Union Budget 2023-24: ఎంఎస్‌ఎంఈలకు చేయూత..

2 Feb, 2023 06:29 IST|Sakshi

రుణ హామీ పథకానికి రూ. 9,000 కోట్లు

న్యూఢిల్లీ: లఘు, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈ) చేయూతనిచ్చే దిశగా రుణ హామీ పథకాన్ని కేంద్రం మరింత మెరుగ్గా తీర్చిదిద్దింది. ఇందుకోసం రూ. 9,000 కోట్లు కేటాయించింది. 2023 ఏప్రిల్‌ 1 నుంచి ఇది అమల్లోకి రానుంది. అదనంగా రూ. 2 లక్షల కోట్ల తనఖా లేని రుణాలకు ఈ స్కీము ఉపయోగపడగలదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. అలాగే రుణ వ్యయం కూడా 1 శాతం మేర తగ్గుతుందని పేర్కొన్నారు. కోవిడ్‌ కష్టకాలంలో కాంట్రాక్టులను పూర్తి చేయలేని ఎంఎస్‌ఎంఈలకు ఊరటనిచ్చే నిర్ణయం కూడా తీసుకున్నారు.

అవి జమ చేసిన లేదా సమర్పించిన పెర్ఫార్మెన్స్‌ సెక్యూరిటీని జప్తు చేసుకుని ఉంటే.. అందులో 95 శాతం మొత్తాన్ని ప్రభుత్వం, ప్రభుత్వ ఏజెన్సీలు వాపసు చేస్తాయని మంత్రి పేర్కొన్నారు. ఎంఎస్‌ఎంఈలను ఆర్థిక వ్యవస్థ వృద్ధి చోదకాలుగా ఆమె అభివర్ణించారు.  ఎంఎస్‌ఎంఈలు, బడా వ్యాపార సంస్థలు, చారిటబుల్‌ ట్రస్టుల కోసం డిజిలాకర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. పత్రాలను ఆన్‌లైన్‌లో భద్రపర్చుకునేందుకు, అవసరమైనప్పుడు బ్యాంకులు, నియంత్రణ సంస్థలు మొదలైన వాటితో షేర్‌ చేసుకునేందుకు ఇది ఉపయోగపడగలదని మంత్రి చెప్పారు.   

ప్రిజంప్టివ్‌ ట్యాక్సేషన్‌ ఉపశమనం..
ఎంఎస్‌ఎంఈలు ప్రస్తుతం కల్పిస్తున్న ప్రిజంప్టివ్‌ ట్యాక్సేషన్‌ విషయంలో మరింత వెసులుబాటు లభించింది. వృత్తి నిపుణులు అయితే వార్షిక ఆదాయం రూ.50 లక్షల్లోపు, ఎంఎస్‌ఎంఈలు అయితే వార్షిక టర్నోవర్‌ రూ.2 కోట్ల వరకు ఉంటే ఆదాయపన్ను చట్టం కింద ప్రిజంప్టివ్‌ ఇనక్‌మ్‌ (ఊహించతగిన ఆదాయం) పథకానికి అర్హులు. తాజా ప్రతిపాదన ప్రకారం సంస్థలు తమ వార్షిక టర్నోవర్‌ లేదా స్థూల చెల్లింపుల స్వీకరణల్లో నగదు రూపంలో స్వీకరించే మొత్తం 5 శాతంలోపు ఉంటే ప్రిజంప్టివ్‌ స్కీమ్‌ కింద మరింత ప్రయోజనం పొందొచ్చు.

అంటే తమ వార్షిక టర్నోవర్‌లో 5 శాతం లోపు నగదు స్వీకరించే సంస్థలు వార్షిక టర్నోవర్‌ రూ.3 కోట్ల వరకు ఉన్నా, వృత్తి నిపుణుల ఆదాయం రూ.75 లక్షల వరకు ఉన్నా ప్రయోజనానికి అర్హులు. ఎంఎస్‌ఎంఈలకు సకాలంలో చెల్లింపులు జరిపేందుకు వీలుగా.. వాస్తవంగా ఆ చెల్లింపులు చేసినప్పుడే అందుకు అయ్యే వ్యయాలను మినహాయించుకునే విధంగా నిబంధనలు మార్చారు. ప్రిజంప్టివ్‌ స్కీమ్‌ నిబంధనల కింద చిన్న వ్యాపార సంస్థలు తమ టర్నోవర్‌లో 8 శాతం కింద (నాన్‌ డిజిటల్‌ రిసీప్ట్స్‌) లాభంగాను, డిజిటల్‌ లావాదేవీల రూపంలో స్వీకరించినట్టయితే టర్నోవర్‌లో 6 శాతాన్ని లాభం కింద చూపించి పన్ను చెల్లిస్తే సరిపోతుంది. 

మరిన్ని వార్తలు