బ్రిటన్‌లో భారత సంస్థల హవా

23 Apr, 2021 01:36 IST|Sakshi

కరోనా పరిస్థితుల్లోనూ కార్యకలాపాల విస్తరణ

భారీగా ఉద్యోగాల కల్పన

‘ఇండియా మీట్స్‌ బ్రిటన్‌ ట్రాకర్‌’ నివేదిక

లండన్‌: బ్రెగ్జిట్, కరోనా వైరస్‌ విజృంభణ వంటి ప్రతికూల పరిస్థితుల్లోనూ యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న భారతీయ కంపెనీల సంఖ్య గణనీయంగా పెరిగింది. అలాగే ఆయా సంస్థలు కల్పిస్తున్న ఉద్యోగావకాశాలు కూడా భారీగా పెరిగాయి. ‘ఇండియా మీట్స్‌ బ్రిటన్‌ ట్రాకర్‌’ నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. కన్సల్టెన్సీ సంస్థ గ్రాంట్‌ థార్న్‌టన్, భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) దీన్ని రూపొందించాయి.

బ్రిటన్‌ ఎకానమీ వృద్ధిలో భారత సంస్థల పాత్రను మదింపు చేసేందుకు ఉద్దేశించిన ఈ నివేదిక ప్రకారం 2020లో బ్రిటన్‌లో 842 భారతీయ సంస్థలు ఉండగా 2021లో ఇది 850కి చేరింది. అలాగే, వీటిలో ఉద్యోగాలు చేస్తున్న వారి సంఖ్య 1,10,793 నుంచి 1,16,046కి పెరిగింది. ఈ కంపెనీల మొత్తం  టర్నోవరు 41.2 బిలియన్‌ పౌండ్ల నుంచి 50.8 బిలియన్‌ పౌండ్లకు చేరింది. ఇక గతేడాది బోర్డులో కనీసం ఒక్క మహిళా డైరెక్టరయినా ఉన్న సంస్థలు 20 శాతంగా ఉండగా తాజాగా ఇది 47 శాతానికి పెరిగింది.
 
భారతీయ ‘ఇన్వెస్టర్లకు బ్రిటన్‌ ఆకర్షణీయమైన కేంద్రంగా కొనసాగుతోందనడానికి ఇది నిదర్శనం. ఈ సంస్థలు ఇటు ఉద్యోగాలు కల్పించడంతో పాటు బోర్డు స్థాయిలో మహిళలకు కూడా ప్రాధాన్యం కల్పిస్తుండటం హర్షణీయం’ అని వర్చువల్‌గా నివేదికను విడుదల చేసిన సందర్భంగా బ్రిటన్‌ పెట్టుబడుల శాఖ మంత్రి లార్డ్‌ గెరీ గ్రిమ్‌స్టోన్‌ పేర్కొన్నారు. కరోనా పరిస్థితుల్లోనూ ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడుల కార్యకలాపాలు సానుకూలంగానే కొనసాగడం స్వాగతించతగ్గ పరిణామం అని బ్రిటన్‌లో భారత హై కమిషనర్‌ గెయిట్రీ ఇసార్‌ కుమార్‌ తెలిపారు.  

లెక్క ఇలా..  
బ్రిటన్‌లో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారతీయ సంస్థలను ఈ నివేదిక ట్రాక్‌ చేస్తుంది. 5 మిలియన్‌ పౌండ్ల పైగా టర్నోవరు, వార్షికంగా కనీసం 10 శాతం వృద్ధి రేటు, కనీసం రెండేళ్ల పాటు బ్రిటన్‌లో కార్యకలాపాలు ఉన్న సంస్థలను ఇది పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ ఏడాది 49 కంపెనీలు ఈ ప్రమాణాలకు అనుగుణంగా నిల్చాయి. సగటున 40 శాతం ఆదాయ వృద్ధి రేటు కనపర్చాయి. ఈ ట్రాకర్‌ ప్రారంభించినప్పట్నుంచీ గత ఎనిమిదేళ్లుగా లిస్టులో టెక్నాలజీ, టెలికం సంస్థల సంఖ్య భారీగా ఉంటోంది. ఈ ఏడాది ఫార్మా, కెమికల్స్‌ కంపెనీల సంఖ్య 15 శాతం నుంచి 27 శాతానికి పెరిగింది. బ్రిటన్‌ ఎకానమీ వృద్ధిలోను, ఉద్యోగాల కల్పనలోనూ భారతీయ సంస్థలు కూడా కీలకపాత్ర పోషిస్తున్నాయనడానికి ఈ గణాంకాలు నిదర్శనమని సీఐఐ డైరెక్టర్‌ జనరల్‌ చంద్రజిత్‌ బెనర్జీ తెలిపారు.  

మరిన్ని వార్తలు