గత ఎన్నికల ముందు బడ్జెట్‌లో అత్యధిక కేటాయింపులు ఆ రంగాలకే.. మరి ఈ సారి?

30 Jan, 2023 12:52 IST|Sakshi

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బడ్జెట్‌ సమావేశానికి ఇక రెండు రోజులే ఉంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ 2023ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాది బడ్జెట్‌పై కోట్ల ప్రజలు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేం‍ద్రం ప్రవేశపెడుతున్న చివరి పూర్తి స్థాయి బడ్జెట్‌ ఇదే. ప్రస్తుతం రాబోవు బడ్జెట్‌పై ఎన్నో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే 2019 ఎన్నికల ముందు నాటి ప్రవేశపెట్టిన పూర్తి స్థాయి బడ్జెట్‌లో ఎలా ఉంటుందో ఈ తరుణంలో ఒకసారి పరిశీలిస్తే ఈ బడ్జెట్‌పై కాస్త క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.

అప్పటి బడ్జెట్‌ ఎలా ఉందంటే..
గత 9 ఏళ్లుగా మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం తిరగు లేకుండా పాలిస్తున్న సంగతి తెలిసిందే. మరోసారి ప్రజామోదం కోసం ఈ బడ్జెట్‌ను కేంద్రం ఒక అవకాశంగా భావిస్తుందా..? లేక మొదటి నుంచి సంస్కరణల హితమేనన్న తమ విధానానికి కట్టుబడి ఉంటుందా? అన్నది తెలియాలంటే ఫిబ్రవరి 1 వరకు వేచి చూడాల్సిందే. 2019 ఎన్నికల ముందు నాటి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఒకసారి గమనించినట్టయితే.. హెల్త్‌కేర్, పారిశుద్ధ్యం, విద్యా రంగాలకు అంతకుముందు మూడు సంవత్సరాల్లో లేనంతగా కేటాయింపులు పెంచారు.

ఆయుష్మాన్‌ భారత్‌ ఆరోగ్య బీమా పథకాన్ని అరుణ్‌ జైట్లీ ప్రకటించారు. విద్య, సామాజిక భద్రత, ఆరోగ్యం కోసం రూ.1.38 లక్షల కోట్లు కేటాయించారు. ఆదాయపన్నుపై హెల్త్, ఎడ్యుకేషన్‌ సెస్‌ను 3 శాతం నుంచి 4 శాతానికి పెంచారు. ‘‘భారత్‌ ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోంది. అతిపెద్ద యువ జనాభా కలిగి ఉన్న భారత్‌ తన హామీలను అమల్లో పెట్టాల్సిన అవసరం ఉంది’’అని నాడు అరుణ్‌జైట్లీ 2018–19 బడ్జెట్‌ సందర్భంగా ప్రకటించారు.

చదవండి: నమ్మలేకపోతున్నా.. ఇంటర్వ్యూ చేస్తుండగానే ఉద్యోగం ఊడింది

మరిన్ని వార్తలు