Ultraviolette F77: అదిరిపోయిన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్.. ధర ఎంతో తెలుసా?

18 Nov, 2021 21:07 IST|Sakshi

ఇప్పటి వరకు మార్కెట్లోకి వచ్చిన ఎలక్ట్రిక్ కంపెనీలు ఒక లెక్క నేను ఒక లెక్క అంటుంది ఈ ఎలక్ట్రిక్ బైక్ కంపెనీ. ఓలా ఎలక్ట్రిక్, సింపుల్ ఎనర్జీ వంటి కంపెనీలు మార్కెట్లో హీట్ పెంచుతున్నాయి. త్వరలోనే ఈ పోటీలో చేరడానికి అల్ట్రా వయొలెట్ కంపెనీ సిద్దం అవుతుంది. బెంగళూరుకు చెందిన ఈవీ స్టార్టప్ అల్ట్రా వయొలెట్ తన మొదటి బైక్ అల్ట్రా వయొలెట్ ఎఫ్77ను మార్చి 2022 నాటికి భారత ఆటోమొబైల్ మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు భారతదేశంలో అత్యంత వేగవంతమైన ఎలక్ట్రిక్ స్పోర్ట్స్ బైక్ అల్ట్రా వయొలెట్ ఎఫ్77

నారాయణ్ సుబ్రమణ్యం, నిరాజ్ రాజ్ మోహన్ కలిసి ఈ స్పోర్ట్స్ ఎలక్ట్రిక్ బైకును రూపొందించారు. 300-500 సీసీ కేటగిరీలోని పెట్రోల్ మోటార్ సైకిళ్లతో పోలిస్తే ఉత్తమమైన పనితీరు కనబరుస్తుందని వ్యవస్థాపకులు భావిస్తున్నారు. "ఇది ఒక ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్. దీనిని ఇంటర్నల్ కంబస్టివ్ ఇంజిన్(ఐసీఈ) వాహనాలకు పోటీగా తీసుకొని వచ్చాము. పెట్రోల్ మోటార్ సైకిళ్లతో పోలిస్తే అన్నీ కేటగిరీలలో ఉత్తమమైనది" అని రాజ్ మోహన్ చెప్పారు. వీరిద్దరూ తమ పాఠశాల రోజుల నుండి ఒకరినొకరు తెలుసు, మరియు సంవత్సరాలుగా కలిసి అనేక ప్రాజెక్టులపై పనిచేశారు. 2015లో అల్ట్రా వయొలెట్ కంపెనీని స్థాపించారు. టెస్లాను స్ఫూర్తిదాయకంగా తీసుకొని ఈ మార్కెట్లోకి అడుగుపెట్టినట్లు తెలిపారు.

అల్ట్రా వయొలెట్ ఎఫ్77 బైక్ కేవలం 2.9 సెకన్లలో 0 నుంచి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదని ఆటోమేకర్ పేర్కొంది. రాబోయే ఈ ఎలక్ట్రిక్ బైకుని సింగిల్ ఛార్జ్ చేస్తే సుమారు 150 -200 కిలోమీటర్ల రేంజ్ వెళ్లనున్నట్లు తెలిపారు. ఎలక్ట్రిక్ వేహికల్ మేకర్ బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో ఉన్న ప్రొడక్షన్ ఫెసిలిటీలో బైక్ లను తయారు చేయడానికి సిద్ధంగా ఉంది. కంపెనీ మొదటి సంవత్సరంలో సుమారు 15,000 యూనిట్లను తయారు చేయగలదని పేర్కొంది. ఈ బైక్ గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వెళ్లనుంది. ఇది ఓలా ఎస్1 ప్రొ కంటే కనీసం 30 కిలోమీటర్లు ఎక్కువ. 7.5 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీనిలో మూడు బ్యాటరీలు ఉంటాయి. దీనిని ఫాస్ట్ చార్జర్ సహాయంతో 1.5 గంటలు, సాధారణ చార్జర్ సహాయంతో 5 గంటల్లో చార్జ్ చేయవచ్చు. దీని ధర సుమారు రూ.3  లక్షల వరకు ఉంటుందని సమాచారం. 

 

మరిన్ని వార్తలు