర్డ్‌లు దర్శనమిస్తున్నాయి. ఏసీలను ఆన్‌ చేసినందుకుగాను రూ. 50 నుంచి రూ. 100 మేర అదనపు ఛార్జీలను వసూలు చేస్తామంటూ క్యాబ్‌ సంస్థల డ్రైవర్లు స్టికర్లను అతికించారు.

చదవండి: క్యాబ్స్‌లో ఏసీ ఆన్‌ చేస్తే వాతే..! డ్రైవర్ల నిర్ణయం..!

మరిన్ని వార్తలు