8.9% కాదు... 9.5%

18 Nov, 2021 06:25 IST|Sakshi

భారత్‌ వృద్ధి రేటును పెంచిన యూబీఎస్‌ సెక్యూరిటీస్‌

ఊహించినదానికన్నా వేగవంతమైన ఆర్థిక రికవరీ

ముంబై: భారత్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాను స్విస్‌ బ్రోకరేజ్‌ సంస్థ–  యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ 9.5 శాతానికి పెంచింది. ఇప్పటి వరకూ ఈ అంచనా 8.9 శాతం. ఆర్థిక రికవరీ ఊహించినదానికన్నా వేగంగా రికవరీ అవుతుండడం, పెరిగిన వినియోగ విశ్వాసం, వ్యయాల పెరుగుదల వంటి అంశాలు తమ అంచనాల పెంపునకు కారణమని వివరించింది.

2022–23, 2023–24 ఆర్థిక సంవత్సరాల్లో వృద్ధి రేటు వరుసగా 7.7 శాతం, 6 శాతంగా నమోదవుతుందన్నది అంచనాగా తెలిపింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) 2021–22 జీడీపీ వృద్ధి రేటుకు సమానంగా తాజాగా యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ తన అంచనాలను పెంచడం గమనార్హం. ప్రభుత్వం 10 శాతం అంచనావేస్తోంది.  వివిధ రేటింగ్, విశ్లేషణా సంస్థల అంచనా శ్రేణి 8.5 శాతం నుంచి 10 శాతం వరకూ ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (ఏప్రిల్‌–జూన్‌) జీడీపీ వృద్ధి రేటు 20.1 శాతం.  

వడ్డీరేట్లు పెరిగే అవకాశం!
రానున్న 2022–23 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి తక్కువ వడ్డీరేటు ప్రయోజనాలకు ముగింపు పలికే అవకాశం ఉందని అభిప్రాయపడింది. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి ఆరు నెలల కాలంలో ఆర్‌బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపో (ప్రస్తుతం 4 శాతం)ను అరశాతం పెంచే అవకాశం ఉందని కూడా యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ అంచనావేసింది. 2021–22లో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం 5.4 శాతం ఉంటుందన్న ఇంతక్రితం అంచనాలను 4.8 శాతానికి తగ్గిస్తున్నట్లు బ్రోకరేజ్‌ సంస్థ పేర్కొంది. ఇక ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు 2021–22లో 10.1 శాతంగా, 2022–23లో 8.8 శాతంగా నమోదవుతుందని తమ అంచనా అని యూబీఎస్‌ సెక్యూరిటీస్‌ తెలిపింది.

ఇదిలాఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 10 శాతం నమోదవుతుందన్న విశ్వాసాన్ని ప్రధానమంత్రికి ఆర్థిక సలహా మండలి చైర్మన్‌ వివేక్‌ దేవ్రాయ్‌ వ్యక్తం చేశారు. ఎస్‌బీఐ నిర్వహించిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ విషయాన్ని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు