కమల్‌ కా ఖద్దర్‌.. వస్త్ర వ్యాపారంలోకి లోకనాయకుడు

16 Nov, 2021 11:17 IST|Sakshi

Kamal Haasan to launch 'KH House of Khaddar' Business: నటనలో మేరునగధీరుడు కమల్‌హాసన్‌ వస్త్ర వ్యాపారంలోకి అడుగు పెట్టబోతున్నారు. భారతీయ ఖద్దరుని పాశ్చాత్య ప్రపంచానికి పరిచయం చేసేందుకు రెడీ అవుతున్నారు. కేహెచ్‌ హౌజ్‌ ఆఫ్‌ ఖద్దర్‌ బ్రాండ్‌తో ఈ వస్త్రాలు మార్కెట్‌లోకి తేనున్నారు. బ్రాండ్‌ ప్రమోషన్‌లో భాగంగా రెడీ చేసిన ప్రోమోను ట్విట్టర్‌లో ఆయన షేర్‌ చేశారు. 

కమల్‌తో గుర్తింపు
కమల్‌హాసన్‌ ఖద్దరు దుస్తుల వ్యాపారంలోకి రావడం వల్ల ఖద్దరుకి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వస్తుందని. తద్వారా చేనేత కార్మికులకు మేలు జరుగుతుందంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

చిత్తూరు ఎఫెక్ట్‌
ప్రస్తుతం కమల్‌హాసన్‌ విక్రమ్‌, ఇండియన్‌ 2 చిత్రాల్లో నటిస్తున్నారు. ఇందులో ఇండియన్‌ 2 చిత్రానికి మన చిత్తూరుకి చెందిన అమృత కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పని చేస్తున్నారు. రాయలసీమ ప్రాంతంలో ఖద్దరు దుస్తులకు డిమాండ్‌ ఎక్కువ. అమృత ద్వారా ఇండియన్‌ 2 చిత్రాల్లో ఖద్దరుతో కమల్‌కి అనుబంధం ఎక్కువైంది.

ఎన్నికల హామీ
మరోవైపు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంచీపురంలో చేనేత కార్మికులను ఆదుకునేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానంటూ కమల్‌ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వెస్ట్రన్‌ వరల్డ్‌కి ఖద్దరుని పరిచయం చేయాలని కమల్‌ డిసైడ్‌ అయ్యారు. అందులో భాగంగా కేహెచ్‌ ‍ బ్రాండ్‌ని తెర మీదకు తీసుకొచ్చారు.

ఖద్దరు ఫ్యాషన్‌
ప్రస్తుతం ఖద్దరు దుస్తులంటే రాజకీయ నాయకులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులే ఎక్కువ ధరిస్తారనే ముద్ర పడిపోయింది. ఈ ట్రెండ్‌ని కమల్‌ బ్రేక్‌ చేసేలా ఉన్నారు. ఖద్దరుతో పూర్తిగా సూటుబూటులో జేమ్స్‌బాండ్‌ కనిపిస్తూ ప్రమోషన్‌ ప్రారంభించారు. అందుకు తగ్గట్టుగానే ప్రమోషన్‌ యాడ్‌ చివర్లో ‘ఫ్యాషన్ ఈజ్‌ సివిల్‌, యేట్‌ డిస్‌ఒబీడియెంట్‌’ అంటూ మీసం మెలేశారు. ఇండియన్‌ యూత్‌ వెస్ట్రన్‌ మెన్‌ టార్గెట్‌గా ఆయన ఖద్దరు తేబోతున్నట్టు తెలుస్తోంది.


 

చదవండి: ఆ నమ్మకమే.. ఆయన్ని ఈ వయసులోనూ ‘కింగ్‌’గా నిలబెట్టింది

మరిన్ని వార్తలు