Union Budget 2023: మురిసి ‘పడిన’ మార్కెట్!

2 Feb, 2023 04:09 IST|Sakshi

బడ్జెట్‌ మెప్పించినా... లాభాలు ఆవిరి

ఫెడ్‌ రిజర్వ్‌ ద్రవ్య పాలసీ వెల్లడికి ముందు అప్రమత్తత

కలవరపెట్టిన అదానీ గ్రూప్‌ షేర్లలో భారీ అమ్మకాలు

గరిష్ట స్థాయిల వద్ద లాభాల స్వీకరణ

ద్వితీయార్థంలో రోలర్‌ కోస్టర్‌ రైడ్‌

ఎదురీదిన ఎఫ్‌ఎంసీజీ, ఐటీ షేర్లు

బడ్జెట్లో వృద్ధి మంత్రంతో తారాజువ్వలా దూసుకెళ్లిన స్టాక్‌ మార్కెట్లు... అంతలోనే చప్పున చల్లారిపోయాయి. మౌలిక రంగానికి భారీగా కేటాయింపులను పెంచుతూ.. మధ్యతరగతి వర్గాలకు ఐటీ ఊరటనిచ్చిన నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ను అంతా స్వాగతించారు. కానీ, ఊహించని పరిణామాలతో మార్కెట్‌ లాభాలన్నీ ఆవిరైపోయాయి. అదానీ షేర్లు బేర్‌ గుప్పిట్లో చిక్కుకోవడంతో మార్కెట్‌ రోలర్‌ కోస్టర్‌ను తలపించింది.

ముంబై: వృద్ధి ప్రోత్సాహక బడ్జెట్‌ లాభాలను నిలుపుకోవడంలో స్టాక్‌ మార్కెట్‌ విఫలమైంది. కేంద్రమంత్రి ప్రసంగం ఆసాంతం భారీ లాభాలను ఆర్జించిన సూచీలు ఆరంభ లాభాలను కోల్పోయి మిశ్రమంగా ముగిశాయి. ట్రేడింగ్‌లో 1,958 పాయింట్ల పరిధిలో ట్రేడైన సెన్సెక్స్‌ చివరికి 158 పాయింట్లు లాభంతో 59,708 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో నిఫ్టీ 619 పాయింట్ల రేంజ్‌లో ట్రేడైంది. ఆఖరికి 46 పాయింట్ల నష్టంతో 17,616 వద్ద నిలిచింది. ద్వితీయార్థంలో నెలకొన్న అమ్మకాల సునామీలో ఐటీ, ఎఫ్‌ఎంసీజీ రంగాల షేర్లు మాత్రమే స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ప్రభుత్వరంగ బ్యాంక్స్, మెటల్‌ షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌ క్యాప్‌ సూచీలు ఒకశాతం చొప్పున నష్టపోయాయి.  

ప్రథమార్థంలో భారీ లాభాలు
బడ్జెట్‌పై ఆశలతో ఉదయం సూచీలు ఉత్సాహంగా మొదలయ్యాయి. సెన్సెక్స్‌ 451 పాయింట్ల లాభంతో 60001 వద్ద, నిఫ్టీ 17,812 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. వ్యక్తిగత ఆదాయ పన్ను మినహాయింపు, మూలధన వ్యయం భారీ పెంపు, ఎల్‌టీసీజీ పన్ను జోలికెళ్లకపోవడంతో ఇన్వెస్టర్లకు ఉత్సాహాన్నిచ్చాయి. ఫలితంగా ప్రథమార్థంలో సెన్సెక్స్‌ 1,223 పాయింట్లు ఎగసి 60,773 వద్ద, నిఫ్టీ 310 పాయింట్లు దూసుకెళ్లి 17,662 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేశాయి.   

మిడ్‌సెషన్‌ నుంచి లాభాల స్వీకరణ   
కేంద్ర మంత్రి ప్రసంగం ఆసాంతం అనూహ్యమైన ర్యాలీ చేసిన సూచీలు చివరి వరకు ఆ జోరును నిలుపుకోలేకపోయాయి. ట్రేడింగ్‌ ద్వితీయార్థంలో అదానీ గ్రూప్‌ షేర్లలో అనూహ్య అమ్మకాలు తలెత్తాయి. ఫెడ్‌ ద్రవ్య విధాన వైఖరి వెల్లడి నేపథ్యంలో అప్రమత్తత చోటు చేసుకుంది. గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో సెన్సెక్స్‌ ఇంట్రాడే గరిష్టం(60,773) నుంచి 1,958 పాయింట్లు పతనమై 58,817 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ గరిష్టం(17,972)నుంచి 619 పాయింట్లు క్షీణించి 17,353 వద్ద ఇంట్రాడే కనిష్టానికి దిగొచ్చింది.  

అదానీ గ్రూప్‌ షేర్లు విలవిల...  
అదానీ గ్రూప్‌ సంస్థలపై హిండెన్‌బర్గ్‌ రీసెర్చ్‌ నివేదిక వెల్లడి నేపథ్యంలో క్రెడిట్‌ సూయిజ్‌ షాక్‌ ఇచ్చింది. అదానీ కంపెనీల రుణాల బాండ్లను స్వీకరించడం నిలిపివేసింది. దీంతో బుధవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లలో అదానీ స్టాక్స్‌ అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. ఈ గ్రూప్‌నకు చెందిన పది కంపెనీల షేర్లు నష్టాలతో ముగిశాయి. అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 26%, అదానీ పోర్ట్స్‌ 18%, అదానీ టోటల్‌ గ్యాస్‌ 10%, అంబుజా సిమెంట్స్‌ 17%, అదానీ గ్రీన్‌ ఎనర్జీ షేర్లు 6% క్షీణించాయి. అదానీ పవర్, అదానీ విల్మార్, ఎన్‌డీటీవీ షేర్లు 5% లోయర్‌ సర్క్యూట్‌ తాకాయి. బుధవారం ఒక్కరోజే ఈ గ్రూప్‌ రూ.2 లక్షల కోట్ల మార్కెట్‌ క్యాప్‌ను కోల్పోయింది.

మార్కెట్లో మరిన్ని సంగతులు...
► వార్షిక ప్రీమియం రూ.5 లక్షలకుపైన జీవిత బీమా పాలసీలపై పన్ను విధింపుతో బీమా కంపెనీల షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. ఎల్‌ఐసీ 4%, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ 7%, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ 6%, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్, జనరల్‌ ఇన్సూరెన్స్‌ షేర్లు తొమ్మిది శాతం చొప్పున నష్టపోయాయి.  
► మౌలిక వసతులకు పెద్దపీట వేస్తూ రూ.10 లక్షల కోట్ల నిధుల కేటాయింపు మౌలిక సదుపాయాల కంపెనీ షేర్లకు కలిసొచ్చింది. ఈ రంగానికి చెందిన సైమన్స్‌ 4%, కేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్, హెచ్‌జీ ఇన్‌ఫ్రా ఇంజనీరింగ్‌ 3%, ఎల్‌అండ్‌టీ 1.50%,  అశోక బిల్డ్‌కాన్‌ 1.21% చొప్పున లాభపడ్డాయి.  
► సిగరెట్లపై 16 శాతం పన్ను పెంపుతో గోడ్‌ఫ్రే ఫిలిప్స్, ఎన్‌టీసీ ఇండస్ట్రీస్, వీటీఎస్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు 6%, 3.50%, మూడుశాతం నష్టపోయాయి. మరోవైపు గోల్డెన్‌ టొబాకో 4.58%, ఐటీసీ 2.50% చొప్పున లాభపడ్డాయి.   
► బడ్జెట్‌లో నిధులు కేటాయించడంతో రియల్టీ, రైల్వే రంగ షేర్లు ప్రథమార్థంలో భారీగా ర్యాలీ చేశాయి. అయితే మార్కెట్‌ పతనంలో భాగంగా ఈ రంగాల షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. రియల్టీ రంగ షేర్లు నాలుగు శాతం, రైల్వే షేర్లు తొమ్మిది శాతం చొప్పున నష్టపోయాయి.
► ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన పథకానికి తాజా బడ్జెట్‌లో రూ.79 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించడంతో సిమెంట్‌ రంగ షేర్లు బలపడ్డాయి. ఇండియా సిమెంట్స్, రామ్‌కో సిమెంట్స్, శ్రీరాం సిమెంట్స్, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌ షేర్లు 4–1% చొప్పున లాభపడ్డాయి.


స్టాక్‌ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపే అంశాలేవీ బడ్జెట్‌పై లేవు. వినియోగ ప్రాధాన్యత, మూలధన వ్యయం పెంపుతో తొలి దశలో ఆశావాదంతో ట్రేడయ్యాయి. బుల్స్‌ మెచ్చిన బడ్జెట్‌ ఇది.  అయితే అదానీ గ్రూప్‌ సంక్షోభం, ఫెడ్‌ రిజర్వ్‌ ద్రవ్య పాలసీ నిర్ణయాల వెల్లడికి అప్రమత్తత సెంటిమెంట్‌ను
పూర్తిగా దెబ్బతీశాయి.

– ఎస్‌ రంగనాథన్, ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ హెడ్‌ 

మరిన్ని వార్తలు