Uber Technologies: 'మా వాటా మేం అమ్మేస్తున్నాం'..జొమాటోకు మరో షాక్‌!

3 Aug, 2022 15:07 IST|Sakshi

ప్రముఖ రైడ్‌ షేరింగ్‌ సంస్థ ఉబర్‌..దేశీయ ఫుడ్‌ ఆగ్రిగ్రేటర్‌ జొమాటోకు భారీ షాకిచ్చింది. ఆ సంస్థలో ఉన్న 7.8శాతం స్టేక్‌ను అమ్మేందుకు ఉబర్‌ సిద్ధమైంది. 7.8 శాతం వాటాల అమ్మకంతో ఉబర్‌కు రూ.3,305 కోట్ల వస్తాయని అంచనా వేస్తుంది. తక్కువలో తక్కువ డీల్ పరిమాణం రూ.2,938.6 కోట్లు ఉండనుంది. 

భారత్‌లో ఉబర్‌ తన ఫుడ్ డెలివరీ విభాగమైన ఉబెర్ ఈట్స్‌ను జొమాటోకు అమ్మేసింది. ఆ సమయంలో ఉబర్‌..జొమాటోలో వాటాను కొనుగోలు చేసింది. ఆ సమయంలో స్టాక్ లావాదేవీ డీల్ విలువ రూ.1,376 కోట్లుగా ఉంది. ఇప్పుడు ఆ స్టేక్‌ను ఉబర్‌ అమ్మేయడంతో ఉబర్‌కు కనీసం 2.5శాతం లాభం పొందవచ్చని భావిస్తోంది.  

పోటీ పడుతున్న అమెరికన్‌ కంపెనీలు 
జొమాటోలో ఉన్న తన వాటాను ఆగస్ట్‌ 5కి క్లోజ్‌ చేయాలని ఉబర్‌ భావిస్తుంది. ఈ తరుణంలో జొమాటోలోని తన షేర్లను ఉబర్‌ ఎవరికి అమ్మేస్తుందని అంశంపై టర్మ్ షీట్లో వెల్లడించలేదు. అయినప్పటికీ ఉబర్ అమ్మే 7.8% వాటాను కొనుగోలు చేసేందుకు అమెరికాకు చెందిన అనేక మంది సంస్థాగత పెట్టుబడిదారులు పోటీ పడుతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి.  

వెయ్యి కోట్లు లాస్‌ 
జొమాటో ప్రీ-ఐపీవో వాటాదారులకు ఒక సంవత్సరం లాక్ ఇన్ పీరియడ్ జులై 23న ముగిసింది. లాక్‌ ఇన్‌ పీరియడ్‌ ముగిసిన వారం తర్వాత ఉబర్‌ తన జొమాటోలోని తన వాటాల్ని అమ్మేందుకు సిద్ధమైనట్లు మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు లాక్‌ ఇన్‌ పీరియడ్‌ ముగిసిన తర్వాత మార్కెట్‌ ప్రారంభమైన జులై 25 ఒక్కరోజే జొమాటో సుమారు వెయ్యి కోట్లు నష్టపోయిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు