భారత్‌–బ్రిటన్‌ మధ్య ఎఫ్‌టీఏ చర్చలు ప్రారంభం

14 Jan, 2022 10:11 IST|Sakshi

డిసెంబరు నాటికి గడువు 

న్యూఢిల్లీ: ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై భారత్, బ్రిటన్‌ మధ్య చర్చలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియుష్‌ గోయల్, బ్రిటన్‌ అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రి యానీ–మేరీ ట్రెవిల్యాన్‌ వీటిని ప్రారంభించారు. రెండు పక్షాలు వ్యాపార అవకాశాలు అందిపుచ్చుకునేందుకు, భారత్‌–బ్రిటన్‌ మధ్య వస్తు, సేవల లావాదేవీల పరిమాణాన్ని పెంచుకునేందుకు తోడ్పడేలా వీలైనంత త్వరగా ఒప్పందం కుదిరేలా ఇరు దేశాల బృందాలు క్రియాశీలకంగా వ్యవహరించగలవని ఆశిస్తున్నట్లు గోయల్‌ తెలిపారు. 

జనవరి 17 నుంచి
తొలి విడత చర్చలు పూర్తి స్థాయిలో జనవరి 17 నుంచి ప్రారంభమవుతాయి. ఆ తర్వాత ప్రతి అయిదు వారాలకోసారి ఇరు దేశాల బృందాలు సమావేశమవుతాయి. 2022 డిసెంబర్‌ నాటికి చర్చలను ముగించాల్సి ఉంటుంది. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసుకునేందుకు, ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత మెరుగుపర్చుకునేందుకు తోడ్పడటం ఈ ఒప్పంద లక్ష్యం. ముందుగా, సుదీర్ఘ సమయం పట్టేసే సున్నితమైన అంశాల జోలికి పోకుండా, ఇరు దేశాలకు ఆమోదకరంగా, ప్రయోజనకరంగా ఉండే విషయాలపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించినట్లు గోయల్‌ వివరించారు. నిర్దేశించుకున్న గడువులోగా సులువుగానే ఒప్పందం కుదిరే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. భారత్, బ్రిటన్‌లోని మధ్య, లఘు పరిశ్రమలకు సమగ్రమైన, సముచితమైన, సమతుల్యమైన ఎఫ్‌టీఏ ప్రయోజనాలు అందించాలన్నదే రెండు దేశాల లక్ష్యమని మంత్రి చెప్పారు. 

ఎగుమతులకు ఊతం.. 
రంగాలవారీ సహకారం, మార్కెట్‌ సమస్యల పరిష్కారం.. వాణిజ్యపరమైన ఆంక్షల ఎత్తివేత తదితర చర్యల ద్వారా ఎగుమతులకు ఊతమిచ్చేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడగలదని గోయల్‌ తెలిపారు. భారత్‌లో తయారయ్యే లెదర్, ప్రాసెస్డ్‌ అగ్రి ఉత్పత్తులు, టెక్స్‌టైల్, జ్యుయలరీ మొదలైన వాటి ఎగుమతులకు మరింత దన్ను లభిస్తుందని పేర్కొన్నారు. ఐటీ, ఐటీఈఎస్, నర్సింగ్, విద్య, వైద్యం వంటి సర్వీసుల ఎక్స్‌పోర్ట్‌లను పెంచుకునేందుకు అవకాశాలు ఉంటాయని చెప్పారు. మరోవైపు ఈ దశాబ్దం ఆఖరు నాటికి రెండు దేశాల మధ్య వాణిజ్యాన్ని రెట్టింపు చేసుకోవాలని, ఉద్యోగాలు.. వ్యాపారాలకు తోడ్పాటు అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు ట్రెవిల్యాన్‌ వివరించారు.  
 

మరిన్ని వార్తలు