Union Budget 2023: నిర్మలమ్మా.. 9 ఏళ్లు అయ్యింది, ఈ సారైనా పెంపు ఉంటుందా?

30 Jan, 2023 16:28 IST|Sakshi

ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ని ఫిబ్రవరి నెలలో పార్లమెంట్‌లో ప్రవేశపెడుతోంది. అయితే గత కొన్నేళ్లుగా మధ్య తరగతి ప్రజలకు ఉపశమనం కలిగించే పన్ను ఆంశం మాత్రం మోదీ సర్కార్‌ దాటేస్తూ వస్తోంది. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్డీయే ప్రభుత్వానికి ఇదే చివరి పూర్తి స్థాయి బడ్జెట్‌ కావడంతో ఈ సారైన ఈ వర్గం ప్రజలు ఆశించిన రాయితులు, పరమితుల, కేటాయింపులు ఉంటాయని భావిస్తున్నారు. 

అప్పుడేప్పుడు పెంచిన పరిమితి.. ఇప్పటి వరకు ఆ ఊసే లేదు
ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. రూ.2.5 లక్షల వరకు ఆదాయం కలిగిన వారికి ఎలాంటి ఆదాయపన్ను ఉండదు. ఈ రూల్‌..  2014–2015 సంవత్సరానికి ఆదాయపన్ను బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నాటి ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ రూ.2 లక్షలుగా ఉన్న పరిమితిని రూ.2.5 లక్షలు చేశారు. 60 ఏళ్లు నిండిన వృద్ధులకు ఇది రూ.3 లక్షలుగా, రూ.80 ఏళ్లు నిండిన వారికి రూ.5 లక్షలకు పెంచారు. తొమ్మిదేళ్లు గడుస్తున్న ఈ బేసిక్‌ పరిమితిలో ఏ మార్పులు లేకుండా ఇలానే కొనసాగుతోంది. అయితే రూ.2.51–5 లక్షల వరకు ఆదాయం ఉన్నా పన్ను చెల్లించే అవసరం లేకుండా తర్వాతి కాలంలో రాయితీ కల్పించినప్పటికీ, బేసిక్‌ పరిమితిలో మార్పులు చేయలేదు. ఈ ఏడాది బడ్జెట్‌ 2023లోనైనా ఈ పరిమితి పెంపును కోరుకుంటున్నారు మధ్య తరగతి ప్రజలు.

బేసిక్‌ పరిమితి పెంచాలి.. ఎందుకంటే!
గణనీయంగా పెరిగిపోయిన జీవన వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని దీన్ని రూ.5–6 లక్షలు చేయాలనే డిమాండ్‌ ప్రజల నుంచి వినిపిస్తోంది. ఈ కానుక ఉంటుందనే అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. లేదంటే రూ.50వేలుగా ఉన్న స్టాండర్డ్‌ డిడక్షన్‌ను పెంచుతారేమో చూడాలి. అలాగే, సెక్షన్‌ 80సీ కింద వివిధ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల ఆదాయంపై పన్ను లేకుండా ఉపశమనం పొందొచ్చు. దీన్ని కూడా రూ.2–3 లక్షలకు పెంచాలనే డిమాండ్లు నెలకొన్నాయి. అలాగే, గరిష్ట పన్ను రేటు 30 శాతం అమలుకి ఆదాయపన్ను పరిమితిని పెంచాలన్న డిమాండ్‌ బలంగా ఉంది.

ప్రస్తుతం వార్షికాదాయం రూ.10లక్షలకు మించితే పాత పన్ను విధానంలో 30 శాతం రేటు అమలు చేస్తున్నారు. రూ.20 లక్షల వరకు ఆదాయం ఉండే వారికి 20 శాతం మించి పన్ను ఉండరాదన్నది నిపుణుల సూచనగా ఉంది. పన్ను భారం తగ్గించడం వల్ల మధ్య తరగతి, వేతన జీవులకు ఖర్చు చేసే ఆదాయం మరింత మిగులుతుంది. ఇది వినియోగంలోకి మారి, డిమాండ్‌కు ఊతం ఇస్తుందన్న విశ్లేషణ వినిపిస్తోంది. పన్నుల భారం తగ్గించడం ఒక కోణం అయితే, సామాన్యులు, మధ్యతరగతి వాసులపై కొత్తగా ఏ రూపంలోనూ పన్నుల భారం మోపకుండా ఉండడం కీలకం కానుంది. మరోవైపు ధరల భారం ఎక్కువ మందిని భయపెడుతోంది. కనుక కూరగాయలు, వంట నూనెలు, చమురు ధరల కట్టడికి తీసుకునే చర్యలకూ ఎంతో ప్రాధాన్యం ఉంటుంది.

మరిన్ని వార్తలు