UNCTAD-India's 2022: భారత్‌ను నిండా ముంచేస్తున్న ఉక్రెయిన్‌ రష్యా యుద్ధం! ఐక్యరాజ్యసమితి వార్నింగ్‌!

25 Mar, 2022 09:16 IST|Sakshi

ఐక్యరాజ్యసమితి: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రభావం 2022లో భారత్‌పై తీవ్రంగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి వాణిజ్య, అభివృద్ధి వ్యవహారాల విభాగం (యూఎన్‌సీటీఏడీ) గురువారంనాటి తన తాజా నివేదికలో పేర్కొంది. 

2022పై ఇంతక్రితం 6.7 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను తాజాగా 4.6 శాతానికి (2 శాతానికి పైగా) తగ్గించింది. ఇంధన సరఫరాలపై సమస్యలు, వాణిజ్య ఆంక్షలు, ఆహార ద్రవ్యోల్బణం, కఠిన ద్రవ్య పరపతి విధానాలు, వెరసి ఆర్థిక అనిస్థితిని దేశం ఎదుర్కొనే అవకాశం ఉందని తెలిపింది. ఇక యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ప్రపంచ వృద్ధి రేటు అంచనాను ఒక శాతం అంటే 3.6 శాతం నుంచి 2.6 శాతానికి తగ్గిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. 

ఈ ఏడాది రష్యా తీవ్ర మాంద్యాన్ని చవిచూసే పరిస్థితి ఉండగా, పశ్చిమ ఐరోపా అలాగే మధ్య, దక్షిణ, ఆగ్నేయాసియాలోని కొన్ని ప్రాంతాల్లో వృద్ధిలో గణనీయమైన మందగమనం ఉంటుంది.   

 రష్యా  వృద్ధి 2.3 శాతం నుండి  మైనస్‌ 7.3 శాతానికి క్షీణించింది. 

 దక్షిణ, పశ్చిమ ఆసియాలోని కొన్ని ఇతర ఆర్థిక వ్యవస్థలు ఇంధన ధరల వేగవంతమైన పెరుగుదల నుండి కొన్ని ప్రయోజనాలను పొందవచ్చు. అయితే ఆయా దేశాలు ప్రాథమిక వస్తువుల మార్కెట్లలో ప్రతికూలతలు, ముఖ్యంగా ఆహార ద్రవ్యోల్బణం తత్సబంధ ఫైనాన్షియల్‌ అస్థిరతలు ఎదుర్కొనే వీలుంది.  

► అమెరికా వృద్ధి అంచనా మూడు శాతం నుండి 2.4 శాతానికి,  చైనా వృద్ధి 5.7 శాతం నుంచి 4.8 శాతానికి తగ్గిస్తున్నాం.  

 రష్యా  క్రూడ్,  గ్యాస్‌ను ఎగుమతి చేస్తున్నప్పటికీ దేశంలో ఇతర వస్తువలు అధిక ధరల కారణంగా ఆదాయాల భర్తీలోపురోగతి కనిపించని పరిస్థితి ఉంది. దిగుమతులు లేదా రుణ సేవల కోసం విదేశీ మారక ఆదాయాన్ని ఉపయోగించే పరిస్థితి లేకపోవడం ప్రతికూలాంశం.  

 ఫారెక్స్‌ మార్కెట్లలో రోజువారీ టర్నోవర్‌ 6.6 ట్రిలియన్‌ డాలర్లు. బ్రెజిల్, రష్యా, భారతదేశం, చైనా కరెన్సీలు వాటా 3.5% కంటే ఎక్కువ కాదు. యునైటెడ్‌ స్టేట్స్‌ డాలర్‌ టర్నోవర్‌ ఒక్కటే 44 శాతంగా ఉండడం గమనార్హం.  

► ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న యుద్ధం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల కారణంగా పలు అభివృద్ధి చెందిన దేశాలు ద్రవ్య పరపతి విధానాలను కఠినతరం చేసే వీలుంది. ఆయా అంశాలు బడ్జెట్‌ వ్యయాల కోతలకూ దారితీయవచ్చు.  

 బలహీనపడుతున్న ప్రపంచ డిమాండ్, అంతర్జాతీయ స్థాయిలో తగినంత విధాన సమన్వయం లేకపోవడం, మహమ్మారి వల్ల పెరిగిన రుణాలు వంటి అంశాలు పలు దేశాలకు ఆర్థిక కష్టాలను సృష్టిస్తాయి. ఇది కొన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలను దివాలా, మాంద్యం అగాధాలకు నెట్టవచ్చు.  

 కోవిడ్‌–19తో అసలే తీవ్ర సమస్యల్లో కూరుకుపోయిన ప్రపంచ ఎకానమీకి ఇప్పుడు యుద్ధం మరింత ప్రమాదం తెచ్చిపెట్టే పరిస్థితి నెలకొంది.  

► పెరుగుతున్న ఆహారం, ఇంధన ధరలు అభివృద్ధి చెందుతున్న దేశాలలో అత్యంత పేదలపై దుర్బలమైన తక్షణ ప్రభావం చూపుతాయి. ఫలితంగా తమ ఆదాయంలో అత్యధిక వాటాను ఆహారంపై ఖర్చు చేసే కుటుంబాలు తీవ్ర సమస్యలకు గురయ్యే వీలుంది. వీరి కొనుగోలు శక్తి దారుణంగా పడిపోయే వీలుంది. 

► ఆహారం, ఇంధన దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రమాదం తీవ్రంగా ఉంటుంది. తాజా పరిస్థితులు అధిక ధరలు జీవనోపాధిని తగ్గించడంతోపాటు, పెట్టుబడులను నిరుత్సాహపరుస్తాయి. దీనికితోడు పలు దేశాల వాణిజ్య లోటు భారీగా పెరగడం ఆందోళన కలిగించే అంశం.

మరిన్ని వార్తలు