బ్యాంకుల్లో నిండుకుంటున్న కరెన్సీ నిల్వలు! సాయం అందినా కోలుకునేందుకు ఏళ్లు పట్టొచ్చు!!

22 Nov, 2021 17:11 IST|Sakshi

తాలిబన్ల ఆక్రమణ, అల్లకల్లోల పరిస్థితులు, బయటి దేశాలతో వర్తక వాణిజ్యాలు నిలిచిపోవడం.. తదితర కారణాలతో అఫ్గనిస్తాన్‌ ఆర్థిక వ్యవస్థ కుదేలుకు లోనైంది. ఈ తరుణంలో  అఫ్గనిస్తాన్‌ పై మరో పిడుగు పడనుంది. ఊహించని స్థాయిలో ఆర్థిక సంక్షోభం అఫ్గన్‌ను ముంచెత్తే అవకాశాలున్నాయంటూ హెచ్చరించింది ఐక్యరాజ్య సమితి. 


యూఎన్‌ డెవలప్‌మెంట్‌ ప్రొగ్రాం(UNDP) సోమవారం మూడు పేజీలతో కూడిన ఒక నివేదికను రిలీజ్‌ చేసింది. బ్యాంకింగ్‌ వ్యవస్థ కుప్పకూలే పరిస్థితులు నెలకొన్నాయని, తద్వారా ఆర్థిక తలెత్తే అవకాశం ఉందని, ఆ ప్రతికూల ప్రభావం సొసైటీపై ఊహించని స్థాయిలో చూపించ్చొచ్చని అభిప్రాయపడింది ఐరాస. కిందటి ఏడాది 7 బిలియన్‌ డాలర్ల విలువైన గూడ్స్‌, ఉత్పత్తులను, సేవలను అందించింది అఫ్గనిస్తాన్‌. ఎలాంటి అవాంతరాలు లేకుండా లావాదేవీలు జరగడానికి కారణం.. అక్కడి బ్యాంకింగ్‌ వ్యవస్థే.

అయితే చాలామంది లోన్లు తిరిగి చెల్లించకపోవడం, తాలిబన్ల ఆక్రమణ తర్వాత నగదు విత్‌డ్రా, అదే సమయంలో డిపాజిట్లు తక్కువగా వస్తుండడం, అవసరాలకు సరిపడా కరెన్సీ నిల‍్వలు లేకపోవడంతో.. కొద్దినెలల్లోపే ఈ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని ఐరాస యూఎన్‌డీపీ నివేదికలో పేర్కొంది.  ఇప్పటికైనా తేరుకుని బ్యాంకింగ్‌ వ్యవస్థను బలపర్చాలని తాలిబన్‌ ప్రభుత్వానికి సూచించింది ఐక్యరాజ్య సమితి. ఇందుకోసం అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలు సైతం సహకరించాలని యూఎన్‌డీపీ అభిప్రాయపడింది.  

మరోవైపు కఠిన ఆంక్షల విధింపు, విదేశీ నిధులు నిలిచిపోవడం, తాలిబన్ల ఆక్రమణ టైంలో వర్తకవాణిజ్యాలు ఆగిపోవడంతో పాటు అఫ్గన్‌కు రావాల్సిన బకాయిలు నిలిచిపోవడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ చాలావరకు దెబ్బతింది. ఈ తరుణంలో బ్యాంకింగ్‌, డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ స్కీమ్‌ వ్యవస్థలు సైతం దెబ్బతింటే గనుక.. ఆదుకోవడానికి ప్రపంచ దేశాలు ముందుకొచ్చినా ఆ సంక్షోభం నుంచి కోలుకోవడానికి దశాబ్దాల సమయం పట్టే అవకాశం ఉండొచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

మరిన్ని వార్తలు