Union Budget 2023: ఆ పథకాలకు పెద్ద పీట, వారికి బిగ్‌ బూస్ట్‌  

28 Jan, 2023 16:40 IST|Sakshi

న్యూఢిల్లీ: రానున్న కేంద్ర బడ్జెట్‌లో సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్‌, ఇతర స్మాల్‌ సేవింగ్‌ పథకాలకు ఊరట లభించనుందా అంటే అవుననే సంకతాలు  వినిపిస్తున్నాయి. ముఖ్యంగా రానున్న ఎన్నికలు, బీజేపీ నేతృత్వంలోని మోదీ సర్కార్‌కు ఈ దఫా చివరి బడ్జెట్‌ నేపథ్యంలో చిన్న పెట్టుబడిదారులకు భారీ ఉపశమనం లభించనుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. సుకన్య సమృద్ధి యోజన, ఇతర చిన్న పొదుపు పథకాలు పెద్ద ప్రోత్సాహాన్ని  అందించే అవకాశం ఉందనే ఊహాగానాలున్నాయి. 

ఎస్‌బీఐ రీసెర్చ్ రిపోర్ట్‌
బడ్జెట్ 2023లో ఆర్థిక లోటును పూరించుకునేందుకు ప్రభుత్వం చిన్న పొదుపు పథకాలపై ఆధారపడే అవకాశం ఉందని, వాటి నుండి దాదాపు రూ. 5 లక్షల కోట్లు సేకరించవచ్చని అంచనా. సుకన్య సమృద్ధి యోజన వంటి చిన్న పొదుపు పథకం 2023-24 కోసం రాబోయే కేంద్ర బడ్జెట్‌లో ఊపందుకోవచ్చని ఎస్‌బీఐ రీసెర్చ్ ఒక నివేదికలో పేర్కొంది. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (ఎస్సీఎస్ఎస్), సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్‌వై) వంటి చిన్న పొదుపు పథకాలకు ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం నుంచి మంచి ప్రోత్సాహం లభించే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం ఈ పథకం 7.6 శాతం వడ్డీ రేటును అందిస్తోంది.  ప్రభుత్వం ఇటీవల చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను పెంచినా ఇందులో ఎస్‌ఎస్‌వైని చేర్చకపోవడం గమనార్హం.

సుకన్య సమృద్ధి యోజన 
చిన్న పొదుపు పథకాలలో సుకన్య సమృద్ధి యోజన (ఎస్ఎస్‌వై) ఒకటి. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015 సంవత్సరంలో ప్రారంభించింది.  10 సంవత్సరాల లోపు ఆడబిడ్డ  ఉన్న తల్లిదండ్రులు ఈ పథకంలో చేరడానికి అర్హులు.  ఈ పథకంలో కేవలం రూ. 250 నుంచి గరిష్టంగా రూ. 1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. అలాగే ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 80సీ ప్రకారం మొత్తం రూ. 1.5 లక్షల పెట్టుబడిపై పన్ను మినహాయింపు లభిస్తుంది. ఏదైనా అధీకృత బ్యాంకు లేదా పోస్టాఫీసులో సుకన్య సమృద్ధి ఖాతాను తెరవవచ్చు. 

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ 
సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన చిన్న మొత్తాల పొదుపు పథకం.  60 యేళ్లకు  మించిన  ప్రతి ఒక్కరూ ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే ముందస్తు పదవీ విరమణ చేసిన 55 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు వారు కూడా  పెట్టుబడి పెట్టవచ్చు. ప్రస్తుతం దీనిపై  8 శాతం వరకు వడ్డీ రేటు అందిస్తోంది.  అలాగే ఈ స్కీంలో ఆదాయపు పన్ను సెక్షన్ 80 సీ కింద పెట్టుబడిపై రూ .1.50 లక్షల వరకు పన్ను మినహాయింపును పొందవచ్చు.
 

మరిన్ని వార్తలు