దయచేసి క్రిప్టోకరెన్సీలు విరాళం ఇవ్వండి: ఉక్రెయిన్‌ పోలీసులు

9 Mar, 2022 19:31 IST|Sakshi

14 రోజులుగా ఉక్రెయిన్‌పై రష‍్యన్‌ బలగాలు విరుచుకుపడుతున్నాయి. ఈ భీకర పోరులో ఇరు దేశాలకు చెందిన సైనికులు వేల సంఖ్యలో మృత్యువాతపడుతున్నారు. బాంబు దాడుల కారణంగా ఇటు ఉక్రెయిన్‌లోని సామాన్య పౌరులు సైతం మరణిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఉక్రేనియన్ ప్రభుత్వం, కమ్ బ్యాక్ అలైవ్ అనే స్వచ్చంద సంస్థలు విరాళాల సేకరణ చేపట్టాయి. కమ్ బ్యాక్ అలైవ్ అనేది ఉక్రేనియన్ ప్రభుత్వేతర ఎన్జిఓ సంస్థ. ఇది క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేకరించిన నగదును రుస్సో-ఉక్రెయిన్‌ యుద్ధంలో పాల్గొన్న ఉక్రెయిన్‌ మిలిటరీ, వాలంటీర్లు & వారి కుటుంబాలకు సహాయం చేస్తుంది. 

ఉక్రెయిన్‌ పోలీసులు కూడా ఇతర దేశాల నుంచి క్రిప్టోకరెన్సీని విరాళాల రూపంలో సేకరిస్తున్నారు. మార్చి 6న ట్విటర్ వేదికగా చేసిన పోస్టులో ఉక్రేనియన్ సైబర్ పోలీసులు తమ పోరాటానికి మద్దతు ఇవ్వడానికి క్రిప్టోకరెన్సీలను విరాళం ఇవ్వాలని ప్రపంచాన్ని కోరారు. వివిధ క్రిప్టోకరెన్సీలు అయిన బిట్ కాయిన్(బీటీసీ), ఈథర్ (ఇటిహెచ్), యుఎస్ డిటి టెటర్(యుఎస్ డిటి), ట్రాన్ (టిఆర్ఎక్స్), పాలిగాన్ (మాటిక్), బినాన్స్ ఎక్స్ఛేంజ్ టోకెన్(బిఎన్ బి)లను విరాళ రూపంలో తీసుకుంటున్నట్లు తెలిపింది. సేకరించిన క్రిప్టోకరెన్సీలను నేషనల్ పోలీస్, నేషనల్ గార్డ్, స్టేట్ బోర్డర్ గార్డ్ సర్వీస్, స్టేట్ ఎమర్జెన్సీ సర్వీస్ కోసం వినియోగిస్తామని ఉక్రెయిన్‌ పోలీసులు పేర్కొన్నారు. 

అలాగే, ఈ నిధులను ఔషధం & ఇతర ఎమర్జెన్సీ అవసరాల కోసం, ఇంకా రష్యా దాడుల బాధితులకు వైద్య సేవలు అందించడానికి వినియోగిస్తామని తెలిపింది. రష్యన్ ఆక్రమణ నుంచి బయటపడటానికి కైవ్ అధికారులు వివిధ మార్గాల్లో ఆర్థిక సహాయం కోరుతున్నారు. ఉక్రెయిన్‌ ప్రభుత్వం ఇప్పటికే క్రిప్టోకరెన్సీని విరాళాల రూపంలో సేకరించడంలో విజయవంతమైంది. ఇప్పటికే బిట్ కాయిన్, ఈథర్, యుఎస్ డీటీ టీథర్, పోల్కాడాట్, డాగీకాయిన్ వంటి ఇతర క్రిప్టోకరెన్సీల రూపంలో $60.5 మిలియన్లను సేకరించింది. ఇంకా ఉక్రెయిన్‌ జెండాను ఎన్‌ఎఫ్‌టీ రూపంలో వేలం వేయడం ద్వారా కూడా $6.5 మిలియన్లను సేకరించింది.

(చదవండి: ఈవీ మార్కెట్లోకి మరో ఎలక్ట్రిక్ మోపెడ్.. కి.మీ.కు 25 పైసలు మాత్రమే!)

మరిన్ని వార్తలు