పది రోజులు సెలవు తీసుకోండి, పండగ చేస్కోండి! ఆ కంపెనీ వినూత్న నిర్ణయం

5 Sep, 2021 10:49 IST|Sakshi

ఉద్యోగుల మానసిక ఆరోగ్యం, ప్రశాంతతే లక్ష్యంగా ఓ స్టార్టప్‌ కంపెనీ వినూత్న నిర్ణయం తీసుకుంది. ఉల్లాసంగా, ఉత్సాహాంగా గడపండంటూ ఉద్యోగులకు ప్రత్యేక సెలవులు ఇచ్చింది. అంతేకాదు ఈ సెలవులు స్పెషల్‌గా ప్లాన్‌ చేసుకునేందుకు వీలుగా రెండు నెలల ముందే హాలిడే షెడ్యూల్‌ సైతం ప్రకటించింది.

పది రోజుల సెలవులు
సోషల్‌కామర్స్‌ రంగంలో స్టార్టప్‌గా మొదలై యూనికార్న్‌ కంపెనీగా ఎదిగింది మీషో సంస్థ. ఉద్యోగులు రేయింబవళ్లు కష్టపడి పని చేయడంతో అనతి కాలంలోనే ఈ సంస్థ మార్కెట్‌ వాల్యూ అనూహ్యంగా పెరిగింది. దీంతో తమ కంపెనీ ఉద్యోగులను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యతను యాజమాన్యం తీసుకుంది. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా ఎంతో ముఖ్యమని భావించింది. దీంతో కంపెనీ ఉద్యోగులందరికీ ఒకేసారి పది రోజుల పాటు సామూహికంగా సెలవులు ప్రకటించింది. 

ఎప్పుడంటే
గత రెండు నెలలుగా కరోనా సంక్షోభ సమయంలోనూ తమ కంపెనీ ఉద్యోగులు రేయింబవళ్లు కష్టపడినట్టు మీషో యాజమాన్యం ప్రకటించింది. దీనికి తోడు రాబోయే దసరా, దీపావళి సీజన్‌లో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని కూడా ముందే తెలిపింది. ఎంతో ఒత్తిడిలో సంస్థ అభివృద్ధికి పాటుపడిన ఉద్యోగులకు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో పీక్‌ సీజన్‌ ముగిసిన తర్వాత 2021 నవంబరు 4 నుంచి 14 వరకు సంస్థలోని ఉద్యోగులకు సెలవులు ప్రకటించింది. అంతేకాదు ఆ పది రోజలు ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపండి అంటూ ఉ‍ద్యోగులకు సూచించింది. 

మీషో ప్రస్థానం
విదిత్‌ ఆత్రేయ్‌ అనే ఔత్సాహిక పారిశ్రామికవేత్త 2016లో మీషోను ప్రారంభించారు. చిన్న కళాకారులు, వ్యాపారులు తమ ఉత్పత్తులను అమ్ముకునేలా మీషోను వేదికగా మార్చారు. బయ్యర్లు, అమ్మకం దార్ల మధ్య మీషోను ప్లాట్‌ఫామ్‌గా చేశారు. కేవలం ఐదేళ్లలోనే ఈ మీషో స్టార్టప్‌ నుంచి యూనికార్న్గా ఎదిగింది. ఉద్యోగుల సంక్షేమం విషయంలో మీషో ఎల్లప్పుడు జాగ్రత్తగానే ఉంటుందనే పేరుంది. ఈ కంపెనీ అంతకు ముందు 64 ఆప్షనల్‌ హలిడేస్‌ను ఉద్యోగుల కోసం ప్రకటించింది.

చదవండి : ఫిట్‌గా ఉన్న ఉద్యోగులకు బంపర్‌ఆఫర్‌ ప్రకటించిన జెరోదా..!

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు