Apple iPhone: యాపిల్‌ లోగోను టచ్‌ చేసి చూడండి.. అదిరిపోద్దంతే..!

15 Nov, 2021 18:04 IST|Sakshi

స్మార్ట్‌ ఫోన్‌లలో రారాజు ఐఫోన్‌. ఫోన్‌లు ఎన్ని ఉన్నా ఐఫోన్‌ తర్వాతనే ఏదైనా. అటు ఫీచర్లు, ఇటు సెక్యూరిటీ విషయంలో మిగిలిన ఫోన్‌ల కంటే ఐఫోన్‌ చాలా భిన్నంగా ఉంటుంది. అయితే ఇన్ని హంగులున్న ఈ ఐఫోన్‌ ధర మాత్రం ఎక్కువే. అందుకే ఆ ఫోన్‌ సామాన్యులకు అందని ద్రాక్షాగా మిగిలిపోయింది. దీనికి తోడు ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ కంటే యాపిల్‌ ఐఓఎస్‌ వెర్షన్‌ ను ఆపరేట్‌ చేయడం చాలా కష్టం. ఇప్పటికీ ఆ ఫోన్‌లను వినియోగించే వారికి ఫోన్‌లో ఉండే ఫీచర్లు గురించి తెలియదంటే నమ్మశక్యం కాదు, కానీ ఇది వాస్తవం..! అయితే అటువంటి ఐఫోన్‌లో ఓ సూపర్‌ ఫీచర్‌ ఉంది. ఆ ఫీచర్‌ ఫోన్‌ లోపల కాదు. బయటే? అదెలా అంటారా? 

ఐఫోన్‌ లోగో 
యాపిల్‌ ఐఫోన్‌లో యూజర్లను ఎట్రాక్ట్‌ చేసేది లోగోనే. తాజాగా లోగోను మరింత యూజర్‌ ఫ్రెండ్లీగా మార్చేసింది యాపిల్‌ సంస్థ. ఫోన్‌లపై దిష్టిబొమ్మలాగ ఉండేలోగోలు కూడా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయా అనే అనుమానం రావొచ్చు. యూకేకి చెందిన ప్రముఖ మీడియా 'డైలీ రికార్డ్‌' కథనం ప్రకారం.. యాపిల్‌ సంస్థ గతేడాది సెప్టెంబర్‌ 16న ఐఓఎస్‌ 14ను అందుబాటులోకి తెచ్చింది. యాక్సిలేటర్‌ ఆధారంగా పనిచేసేలా ఐఫోన్‌ 8 నుంచి ఆపై మోడల్స్‌ అన్నింటిలో బ్యాక్‌ ట్యాప్ ఫీచర్‌ను పరిచయం చేసింది. ఆ ఫీచర్‌ ఉన్న ఐఫోన్‌పైన ఉండే లోగోను రెండు లేదా మూడుసార్లు టచ్‌ చేస్తే చాలు ఫోన్‌లోపల ఉండే అప్లికేషన్‌లు డీఫాల్ట్‌గా పనిచేస్తాయని డైలీ రికార్డ్‌ తన కథనంలో పేర్కొంది. 

ఐఫోన్‌లో బ్యాక్ ట్యాప్ ఉపయోగించి ఇంకేం చేయొచ్చో?
యాపిల్‌ లోగోను 'బ్యాక్ ట్యాప్'గా ఉపయోగించడం ద్వారా వాల్యూమ్‌ను తగ్గించడం, పెంచడం, స్క్రీన్‌షాట్‌లను తీయడం, హోమ్ స్క్రీన్‌కి వెళ‍్లడం లేదంటే సెట్టింగ్‌లో మీరు సెలక్ట్‌ చేసుకున్న యాప్స్‌లలో ఎంటర్‌ అవ్వొచ్చు. అంతేకాదు మాగ్నిఫైయర్, వాయిస్ ఓవర్, అసెస్టీవ్‌ టచ్, సిరి షార్ట్‌కట్‌, రీచబిలిటీ వంటి ఫీచర్‌లను ఈజీగా యాక్సెస్‌ చేయొచ్చు.  

మీరు ఐఫోన్‌ను వినియోగిస్తుంటే 
మీరు ఐఫోన్‌ 8 కానీ, ఆ తర్వాత సిరీస్‌ ఫోన్‌లను వినియోగిస్తుంటే ఈ బ్యాక్‌ ట్యాప్‌ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు ఫోన్‌లో లేటెస్ట్‌ ఓస్‌ వెర్షన్‌ను అప్‌డేట్‌ చేసి ఉండాలి.

'బ్యాక్ ట్యాప్' ఫీచర్‌ను వినియోగించడం చాలా సులభం. మీ ఐఫోన్‌లో సెట్టింగ్‌ ఆప్షన్‌ పై క్లిక్‌ చేయాలి >> క్లిక్‌ చేస్తే యాక్సెసిబిలిటీ ఆప్షన్‌ ఓపెన్‌ అవుతుంది >> అందులో  టచ్ అనే ఆప్షన్‌ క్లిక్‌ చేయాలి >> క్లిక్‌ చేస్తే మీరు బ్యాక్ ట్యాప్‌ ఆప్షన్‌లోకి వెళతారు.

చదవండి: 'డాక్టర్ బాబు' నీ సేవలకు సలాం.. ఐఫోన్‌13తో కళ్లకు ట్రీట్మెంట్‌

మరిన్ని వార్తలు