అల్ట్రాటెక్‌ లాభం 8 శాతం అప్‌

18 Jan, 2022 02:52 IST|Sakshi

క్యూ3లో రూ. 1,710 కోట్లు

మొత్తం ఆదాయం 6 శాతం ప్లస్‌

విస్తరణకు రూ. 965 కోట్లు

న్యూఢిల్లీ: ఆదిత్య బిర్లా గ్రూప్‌ దిగ్గజం అల్ట్రాటెక్‌ సిమెంట్‌ ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో నికర లాభం 8 శాతం ఎగసి రూ. 1,710 కోట్లను అధిగమించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 1,585 కోట్లు ఆర్జించింది. ఆదాయం 6% ఎగసి రూ. 12,985 కోట్లకు చేరింది. గత క్యూ3లో రూ. 12,262 కోట్ల టర్నోవర్‌ ప్రకటించింది. ఈ కాలంలో వ్యయాలు 12% పెరిగి రూ. 11,422 కోట్లను తాకాయి.
 
బిర్లా వైట్‌..: బిర్లా వైట్‌ బ్రాండు వైట్‌ సిమెంట్‌ ఉత్పత్తి సామర్థ్య విస్తరణ, ఆధునీకరణకు రూ. 965 కోట్ల పెట్టుబడులను వెచ్చించనున్నట్లు అల్ట్రాటెక్‌ వెల్లడించింది. తద్వారా ప్రస్తుత 6.5 లక్షల టన్నుల వార్షిక సామర్థ్యాన్ని దశలవారీగా 12.53 ఎల్‌టీపీఏకు చేర్చేందుకు తాజా సమావేశంలో బోర్డు అనుమతించినట్లు పేర్కొంది. 1.2 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యం అందుకోవడంతో భారీ మౌలిక ప్రాజెక్టుల ద్వారా బల్క్‌ సిమెంట్‌ అమ్మకాలను మరింత పెంచుకోగలమని కంపెనీ అభిప్రాయపడింది. ఇక యూపీలో బారా గ్రైండింగ్‌ లైన్‌–2 యూనిట్‌ ప్రారంభంతో సిమెంట్‌ ఉత్పాదక సామ ర్థ్యం 114.55 ఎంటీపీఏను తాకినట్లు తెలిపింది.

రుణ చెల్లింపులు..: 2021 అక్టోబర్‌లో అమ్మకాలు ఊపందుకున్నప్పటికీ ఎన్‌సీఆర్‌లో నిర్మాణాలపై నిషేధం, వర్షాలు, దీపావళి సెలవులు తదితర అంశాలు తదుపరి డిమాండును దెబ్బతీసినట్లు అల్ట్రాటెక్‌ వివరించింది. వెరసి క్యూ3లో కన్సాలిడేటెడ్‌ అమ్మకాలు 3 శాతం నీరసించి 23.13 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులకు పరిమితమయ్యాయి.  క్యూ3లో అంతర్గత వనరుల ద్వారా రూ. 3,459 కోట్ల రుణాలను తిరిగి చెల్లించినట్లు వెల్లడించింది.
ఫలితాల నేపథ్యంలో అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేరు బీఎస్‌ఈలో దాదాపు 3 శాతం ఎగసి రూ. 7,868 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు