భారత్‌కంటూ ప్రత్యేక లక్షణాలు ఉన్నాయ్‌.. డోంట్‌ వర్రీ!

22 Sep, 2022 08:39 IST|Sakshi

అమెరికా, యూరోజోన్‌ మాంద్యం వైపు అడుగులు వేస్తున్నప్పటికీ, భారత్‌ ఈ ప్రభావాన్ని ఎదుర్కొనే అవకాశం లేదని గ్లోబల్‌ రేటింగ్‌ ఏజెన్సీ ఎస్‌అండ్‌పీ అంచనావేసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో భారత్‌ ఆర్థిక వ్యవస్థ ‘‘పూర్తిగా అనుసంధానం’’కాని స్వభావం దీనికి కారణమని విశ్లేషించింది. ‘‘భారతదేశం ఇంధన నికర దిగుమతిదారు. అయినప్పటికీ,  దేశీయ పటిష్ట డిమాండ్‌ కారణంగా భారత్‌కంటూ ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి.

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుండి భారత ఆర్థిక వ్యవస్థ ఎన్నో విషయాల్లో విడిగా ఉందనే భావించాల్సి ఉంటుంది. భారత్‌కు ఒకవైపు తగినంత ఫారెక్స్‌ నిల్వలు ఉన్నాయి. అలాగే కంపెనీలు పటిష్ట బ్యాలెన్స్‌ షీట్లను నిర్వహిస్తున్నాయి’’అని ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ చీఫ్‌ ఎకనామిస్ట్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ పాల్‌ ఎఫ్‌ గ్రున్‌వాల్డ్‌ ఇక్కడ విలేకరులతో అన్నారు. గ్లోబల్‌ మార్కెట్లతో అనుసంధానం విషయంలో కూడా భారత్‌ మిగిలిన దేశాలతో పోల్చితే స్వతంత్రంగా వ్యవహరిస్తోందని అన్నారు.   

వృద్ధి 7.3 శాతం...
అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ, భారత్‌ 2022–23 ఆర్థిక సంవత్సరంలో 7.3 శాతం వృద్ధి నమోదుచేసుకుంటుందని, 2023–24లో ఈ రేటు 6.5 శాతానికి తగ్గుతుందని భావిస్తున్నట్లు క్రిసిల్‌ రేటింగ్స్‌ (ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌కు క్రిసిల్‌ రేటింగ్స్‌లో మెజారిటీ వాటా) చీఫ్‌ ఎకనమిస్ట్‌ డీకే జోషి పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలతో ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ చీఫ్‌ ఎకనామిస్ట్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ పాల్‌ ఎఫ్‌ గ్రున్‌వాల్డ్‌ దాదాపు ఏకీభవిస్తూ, ‘‘పలు ప్రతికూలతలు ఉన్నప్పటికీ, భారతదేశం మిగతా ప్రపంచం కంటే చాలా మెరుగ్గా పని చేస్తుంది’’ అని అన్నారు.

చదవండి: అమెరికా చెప్పినా వినలేదు.. అందుకే రూ.35వేల కోట్లు లాభం వచ్చింది!

మరిన్ని వార్తలు