తెలంగాణలో ఉజ్జీవన్‌ బ్యాంక్‌

10 Jan, 2023 01:50 IST|Sakshi
ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ ఎండీ, సీఈవో ఇతిరా డేవిస్‌

అయిదు శాఖల ఏర్పాటు;

వచ్చే ఏడాది ఏపీలోకి విస్తరణ

బ్యాంక్‌ సీఈవో డేవిస్‌ వెల్లడి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ తాజాగా తెలంగాణకు కార్యకలాపాలు విస్తరిస్తోంది. తొలుత అయిదు శాఖలను ప్రారంభించనుంది. వీటిలో నాలుగు వచ్చే వారంలోనూ, మరొకటి వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు బ్యాంక్‌ ఎండీ, సీఈవో ఇతిరా డేవిస్‌ సోమవారమిక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు.

వచ్చే ఏడాది వీటి సంఖ్యను రెట్టింపు చేసుకోనున్నట్లు, అలాగే తమ టాప్‌ 10 మార్కెట్లలో తెలంగాణ కూడా ఒకటిగా నిలవగలదని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. అటు వచ్చే ఏడాది ఆంధ్రప్రదేశ్‌లోకి కూడా కార్యకలాపాలు విస్తరించనున్నట్లు డేవిస్‌ తెలిపారు. ప్రస్తుతం 71 లక్షలకు పైగా కస్టమర్లకు సర్వీసులు అందిస్తున్నామని,  కొత్త వాటితో కలిపి ప్రస్తుతం తమకు దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కలిపి 598 శాఖలు ఉంటాయని వివరించారు.  

పసిడి, ట్రాక్టర్‌ లోన్స్‌పై దృష్టి..
బంగారం రుణాలు, ద్విచక్ర వాహనాల రుణాలు, ట్రాక్టర్‌ లోన్స్‌పైనా దృష్టి పెడుతున్నట్లు డేవిస్‌ చెప్పారు. ప్రస్తుతం తమ పోర్ట్‌ఫోలియోలో సూక్ష్మ రుణాల విభాగం 71 శాతంగా ఉండగా మిగతాది అఫోర్డబుల్‌ హౌసింగ్‌ మొదలైన విభాగాల్లో ఉంటోందని పేర్కొన్నారు. వచ్చే అయిదేళ్లలో సూక్ష్మ రుణాల పోర్ట్‌ఫోలియోను 50 శాతానికి తగ్గించుకోవడం ద్వారా సెక్యూర్డ్, అన్‌సెక్యూర్డ్‌ రుణాల మధ్య సమతౌల్యం సాధించాలని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది ఆఖరు నాటికి శాఖల సంఖ్యను 625కి పెంచుకోనున్నామని డేవిస్‌ చెప్పారు. తెలంగాణ శాఖల్లో తొలుత 30 మంది వరకు సిబ్బంది ఉంటారు. మరోవైపు, మాతృ సంస్థను విలీనం చేసుకునే రివర్స్‌ మెర్జర్‌ ప్రక్రియ జూన్‌–సెప్టెంబర్‌ మధ్యలో పూర్తి కావచ్చని భావిస్తున్నట్లు వివరించారు.

మరిన్ని వార్తలు