Union Budget 2023: 6 నెలల నుంచి మొదలు, బాబోయ్‌ బడ్జెట్‌ తయారీ వెనుక ఇంత కథ నడుస్తుందా!

25 Jan, 2023 20:05 IST|Sakshi

కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెడుతుంది. అయితే ఈ బడ్జెట్ తయారీ అంత సులువు కాదు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ఆరు నెలల ముందు నుంచే ఈ పనులు ప్రారంభమవుతాయి. ఎన్నో ప్రక్రియలు దశలు దాటి చివరికి పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఈ క్రమంలో బడ్జెట్ అంటే ఏమిటి, ఎలా తయారు చేస్తారు? దీని వెనుక జరిగే పూర్తి వివరాలను తెలుసుకుందాం.

నీతి ఆయోగ్, ఇతర సంబంధిత మంత్రిత్వ శాఖలతో సంప్రదించి ఆర్థిక మంత్రిత్వ శాఖ దీనిని తయారు చేస్తుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ (DEA) బడ్జెట్ విభాగం బడ్జెట్‌ను రూపొందించడానికి నోడల్ బాడీగా వ్యవహరిస్తుంది. బడ్జెట్ తయారీ ప్రక్రియ ఆగస్టు-సెప్టెంబర్‌లో ప్రారంభమవుతుంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ముందు అంటే ఏప్రిల్ 1న పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాల్సి ఉంటుంది.

1) అన్ని మంత్రిత్వ శాఖలకు సర్క్యులర్ల జారీ
ఆర్థిక మంత్రిత్వ శాఖ అన్ని మంత్రిత్వ శాఖలు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, స్వయంప్రతిపత్తి గల సంస్థలకు వచ్చే ఏడాది అంచనాలను సిద్ధం చేయాలని కోరుతూ ఒక సర్క్యులర్ జారీ చేస్తుంది. ఈ సర్క్యులర్‌లో​ మంత్రిత్వ శాఖలు తమ డిమాండ్‌లను సమర్పించడానికి అవసరమైన మార్గదర్శకాలను కలిగి ఉంటాయి. మంత్రిత్వ శాఖలు తమ అంచనాలను అందించడమే కాకుండా, గత సంవత్సరంలో తమ ఆదాయాలు, ఖర్చుల వివరాలను కూడా అందిస్తాయి.

2) అందుకున్న ప్రతిపాదనలపై సంప్రదింపులు
అభ్యర్థనలు స్వీకరించిన తర్వాత, దానిని ప్రభుత్వ ఉన్నతాధికారులు పరిశీలిస్తారు. మంత్రిత్వ శాఖలు,  వ్యయ శాఖ మధ్య విస్తృతమైన సంప్రదింపులు జరుగుతాయి. ఆపై ఆమోదం పొందిన తర్వాత, డేటా ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపుతారు

3) ఆదాయాల కేటాయింపు
ఆర్థిక మంత్రిత్వ శాఖ, అన్ని సిఫార్సులను పరిశీలించిన తర్వాత, వివిధ శాఖలకు వారి భవిష్యత్తు ఖర్చుల కోసం ఆదాయాన్ని కేటాయిస్తుంది. నిధుల కేటాయింపుపై ఏదైన సమస్య తలెత్తితే, ఆర్థిక మంత్రిత్వ శాఖ కేంద్ర మంత్రివర్గం లేదా ప్రధానమంత్రిని సంప్రదిస్తుంది. మరోవైపు.. వ్యవసాయ నిపుణులు, చిన్న తరహా పరిశ్రమల ప్రొప్రైటర్స్, విదేశీ సంస్థాగత మదురులతోనూ ఆర్థిక వ్యవహారాల విభాగం చర్చలు చేపడుతుంది.

4) ప్రీ-బడ్జెట్ సమావేశాలు
అందిన ప్రతిపాదనలు డిమాండ్ల గురించి తెలుసుకోవడానికి ఆర్థిక మంత్రి వివిధ శాఖల నిపుణులతో ప్రీ-బడ్జెట్ సమావేశాలను నిర్వహిస్తారు. ఇందులో రాష్ట్ర ప్రతినిధులు, బ్యాంకర్లు, వ్యవసాయదారులు, ఆర్థికవేత్తలు, ట్రేడ్ యూనియన్లు ఉంటారు. బడ్జెట్‌కు ముందు సంప్రదింపులు పూర్తయిన తర్వాత, ఆర్థిక మంత్రి అన్ని డిమాండ్లపై తుది పిలుపునిస్తారు. ఖరారు చేసే ముందు ప్రధానితో కూడా చర్చిస్తారు.

5) బడ్జెట్ ప్రతుల ప్రింటింగ్‌..
ప్రతి సంవత్సరం, బడ్జెట్‌ను సమర్పించడానికి కొన్ని రోజుల ముందు హల్వా వేడుకను నిర్వహించే వార్షిక సంప్రదాయాన్ని ప్రభుత్వం అనుసరిస్తుంది. ఈ వేడుక బడ్జెట్ పత్రాల ముద్రణ ప్రారంభాన్ని సూచిస్తుంది.

ఆచారంలో భాగంగా, 'హల్వా'ను పెద్ద 'కడాయ్' లో తయారు చేస్తారు. ఈ స్వీటును ఆర్థిక మంత్రిత్వ శాఖలోని మొత్తం సిబ్బందికి వడ్డిస్తారు. ఈ ఈవెంట్‌కు ఉన్న ప్రాముఖ్యత ఏమిటంటే..బడ్జెట్ రూపకల్పనతో ప్రత్యక్షంగా సంబంధం ఉన్న పెద్ద సంఖ్యలో అధికారులు, సహాయక సిబ్బందికి ఈ వంటకాన్ని వడ్డిస్తారు. బడ్జెట్ ప్రవేశపెట్టే వరకు వారందరు బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా పని చేస్తారు.


6)బడ్జెట్ సమర్పణ

పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టడం బడ్జెట్ తయారీకి చివరి దశ. ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి ఈ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ఆ తర్వాత ప్రభుత్వం చేపట్టబోయే కీలక ప్రాజెక్టులపై సుదీర్ఘ ప్రసంగంతో పాటు హాల్‌లోని సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తారు. ఆ తరువాత బడ్జెట్‌ను ఉభయ సభల ముందు ఉంచుతారు. పార్లమెంట్‌లో బడ్జెట్‌ ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం కోసం పంపుతారు.

చదవండి: బడ్జెట్‌ 2023: కేంద్రం ఫోకస్‌ పెట్టనున్న కీలక అంశాలు ఇవేనా!

మరిన్ని వార్తలు