గుడ్‌న్యూస్‌; వచ్చే వారమే కరోనా వ్యాక్సిన్‌

2 Dec, 2020 13:21 IST|Sakshi

తాజాగా అనుమతించిన యూకే ప్రభుత్వం

ఎంహెచ్‌ఆర్‌ఏ సలహాలమేరకు గ్రీన్‌సిగ్నల్‌

వచ్చే వారం నుంచీ యూకేలో ఫైజర్‌ వ్యాక్సిన్‌ అందుబాటులోకి

వ్యాక్సిన్‌ను అనుమతించిన తొలి ప్రభుత్వం యూకే

కోవిడ్‌-19 కట్టడికి వ్యాక్సిన్‌ను అందించిన తొలి కంపెనీ ఫైజర్‌

లండన్‌: కోవిడ్‌-19 కట్టడికి వచ్చే వారం నుంచీ వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకు తాజాగా యూకే ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. మెసెంజర్‌ ఆర్‌ఎన్‌ఈ సాంకేతితతో ఫార్మా దిగ్గజం ఫైజర్‌ ఇంక్‌ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు ఎంహెచ్‌ఆర్‌ఏ మద్దతివ్వడంతో యూకే ప్రభుత్వం తాజా నిర్ణయాన్ని తీసుకుంది. జర్మన్‌ కంపెనీ బయోఎన్‌టెక్‌తో రూపొందించిన వ్యాక్సిన్‌ ఎమర్జెన్సీ వినియోగానికి అనుమతించమంటూ ఇటీవల యూఎస్‌ఎఫ్‌డీఏ, యూరోపియన్‌ ఔషధ నియంత్రణ సంస్థలకు ఫైజర్‌ దరఖాస్తు చేసింది. ఫైజర్‌ వ్యాక్సిన్‌ వినియోగానికి ఔషధాలు, ఆరోగ్య ఉత్పత్తుల స్వతంత్ర నియంత్రణ సంస్థ(ఎంహెచ్‌ఆర్‌ఏ) ఓకే చెప్పడంతో యూకే ప్రభుత్వం వెనువెంటనే అమల్లోకి వచ్చే విధంగా ఆదేశాలు జారీ చేసింది, దీంతో వచ్చే వారం నుంచి యూకేలో వ్యాక్సిన్‌ అందుబాటులోకి రానుంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా తొలిసారి వ్యాక్సిన్‌ అధికారిక వినియోగానికి అనుమతించిన దేశంగా యూకే నిలవనుంది. ఇదేవిధంగా కరోనా వైరస్‌ కట్టడికి వ్యాక్సిన్‌ను అందించిన తొలి కంపెనీలుగా ఫైజర్‌, బయోఎన్‌టెక్‌ ఆవిర్భవించనున్నాయి.  

చరిత్రాత్మకం
అత్యవసర ప్రాతిపదికన తమ వ్యాక్సిన్‌ వినియోగానికి యూకే ప్రభుత్వం అనుమతించడం కంపెనీ చరిత్రలో చరిత్రాత్మక ఘట్టమని ఫైజర్‌ సీఈవో ఆర్బర్ట్‌ బోర్లా ఈ సందర్భంగా పేర్కొన్నారు. కోవిడ్‌-19పై సైన్స్‌ విజయం సాధిస్తుందంటూ ప్రకటించాక తాము లక్ష్యాన్ని చేరుకునేందుకు నిరంతరం శ్రమిస్తూనే ఉన్నామని తెలియజేశారు. యూకే ప్రభుత్వ బాటలో ప్రపంచంలోని ఇతర దేశాలకూ అత్యంత నాణ్యమైన వ్యాక్సిన్లను సరఫరా చేయాలని చూస్తున్నట్లు చెప్పారు.

షేరు జూమ్
కరోనా వైరస్‌ కట్టడికి మాతృ సంస్థ ఫైజర్‌ ఇంక్‌ రూపొందించిన వ్యాక్సిన్‌ వినియోగానికి తాజాగా యూకే ప్రభుత్వం ఓకే చెప్పడంతో దేశీయంగా ఫైజర్‌ లిమిటెడ్‌ కౌంటర్‌కు డిమాండ్‌ పుట్టింది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో తొలుత ఎన్‌ఎస్‌ఈలో ఫైజర్‌ షేరు 7.3 శాతం జంప్‌చేసింది. రూ. 5,385ను తాకింది. ప్రస్తుతం 4 శాతం లాభంతో రూ. 5,310 వద్ద ట్రేడవుతోంది. బయోఎన్‌టెక్‌తో కలసి ఫైజర్‌ ఇంక్‌ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌పై అంచనాలతో ఇటీవల ఫైజర్ షేరు ర్యాలీ బాటలో సాగుతోంది. వెరసి ఈ నవంబర్‌ 10న రూ. 5,900 వద్ద 52 వారాల గరిష్టాన్ని తాకింది. 

.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు