ఆధార్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం.. ఇకపై భారీ జరిమానా!

3 Nov, 2021 14:57 IST|Sakshi

న్యూఢిల్లీ: ఆధార్ చట్టం విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) చేతికి కేంద్రం బ్రహ్మాస్త్రాన్ని అందించింది. ఆధార్ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడానికి న్యాయనిర్ణేత అధికారులను నియమించుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఈ ఆధార్ చట్టం ఆమోదించిన దాదాపు రెండు సంవత్సరాల తర్వాత కోటి రూపాయల జరిమానా విధించడానికి యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ)కు వీలు కల్పించే విధంగా నిబంధనలను ప్రభుత్వం నోటిఫై చేసింది.

కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నియమనిబంధనల ప్రకారం.. యూఐడీఏఐ ఆధార్ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవడానికి న్యాయనిర్ణేత అధికారులను నియమించుకోవచ్చు. న్యాయనిర్ణేత అధికారులకు ఆధార్ చట్టాన్ని ఉల్లంఘించే సంస్థలు/వ్యక్తులపై విచారణ జరిపి రూ.1 కోటి వరకు జరిమానా విధించే అవకాశాన్ని కల్పించింది. న్యాయనిర్ణేత అధికారులు ఇచ్చిన తీర్పుపై ఏదైనా అభ్యంతరాలు ఉంటే సదరు సంస్థలు టెలికాం వివాదాల పరిష్కారం, అప్పీలేట్ ట్రిబ్యునల్‌ను కూడా ఆశ్రయించవచ్చు. ఈ నిబంధనలను తీసుకొనిరావడానికి కేంద్ర ప్రభుత్వం ఆధార్, ఇతర శాసనాల (సవరణ) బిల్లు, 2019కి ఆమోదముద్ర వేసింది. దీంతో ఈ చట్టాలను అమలు చేయడానికి, అవసరమైన చర్యలు తీసుకోవడానికి రెగ్యులేటర్‌తో సమానమైన అధికారాలు లభించాయి. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల యూజర్ల డేటకు మరింత రక్షణ లభిస్తుంది.

(చదవండి: డేంజరస్‌ సేల్స్‌.. ఆర్జీవీనా మజాకా ! మూవీ బిజినెస్‌లో మరో యాంగిల్‌)

 

మరిన్ని వార్తలు