మరోసారి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎలాన్ మస్క్..!

1 Mar, 2022 20:48 IST|Sakshi

ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. కొన్ని రోజుల క్రితం ఉక్రెయిన్‌పై రష్యా దాడికి తిగిన తర్వాత ఆ దేశంలో ఇంటర్నెట్ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో స్టార్‌లింక్‌ సేవలను అందించాలని ఆదేశ ఉపాధ్యక్షుడు మస్క్'ను అభ్యర్థించారు. ఉక్రెయిన్‌లో స్టార్ లింక్ సేవలు అందుబాటులోకి తెస్తానని రెండు రోజుల క్రితం మాటిచ్చిన మస్క్.. తాజాగా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.

రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్‌లో దెబ్బతిన్న ఇంటర్నెట్ సేవలను తిరిగి పునరుద్దరించడం కోసం స్టార్ లింక్ పరికరాలను(టర్మినల్స్)‌ను పంపిస్తున్నట్లు మస్క్ పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని పరికరాలను స్పేస్ ఎక్స్ సంస్థ ఉక్రెయిన్‌కు చేరవేసింది. స్టార్ లింక్ పరికరాలు ఉక్రెయిన్‌కు చేరిన విషయాన్ని ఆదేశ ఉపాధ్యక్షుడు నేడు ధృవీకరించారు. టర్మినల్స్‌తో ఉన్న ఓ ట్రక్కు ఫొటోను ఆయన ట్విటర్‌లో షేర్ చేస్తూ ‘‘స్టార్ లింక్ వచ్చేసింది. చాలా ధన్యవాదాలు మస్క్’’ అంటూ ట్వీట్ చేశారు. గతంలో సునామీ కారణంగా ఇటీవల అతలాకుతలమైన టోంగా ద్వీపంలో మస్క్ శాటిలైట్ అంతర్జాల సేవలు అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే.

ఎలన్‌ మస్క్‌ కంపెనీ స్పేస్‌ ఎక్స్‌ స్టార్‌లింక్‌ ప్రాజెక్టులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవలను అందించడానికి స్టార్‌లింక్‌ కృషి చేస్తోంది. ఇప్పటికే 11కు పైగా దేశాలలో స్టార్‌లింక్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. స్టార్‌లింక్‌ ఉపగ్రహాల ఆధారంగా ఇంటర్నెట్'ను మారుమూల ప్రాంతాలకు అందించాలని స్పేస్ ఎక్స్ చూస్తుంది. ఇప్పటివరకు స్పేస్‌ ఎక్స్‌ స్టార్‌లింక్‌ ప్రాజెక్టు కోసం 18 వందలకు పైగా శాటిలైట్లను విజయవంతంగా నిర్ణీత కక్ష్యలోకి పంపించింది.  

(చదవండి: పీఎన్‌బీ ఖాతాదారులకు అలర్ట్.. మరో కొత్త రూల్..!)

మరిన్ని వార్తలు